కరీంనగర్ జిల్లా కోరుట్లలో కొద్దిసేపటిక్రితం టీఆర్ఎస్ బహిరంగసభ ప్రారంభమైంది. గులాబీ జెండాల రెపరెపలతో సభమొత్తం గులాబీమయమవగా, పెద్దఎత్తున ప్రజలు ఈ సభలో పాల్గొన్నారు. టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మాట్లాడుతూ 14సంవత్సరాల సుదీర్ఘపోరాటం, త్యాగాల ఫలితమే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అని, తెలంగాణ ఎవరిచేతిలో ఉంటే బాగుంటుందో ఆలోచించి ఓటెయ్యాలని కేసీఆర్ సూచించారు. ఈ ఎన్నికల్లో తెలంగాణ భవిష్యత్ తరాలకు అనుకూలంగా ఓటు వేయకుంటే మళ్ళీ కష్టాలు తప్పవని, టీఆర్ఎస్ అధికారంలోకి రావడమే తెలంగాణకు శ్రీరామ రక్ష అని స్పష్టం చేశారు.
తెలంగాణ బిల్లు రూపకల్పనలో టీఆర్ఎస్ పాత్రలేదని కరీంనగర్ బహిరంగసభలో సోనియాగాంధీ చెప్పిందని, మా పాత్ర లేనప్పుడు మీకూ, మాకూ సంబంధం ఏముంటుందని పొన్నాలను కేసీఆర్ ప్రశ్నించారు. కేసీఆర్ అక్రమంగా ఆస్తులు సంపాదించాడని పొన్నాల లక్ష్మయ్య ఆరోపిస్తున్నాడని, దమ్ముంటే నా ఆస్తులపై దర్యాప్తు జరిపించాలని పొన్నాలకు సవాల్ విసిరారు. తాను అవినీతికి పాల్పడినట్లయితే చంద్రబాబు, వైఎస్, 14 సీమాంధ్ర ఛానళ్ళు కేసీఆర్ ను బతకనిచ్చేవి కావన్నారు. కరీంనగర్ జిల్లాలోని గ్రామగ్రామానికి మంచినీళ్ళు వచ్చే విధంగా మంచినీటి పథకాన్ని ఏర్పాటు చేస్తామని, నిజాం షుగర్ ఫ్యాక్టరీని టీఆర్ఎస్ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని కేసీఆర్ హామీ ఇచ్చారు.