కొద్దిసేపటి క్రితం కోరుట్ల బహిరంగసభలో పాల్గొన్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అనంతరం ధర్మపురిలో జరిగిన బహిరంగసభలో పాల్గొని ప్రసంగించారు. పెగడపల్లిలో మార్కెట్ యార్డు నిర్మిస్తామని, రోళ్ళవాగు ప్రాజెక్టును ఆధునీకరిస్తామని అన్నారు. తెలంగాణలోని వైష్ణవ ఆలయాల్లో ధర్మపురి, యాదగిరిగుట్ట ప్రత్యేకమైనవని, వచ్చే గోదావరి పుష్కరాలకు 500కోట్ల రూపాయలు కేటాయిస్తామని, ధర్మపురికి వచ్చే భక్తులకోసం పార్క్ ఏర్పాటు చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు.
చంద్రబాబు ఆంధ్రాబాబే అని, బాబు ఆంధ్రాకు వెళ్లాల్సిందేనని, తెలంగాణలో అభివృద్ధి జరగాలంటే టీఆర్ఎస్ అధికారంలోకి రావాలని, లాఠీలు, తూటాలకు భయపడకుండా పోరాటంచేసిన విద్యార్థి సింహం బాల్క సుమన్ ను పెద్దపల్లి ఎంపీగా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కొప్పుల ఈశ్వర్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని, టీఆర్ఎస్ ప్రభుత్వంలో కొప్పుల ఈశ్వర్ ఎమ్మెల్యే స్థాయిలో ఉండడని, ఇంకా పై స్థాయిలో ఉండి తెలంగాణ రాష్ట్రంకు అన్ని పనులు ఈశ్వర్ చేసే విధంగా ఆశీర్వదించాలని కోరారు. సభకు వచ్చిన జనాన్ని చూస్తేనే ఈశ్వర్, సుమన్ గెలిచినట్లుగా ఉందని కేసీఆర్ ఆనందం వ్యక్తం చేశారు.
అనంతరం జగిత్యాలలో జరిగిన బహిరంగసభలోనూ కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. జగిత్యాలను జిల్లా కేంద్రంగా చేస్తామని, ఉత్తర తెలంగాణ పండ్ల మార్కెట్ ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. రాయకల్ మండల కేంద్రంలో మామిడి పండ్ల ప్రాసెసింగ్ యూనిట్, జగిత్యాల, ఇతర మండలాలలో మోడ్రన్ కోల్డ్ స్టోరేజీలు నెలకొల్పుతామని తెలిపారు. గత 60 సంవత్సరాలుగా కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలను చూస్తూనే ఉన్నామని, ఇప్పుడు తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ కు అధికారాన్ని ఇచ్చి రాష్ట్ర అభివృద్ధిలో పాలుపంచుకోవాలని కేసీఆర్ కోరారు.
కారు గుర్తుకే ఓటువేసి ఎంపీగా కవితను, ఎమ్మెల్యేగా డాక్టర్ సంజయ్ ను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ వాదాన్ని అణచడానికి వైఎస్ ఇచ్చిన డబ్బు సంచులు పట్టుకుని కాంగ్రెస్ నేతలు తిరిగారని, ఏనాడూ ఉద్యమంలో పాల్గొనలేదని కేసీఆర్ మండిపడ్డారు.