mt_logo

బంగారు తెలంగాణ టీఆర్ఎస్ తోనే సాధ్యం- పల్లా రాజేశ్వర్ రెడ్డి

ఎన్నో ఏళ్ళు పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చే శక్తి టీఆర్ఎస్ కే ఉందని నల్లగొండ ఎంపీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. ఆదివారం నల్గొండ ఎమ్మెల్యే అభ్యర్థి దుబ్బాక నర్సింహారెడ్డి తో కలిసి ఎన్నికల ప్రచారం కోసం పానగల్ లో పర్యటించిన ఆయన మాట్లాడుతూ, 14 ఏళ్లపాటు టీఆర్ఎస్ అలుపెరుగని పోరాటాలు, త్యాగాలు చేసిందని, పార్టీ నేతలు పదవీ త్యాగాలు చేయగా తెలంగాణ బిడ్డలు రాష్ట్ర సాధనకోసం తమ ప్రాణాలనే త్యాగం చేశారని పేర్కొన్నారు. అడగ్గానే తెలంగాణ ఇచ్చినట్లుగా కాంగ్రెస్ నేతలు చెప్తున్నారని, కేసీఆర్ దీక్షతో కాంగ్రెస్ దిగిరాక తప్పని పరిస్థితి ఏర్పడిందని గుర్తుచేశారు.

2009 డిసెంబర్ 9న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తున్నట్లు ప్రకటించి వెనుకడుగు వేయకుండా ఉంటే ఇంతమంది ఆత్మహత్యలు చేసుకునేవారా? అని ప్రశ్నించారు. బలిదానాలన్నిటికీ కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని, ఓట్లకోసమే సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చిందని మాయమాటలు చెప్తున్న వారిపట్ల అప్రమత్తంగా ఉండాలని, లేకపోతే మళ్ళీ గోసపడక తప్పదని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడే బంగారు తెలంగాణ సాధించుకోవచ్చని, తెలంగాణ రాష్ట్రంలో నల్లగొండను అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేసుకునేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఎంపీగా తనను, ఎమ్మెల్యేగా దుబ్బాక నర్సింహారెడ్డిని ఓటువేసి గెలిపించాలని పల్లా రాజేశ్వర్ రెడ్డి కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *