mt_logo

తెలంగాణా బిల్లు కోసం కేంద్రం ఫై ఒత్తిడి పెంచుతున్న కెసిఆర్

సోమవారం జరిగే పార్లమెంటు సమావేశంలో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టేలా టీఆర్ఎస్ అధినేత కే. చంద్రశేఖర్ రావు కేంద్రంపై తీవ్రంగా ఒత్తిడి చేస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ త్వరలోనే రానుండటం, పార్లమెంటు సమావేశాలు ఇంకో నాలుగురోజుల్లో ముగియనుండటంతో ఈ లోపే బిల్లు ఆమోదం పొందేలా కేసీఆర్ కృషి చేస్తున్నారు. రైల్వే బడ్జెట్, మధ్యంతర బడ్జెట్ అంశాలు కూడా సోమవారం నాడే ప్రవేశపెట్టనున్నారు. పై రెండు బడ్జెట్ ల కన్నా తెలంగాణ బిల్లుపైనే అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు, ఎలాగైనా తెలంగాణ బిల్లుపై చర్చ సోమవారమే ముగించి ఆమోదం పొందేలా చేయాలని కేంద్రప్రభుత్వం దృఢనిశ్చయంతో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే పలు జాతీయ పార్టీలతో తీవ్రస్థాయిలో చర్చలు జరిపి మద్దతు సేకరించినట్లు, విపక్షాలు అన్నీ కూడా ఈ అంశాన్ని ఇక ముగించివేయమన్నట్లు తెలిసింది. ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీజేపీ సీనియర్ నేత సుష్మాస్వరాజ్ కూడా మీరు బిల్లు పెట్టుకోండి మేము అడ్డుపడమని భరోసా ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ తో సమావేశం అనంతరం కేంద్ర మంత్రి జైరాం రమేష్ తో కూడా కేసీఆర్ భేటీ అయ్యారు. ఎలాగైనా సోమవారం నాడే తెలంగాణ బిల్లు ఆమోదం పొందేలా చర్యలు తీసుకోవాలని జైరాం రమేష్ ను కోరారు. మీడియా ద్వారా అన్ని విపక్షాలతోనూ మాట్లాడి ఎలాంటి అవరోధాలు కలగకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. పార్లమెంటులో సీమాంధ్ర నేతలు ప్రవర్తించిన తీరుపై అన్ని జాతీయ పార్టీల వైఖరిలో మార్పు వచ్చి బిల్లు పెడితే తాము పూర్తి మద్దతు ఇస్తామని హామీ ఇచ్చారు. అన్ని వైపులనుండీ సానుకూల నిర్ణయం రావడం పట్ల తెలంగాణవాదులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *