mt_logo

మరో రెండు రోజుల్లో తెలంగాణ ఖాయం-టీజేఎఫ్

తెలంగాణ రాష్ట్రం మరో రెండు రోజుల్లో ఏర్పాటు కాబోతుందని, అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఎవరూ ఆపలేరని తెలంగాణ జర్నలిస్టుల ఫోరం సభ్యులు స్పష్టం చేశారు.‘అటాక్ ఆన్ పార్లమెంట్ ఎ నేషనల్ షేమ్’ అనే అంశంపై ఆదివారం ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్ లో ఒక జాతీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తెలంగాణ జర్నలిస్టుల ఫోరం సభ్యులతోపాటు తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం, ఇతర జేఏసీ నేతలు పాల్గొన్నారు. తెలంగాణను అడ్డుకోవడానికి సీమాంధ్ర నేతలు ఎన్ని అరాచకాలు సృష్టించినా మరో రెండు రోజుల్లో తెలంగాణ వస్తుందని, పార్లమెంటులో దాడిచేసిన లగడపాటి, మోదుగులపై క్రిమినల్ కేసులు పెట్టాలని సమావేశంలో పాల్గొన్న సభ్యులందరూ డిమాండ్ చేశారు. ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ, తెలంగాణను దోచుకోవడానికే సీమాంధ్ర నేతలు, పెట్టుబడిదారులు అరాచకాలకు పాల్పడుతున్నారని, పార్లమెంటు వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసి దేశద్రోహానికి పాల్పడుతున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా సహా అన్ని అంశాలు తమ చేతుల్లో ఉన్నాయి. ఏం చేసినా అడ్డుకునేవారు లేరని విర్రవీగుతున్న సీమాంధ్ర నేతలకు రాష్ట్ర విభజన అంశం చెంపపెట్టని కోదండరాం వ్యాఖ్యానించారు. తెలంగాణను అడ్డుకోవడానికే 17న సమైక్యవాదుల ఢిల్లీ పర్యటన చేస్తున్నారని, ఎలాగైనా కేంద్రం దీన్ని అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. హక్కులను కాలరాస్తే మరో ఉద్యమానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన స్పష్టం చేశారు. అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ మీద జరిగిన దాడిలాంటిదే పార్లమెంటులో ఫిబ్రవరి 13న జరిగిందని, అక్కడ టవర్లు కూలిపోతే ఇక్కడ ప్రజాస్వామిక విలువలు కూలిపోయాయని జాతీయ సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్ అన్నారు. పార్లమెంటులో పెప్పర్ స్ప్రే దాడిచేసి తోటి సభ్యుల ప్రాణాల మీదకు తెచ్చిన లగడపాటిని భగత్ సింగ్ లా ఒక మీడియా పోల్చడం దారుణమని, ఇలాంటి ప్రచారం చేసినందుకు ఆ ఛానల్ సిగ్గుపడాలని సుప్రీం కోర్టు న్యాయవాది, తెలంగాణ జేఏసీ కన్వీనర్ రామకృష్ణారెడ్డి మండిపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *