త్వరలో తెలంగాణ రాష్ట్ర అవతరణ జరగబోతున్నదని తెలిసీ రోజురోజుకీ సీమాంధ్రులు చేసే కుట్రలకు అంతులేకుండా పోతుంది. ఇన్నాళ్ళూ ప్రాంతం పేరు చెప్పి తెలంగాణలో పెత్తనం చేసిన సీమాంధ్రులు ఇప్పుడు తాజాగా హైదరాబాద్ లో పుట్టామని చెబుతూ స్థానికత పేరుతో ఇక్కడే తిష్ట వేయాలని చూస్తున్నారు. రాష్ట్ర కార్మిక శాఖ, రోడ్లు, భవనాల శాఖలో ఈ తరహా కుట్రలు జరుగుతున్నట్లు తెలిసింది.
ఆప్షన్ల సాకుతో ఆంధ్రా ఉద్యోగులెవ్వరూ తెలంగాణను విడిచివెళ్ళేలా లేరని, ఉద్యోగుల విభజన ప్రక్రియ జరిగే సమయంలో సీమాంధ్ర ఉద్యోగులు సమర్పించిన ఆధారాలను ఒక కమిటీ వేసి పునఃపరిశీలించాలని టీఎన్జీవోలు కార్మికశాఖ కమిషనర్ ను కోరినా ఫలితం లేకపోగా, సీమాంధ్రుల స్థానికతకు సంబంధించిన ఆధారాలు బహిర్గతం చేస్తూ తెలంగాణ ఉద్యోగులు ఇచ్చిన వివరాలను సీమాంధ్ర ఉద్యోగులకే ఇస్తూ పలువురు ఉన్నతాధికారులు గందరగోళం సృష్టిస్తున్నారు.
కార్మికశాఖ అక్రమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిందని, ప్రెసిడెన్షియల్ ఆర్డర్లకు వ్యతిరేకంగా చాలా పోస్టింగులు ఇచ్చారని, సీమాంధ్ర నుంచి వచ్చి ఇక్కడ నాలుగోతరగతి ఉద్యోగులుగా పోస్టుల్లో చేరిన కొంతమంది ఇప్పుడు సూపరింటెండెంట్లుగా మారారని తెలంగాణ ఉద్యోగులు మండిపడుతున్నారు. ప్రిన్సిపల్ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, డిప్యూటీ సెక్రటరీ వరకు అందరూ సీమాంధ్రులే ఉన్నారని, సుమారు 40మందికిపైగా స్థానికత పేరుతో ఇక్కడే తిష్ట వేయాలని చూస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.