Mission Telangana

మరో 12ఏళ్ళపాటు ఉమ్మడిరాష్ట్రంలో విద్యుత్ ఒప్పందాలు

తెలంగాణలో తీవ్రమైన కరెంటు కోతలు రానున్నాయని వస్తున్న వార్తలను విద్యుత్ రంగ నిపుణులు ఖండిస్తూ రాష్ట్ర విభజన వల్ల తెలంగాణకు మేలుజరగనుందని, ఉమ్మడి రాష్ట్రంలోని అన్ని విద్యుత్ ఒప్పందాలు మరో 12ఏళ్ళపాటు కొనసాగనున్నాయని స్పష్టం చేశారు. రెండు రాష్ట్రాల్లో ఉత్పత్తి అయ్యే కరెంటు 12ఏళ్ళపాటు రెండు రాష్ట్రాలకూ పంపిణీ చేయబడుతుందని, జెన్ కో, ప్రైవేటు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో తయారయ్యే ప్రతి యూనిట్ మీద ఇరు రాష్ట్రాలకు హక్కు ఏర్పడుతుందని కేంద్రం నిబంధనలు జారీ చేసింది.

రాష్ట్ర విభజన అనంతరం రెండు రాష్ట్రాల్లో జరిగే విద్యుత్ ఉత్పత్తిలో తెలంగాణకు 55శాతం, సీమాంధ్రకు 45శాతం వాటాగా నిర్ణయించారు. సెంట్రల్ జనరేటింగ్ స్టేషన్ల విద్యుత్ వాటాలు తెలంగాణకు 52.17శాతం, సీమాంధ్రకు 47.83శాతం కేటాయించారు. ప్రైవేట్ రంగ పీపీఏలైన గౌతమి పవర్ లిమిటెడ్, జీవీకే ఎక్స్ టెన్షన్, కోనసీమ గ్యాస్ పవర్ లిమిటెడ్, జీఎమ్మార్ వేమగిరి పవర్ జనరేషన్ లిమిటెడ్ విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు ఇరురాష్ట్రాలకూ 12ఏళ్ళపాటు విద్యుత్ పంపిణీ చేయడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. తెలంగాణలో థర్మల్ పవర్ ఉత్పత్తి 2,502 మెగావాట్లు, జలవిద్యుదుత్పత్తి 1600 మెగావాట్లుగా ఉంది. ఉమ్మడి రాష్ట్రంలోని ప్రైవేటు రంగంలో ఉన్న గ్యాస్ పవర్ ప్రాజెక్టులనుండి లభించే విద్యుత్ ఉత్పత్తిలో తెలంగాణ వాటాలు గతంలోలానే కొనసాగనున్నాయి.

ఇవేకాక తమిళనాడు, కర్నాటక, విశాఖపట్నం లలో నిర్మాణదశలో ఉన్న 5 సెంట్రల్ జనరేటింగ్ స్టేషన్ల నుండి వచ్చే రెండేళ్లలో అధికంగా వాటా దక్కనుంది. ప్రస్తుతం నిర్మాణదశలో ఉన్న కేటీపీఎస్-7, కాకతీయ స్టేజ్-2, సత్తుపల్లిల ద్వారా 2000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కానుంది. విద్యుత్ ఒప్పందం అమలులోకి వచ్చి ఇప్పటికే 10సంవత్సరాలు అవుతుండగా మరో పది సంవత్సరాలపాటు పీపీఏ అమలులో ఉండనుంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత త్వరితగతిన విద్యుత్ ప్రాజెక్టులను పూర్తిచేసుకుంటే డిమాండ్ కు తగ్గ విద్యుత్ ఉత్పత్తి చేయడంతోపాటు, మిగులు విద్యుత్ ఉండే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయని పలువురు నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *