mt_logo

విధ్వంసానికి విపరీతభాష్యం!!

By: సవాల్‌రెడ్డి

-తెలియని మనుజుని సుఖముగఁ
-దెలుపందగు; సుఖతరముగఁ దెలుపఁగ వచ్చున్
-దెలిసినవానిం; దెలిసియుఁ
-దెలియని నరుఁ దెల్ప బ్రహ్మదేవుని వశమే..

తెలియని వారికి చెప్పవచ్చు. తెలిసిన వారికి మరెంతో సులభంగా చెప్పవచ్చు. తెలిసీ తెలియని వారికి తెలియ చెప్పడం బ్రహ్మదేవునికి కూడా సాధ్యం కాదని పెద్దల మాట. కొందరు అన్నీ తనకే తెలుసుననుకుంటారు. చిటికెలో సిద్ధాంతాలు వండేస్తారు. తమ ఆలోచన పరిధిలోనే కార్యకారణ సంబంధాలు ఖాయం చేస్తారు. ఉపరితల దర్శనమే సర్వస్వమని భ్రమ పడతారు. ఆ భ్రమలోనే వ్యాఖ్యలు.. తీర్పులు..చేర్పులునూ.. తెలంగాణ రైతు ఆత్మహత్యల మీద సీమాంధ్ర పత్రికలు చేస్తున్న యాగీ.. ఇస్తున్న తీర్పులు ఈ కోవకే వస్తాయి. తాజా కొత్తపలుకులో రాధాకృష్ణ కూడా సరిగ్గా ఇదే ఫాలో అయిపోయాడు. తెలంగాణ రైతుల పరిస్థితి మీద, అందుకు కారణాల మీద ఆయన అంచనాలు.. తీర్పులు ఏవీ మూలాలు తడిమిన దాఖలాలు లేవు.. దశాబ్దాలుగా ఆంధ్రప్రాంతీయులు వినిపించే సోదిని మరోసారి వల్లె వేయటం తప్ప! రాధాకృష్ణ సూత్రీకరణ ప్రకారం తెలంగాణలో వ్యవసాయమే కత్తిమీదసాము. ఇక్కడంతా వర్షాధార వ్యవసాయం. బోర్లమీదే సాగు సాగాలి. అప్పులు లేకుండా వ్యవసాయంలేదు. పాపం వర్షాభావ పరిస్థితులు వెంటాడి అప్పులపాలై రైతు ఆత్మహత్యలపాలవుతున్నాడు. సరే.. పనిలో పనిగా కేసీఆర్ ఆత్మహత్యలు పట్టించుకోవడం లేదు అంటూ మొదలుపెట్టి.. ధనిక రాష్ట్రం..ఆకాశమార్గాలు.. ఫాంహౌస్.. క్యాప్సికమ్ అంటూ యథాప్రకారం రాధాకృష్ణ మార్కు అక్కసు…కక్కసు సరేసరి.

వర్షాధారం ఎవరి పుణ్యం?
అవన్నీ ఎలా ఉన్నా రాధాకృష్ణ ఓ నిజం మాత్రం చెప్పాడు.. తెలంగాణలో వర్షాధార పంటలే పండిస్తారని. అవునుమరి.. ఆరు పదుల దరిద్రుల పాలన తెలంగాణకు మిగిల్చింది అదేకదా! ప్రపంచంలో ఏ రైతుకూడా విత్తులు చల్లి నీటికోసం ఆకాశం వంక చూడాలని ముచ్చట పడడు. మేఘాలు వర్షిస్తేనే పంటలు పండించాలని కోరుకోడు. బావుల నిండా నీళ్లు ఉండాలని కోరుకుంటాడు. చెరువులు అలుగులు దుంకాలని కోరుకుంటాడు. పంటచేలలో నీటి గలగలలు వినాలని కలలు కంటాడు. కానీ ఉమ్మడి రాష్ట్రం ఇక్కడి వ్యవసాయాన్ని ధ్వంసం చేసింది. నీటిచుక్కకు నోచకుండా చేసింది. ఏపీలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడడం లేదట. అవును ఎందుకు పాల్పడతారు? ఉన్న నీళ్లన్నీ మళ్లించుకుని రెండేసి మూడేసి పంటలు పండించుకున్న వారికి.. గాదెలు, ఖజానాలు నింపేసుకున్న వారికి ఆత్మహత్యల ఖర్మేమిటి? ఒకసారి కాదు వరుసగా కరువు వచ్చినా తేడా రాదు. కానీ తెలంగాణకు ఏం మిగిలింది? ఆంధ్రలో పంటలు పండించి కొడుకులు, మనుమలు,మునిమనవళ్లకు సరిపోయే సంపద పోగేసుకుంటే తెలంగాణాలో తాతలు, ముత్తాతలు, తండ్రులు సంపాదించిన ఆస్తులు తెగనమ్ముకుంటున్నారు. ఇక్కడ పెండ్లి చేసినా.. చావు చేసినా రైతుకు అప్పే గతి అవుతున్నది. ఆంధ్ర రైతులు వ్యవసాయ మిగులుతో సినిమాలు తీస్తుంటే తెలంగాణ రైతులు కుటుంబంతో కలిసి టికెట్ కొనుక్కుని సినిమా చూసే పరిస్థితిలో కూడా లేరు.

బోర్లు తెచ్చిందెవరు?
తెలంగాణలో వ్యవసాయం కత్తిమీద సాములాంటిది.. బోర్ల మీద ఆధారపడి వ్యవసాయం చేస్తారట. ఇది ఎవరి పుణ్యం? నిజాం హయాంలో బోర్లులేవు. బూర్గుల హయాం లో బోర్లులేవు. ఉమ్మడి రాష్ట్రంలో మాత్రం కొత్తగా పుట్టుకు వచ్చాయి. ఎందుకు? వందల ఏండ్లుగా ఇక్కడి వ్యవసాయాన్ని తల్లిలాగా కడుపులో పెట్టుకుని కాపాడిన చెరువులు, చిన్న పెద్ద నీటివనరుల ఆనవాళ్లు మిగలకుండా ధ్వంసం చేశారు. అంతదాకా చెరువుల్లోనీరు భూగర్భ జలాలను నింపేవి. బావుల్లో నీరు అటుఇటుగా నిలకడగా ఉండేది. వానలు వచ్చినా రాకున్నా మోటబావుల్లో రాట్లతో రైతులు నీళ్లు పారించుకునే వాళ్లు. అలాంటిది చెరువులు పోయి భూగర్భ జలమట్టాలు అడుగంటి రైతులే ఆ మోట బావుల్ని పూడ్పించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. భూమిని కుళ్లబొడిచి బోర్లు వేయించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆంధ్రపాలకులు ఏనాడన్నా ముందుచూపుతో చెరువులు బాగు చేయించి ఉంటే, నీటి వనరులు కాపాడి ఉంటే…లేదూ ప్రాజెక్టులు నిర్మించి నదీ జలాలను మళ్లించి .. భూగర్భ జలాల మట్టాలను కాపాడి ఉంటే.. మోటబావులు పూడ్చే అవసరం వచ్చేదికాదు. నీరు దొరక్క డజన్ల కొద్దీ బోర్లు వేసి బోర్లా పడే పరిస్థితి వచ్చేదీ కాదు. లక్షల అప్పులు రైతునెత్తిమీద పడి ఈ విషాదం మిగిలేది కాదు.

మూల కారణం నీరే!
ఏడాదిలో ఇన్ని మరణాలు సంభవించాయి. సీఎం జిల్లాలోనే ఇందరు ఆత్మహత్యలకు పాల్పడ్డారు అంటూ చిత్రగుప్తుడి లెక్కలు చెపుతున్న మహానుభావుడు… ఈ మరణాలన్నింటికీ ఉన్న ఒకే ఒక్క కారణాన్ని మాత్రం గుర్తించడు. ప్రతి మరణం వెనుక ఉన్న సమస్య నీరే. ఆ నీరే పుష్కలంగా ఉండి ఉంటే బోర్లు వేసుకోవడం.. అందుకు లక్షల అప్పులు చేయడం.. పంటలు ఎండి పోవడం వంటి సమస్యలే రావు. ఆ నీరు లేకే రైతు మేఘాలు చూస్తున్నాడు. ఆ నీరు లేకే బోరు వేస్తున్నాడు. ఆ నీరు కోసమే అప్పులు చేస్తున్నాడు. ఆ నీరు అందకే ఆత్మహత్యకు పాల్పడుతున్నాడు. ఎలాంటి ఆడంబరాలు లేకుండా అత్యంత సామాన్య జీవనం గడిపే తెలంగాణ రైతు ఇవాళ లక్షల అప్పులు చేస్తున్నది ఆ నీటి కోసమే. రైతు ఆత్మహత్యల్లో ఉపరితలంనుంచి ఏ సమస్య కనిపించినా మూలం మాత్రం నీరే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వచ్చి ఆంధ్రకు నాగార్జున సాగర్ ఇచ్చింది. సీమకు శ్రీశైలం ఇచ్చింది. సాగర్ పూర్తయింది. శ్రీశైలం పూర్తయింది. మరి మరి తెలంగాణకు ఏం ఒరిగింది? ఏం మిగిలింది? ఉన్న నిజాంసాగర్ పూడుకుపోయింది. మూసీ కనబడకుండా పోయింది. రాజోలిబండ బాంబుల పాలైంది. శ్రీరాంసాగర్ మొదటిదశే పూర్తికాలేదు. కరెంటు బిల్లులు కట్టకుంటే ఒకడు జైల్లో పెడితే.. ఉచిత విద్యుత్తు అంటూ ఊదరగొట్టి ఒకడు అసలు కరెంటే ఇవ్వలేదు. తెలంగాణ వ్యవసాయం కోరి చేస్తున్న కత్తిమీద సాము కాదు.. ఉమ్మడి రాష్ట్రం అనే మహమ్మారి ఇచ్చిన శాపం! ముందుచూపులేని మందమతుల పాలన తెచ్చిన దౌర్భాగ్యం. ఆరు దశాబ్దాల పాలనలో తెలంగాణ కొన్ని తరాలదాకా కోలుకోలేనంతగా ధ్వంసమైంది. అంతటి మహా విధ్వంసం ఇంత స్వల్పకాలంలో మాయమైపోదు.

వెకిలి రాతలు!
బంగారు తెలంగాణ చూడడానికి రైతులుండాలి కదా అనే దారుణ వ్యాఖ్య.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌నుంచి వారసత్వంగా వెంటిలేటర్ మీద సంక్రమించిన తెలంగాణను బతికించుకోవాలనే ఈ తాపత్రయమంతా. రుణమాఫీనుంచి ఇన్‌పుట్ సబ్సిడీలనుంచి మిషన్ కాకతీయలనుంచి నిరంతర కరెంటునుంచి ప్రాజెక్టుల రీ డిజైన్‌దాకా తెలంగాణ తండ్లాట సీమాంధ్ర మీడియా కంటికి ఆనకపోవచ్చు. కానీ ఒకే ఒక్క ఉదాహరణ.. రెండేండ్ల క్రితందాకా విత్తనాల కైనా ఎరువులకైనా ఎంతెంత పెద్ద పెద్ద క్యూ లైన్లు ఉండేవి? ఎన్ని లాఠీ చార్జీలు జరిగేవి? ఎన్ని షాపులను రైతులు విధ్వంసం చేసేవారు? ఈ రెండు సీజన్లలో అలాంటి ఒక్క దృశ్యమైనా తెలంగాణలో కనిపించిందా? అనేది తిరిగి చూసుకుంటే అపుడు అర్థమవుతుంది తెలంగాణ ప్రభుత్వం చేసిందేమిటో..! గత ఏడు ట్రాన్స్‌ఫార్మర్ తీగలు పట్టుకుని ప్రాణాలు వదిలిన సంఘటనలు ఈసారి ఏమయ్యాయో విశ్లేషించుకున్నా వాస్తవం బోధపడుతుంది. కండ్ల ముందు తక్షణ ఫలితాలు కాదు.. కష్టపడే వాడి చిత్తశుద్ధి.. దూరదృష్టి చూడాలి. ఆ విజ్ఞత సీమాంధ్ర మీడియాకు లేదు.

మాది బతుకుకోరే తపన..
సొంత పత్రికలు.. సొంత చానెళ్లలో నిరోధించినంత మాత్రాన జరిగేది జరగకుండా పోతుందని ఎవరూ చెప్పరు. కానీ పరిస్థితి సున్నితంగా ఉన్నపుడు బాధితుల మనసులు వికలంచేసి ఆత్మహత్యలకు పురిగొల్పే పని తెలంగాణ మీడియా చేయదు. తెలంగాణ తెచ్చుకున్నది బతికించుకోవడానికే తప్ప చేజేతులా చంపుకోవడానికి కాదు. ఇదే నీతిని ఉద్యమ సమయంలో పాటించింది. ఆనాడు ప్రతిరోజూ నై తెలంగాణ.. వచ్చే అవకాశాలు లేవు అంటూ దిక్కుమాలిన కథనాలు రాసి నూనూగు మీసాల పసిబిడ్డలను బలి తీసుకున్న వారినుంచి ఉపదేశాలు చెప్పించుకునే కర్మ పట్టలేదు. తెలంగాణ మీడియా ఆశావహ భవితవ్యాన్ని చూపించి బతికించుకుంటుందే తప్ప భవిష్యత్తే లేదంటూ నిరాశకు గురిచేసి చంపుకోదు. ఫలానాచోట మంచివాన పడిందనే వార్త.. చినుకు పడని చోట కుంగిపోయిన రైతులో వర్షాలు వస్తాయనే ఆశ చిగురింప చేస్తుంది. సీమాంధ్ర పత్రికలకు, బిత్తిరి టీవీలకు ఇది అర్థం కాకపోవచ్చు.

కొసమెరుపు..
15 నెలల్లో కేసీఆర్ రైతు సమస్యల మీద ఒక్కసారి కూడా మాట్లాడలేదంటారు రాధాకృష్ణ. కానీ రాధాకృష్ణకు తెలియదేమో.. గత సంవత్సరం తీవ్రమైన కరెంటు కోతలు ఉన్నపుడు కూడా కేసీఆర్ ఒక్క మాట మాట్లాడలేదు. చేయాల్సింది కసిగా చేశారు. ఆరు దశాబ్దాల్లో ఏ పాలకుడూ చేయలేనిది… కనీసం ఆలోచించలేనిది ఆరు నెలల్లో చేసి చూపించారు. ఆ తర్వాతే మాట్లాడారు. ఇవాళ మాట్లాడనంత మాత్రాన రైతు ఆత్మహత్యలు పట్టనట్టు కాదు. పాపం.. కేసీఆర్ ఏదైనా మాట్లాడితే దాన్ని పట్టుకుని పీకిపీకి సాగదీద్దామన్న ముచ్చట రాధాకృష్ణకు, సీమాంధ్ర మీడియాకు ఉంటే ఉండవచ్చు. కానీ యుద్ధము.. మౌనము అనే అస్త్రా లను సమయానుకూలంగా ప్రయోగించే నేర్పు తెలంగాణ ఉద్యమం కేసీఆర్‌కు ఇచ్చింది.

శరది న వర్షతి గర్జతి వర్షతి వర్షాసు నిస్సనో మేఘః శరత్కాల మేఘం గర్జిస్తుందే తప్ప వర్షించదు. వర్షాకాలపు మేఘం వర్షిస్తుందే తప్ప గర్జించదు. కార్యశూరులకు, క్రియా శూన్యులకు ఉండే తేడా ఇదే!

నమస్తే తెలంగాణ సౌజన్యంతో..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *