తెలంగాణ సర్వతోముఖాభివృద్ధిపై ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు అసెంబ్లీ ప్రసంగంలో మాట్లాడుతూ.. “మన రాష్ట్ర భౌగోళిక పరిస్థితులకు తగిన అభివృద్ధి వ్యూహాలను రచించటం.. ప్రపంచస్థాయి కంపెనీలను రప్పించి, పెట్టుబడులు పెట్టేలా మౌలిక సదుపాయాలను కల్పించటం.. అభివృద్ధిని వికేంద్రీకరించటం.. స్థానిక ప్రజలకు ముఖ్యంగా యువతకు ఉద్యోగాలు దక్కేలా నిర్ణయాలు తీసుకోవటం.. ఇదీ తెలంగాణ గత ఏడేండ్లుగా సీఎం కేసీఆర్ దిశానిర్దేశంలో సాగిస్తున్న ప్రగతి ప్రయాణం. ఈ రోజు తెలంగాణ దేశంలోని ఇతర రాష్ట్రాలతో కాదు.. ఇతర దేశాలతో పోటీపడుతున్నదంటే రాష్ట్రంలో సుస్థిర నాయకత్వం, సమర్థవంతమైన పాలనే కారణం” అన్నారు.
” ‘బెంగాల్ నేడు ఏం ఆలోచిస్తుందో.. ఇండియా రేపు అదే ఆలోచిస్తుంది’ అని గతంలో అనేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ‘తెలంగాణ ఇప్పుడు ఏం చేస్తుందో.. ఇండియా రేపు అదే చేస్తుంది’ అనే భావన వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం టీఎస్ ఐపాస్‌ను 2014నవంబర్‌లో ప్రవేశపెట్టింది. అనేక రాష్ట్రాలు దానిని అనుకరిస్తున్నాయి. ఇప్పుడు కేంద్రం సింగిల్ విండో వ్యవస్థను ప్రవేశపెడుతామని చెప్తున్నది. మన మిషన్ భగీరథ ‘జల్ జీవన్ మిషన్’కు ఆదర్శంగా మారింది. రైతు బంధు పథకం స్ఫూర్తితో పీఎం కిసాన్ సమ్మాన్ వచ్చింది. అర్బన్ లంగ్ స్పేస్, అర్బన్ పార్కులను ఆదర్శంగా తీసుకొని ‘నగర్ వన్’ కార్యక్రమం పుట్టుకొచ్చింది. ఇవన్నీ మన భవిష్యత్ దర్శనానికీ, పురోగమనానికీ నిదర్శనం.
తెలంగాణ ఇప్పుడు పెట్టుబడుల ఆకర్షణలో తమిళనాడు, గుజరాత్ వంటి రాష్ట్రాలతో కాదు.. ఏకంగా ఇతర దేశాలతో పోటీ పడుతున్నది. ఇందుకు ఉదాహరణ కిటెక్స్. ఆ సంస్థ కేరళ నుంచి బయటికి వస్తున్నట్టు తెలియగానే దేశంలోని 15-16 రాష్ట్రాలతోపాటు శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ వంటి దేశాలు సైతం పోటీ పడ్డాయి. వారందరినీ వెనక్కి నెట్టి ముందుగా మన రాష్ట్రానికి వచ్చి రూ.2వేల కోట్ల పైచిలుకు పెట్టుబడి పెట్టేలా ఒప్పించగలిగాం. ప్రపంచంలోని టాప్-5 టెక్నాలజీ కంపెనీలు మైక్రోసాఫ్ట్, గూగుల్, ఫేస్‌బుక్, యాపిల్, అమెజాన్ రెండో అతిపెద్ద కార్యాలయాలను హైదరాబాద్‌లో ఏర్పాటు చేశాయి. ఇందులో మైక్రోసాఫ్ట్ మినహా మిగతావి ఏడేండ్లలోనే వచ్చాయి. మొత్తం 250 ఐటీ కంపెనీలు వచ్చాయి.
ప్రపంచం ఇప్పుడు నాలుగో పారిశ్రామిక విప్లవం ముందు ఉన్నది. ఆవిరి ద్వారా రైలును నడిపించడం, దాని తర్వాత వచ్చిన మార్పులను మొదటి పారిశ్రామిక విప్లవంగా చెప్తుంటారు. ఆ తర్వాత విద్యుత్తు ద్వారా విరివిగా ఫ్యాక్టరీలు నడపటం, ఉత్పత్తులను పెంచడాన్ని రెండో పారిశ్రామిక విప్లవంగా అభివర్ణిస్తారు. ఎలక్ట్రానిక్స్, కంప్యూటరైజేషన్‌ను మూడో పారిశ్రామిక విప్లవంగా పిలుస్తుంటారు. ప్రస్తుతం మనం ఈ దశలోనే ఉన్నాం. నాలుగో పారిశ్రామిక విప్లవం డిజిటల్ రెవల్యూషన్. ఎమర్జింగ్ టెక్నాలజీస్ అయిన ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ), 3డీ ప్రింటింగ్, నానో టెక్నాలజీ, క్వాంటం కంప్యూటింగ్, ఎనర్జీ స్టోరేజ్, డేటా స్టోరేజ్ వంటివన్నీ సమీప భవిష్యత్తులో మానవ జీవనవిధానాన్ని మార్చబోయే టెక్నాలజీలు. వాస్తవానికి మొదటి, రెండో పారిశ్రామిక విప్లవం సమయంలో మనం బ్రిటిష్ పాలనలో ఉన్నాం. దాంతో వాటి ఫలాలు మన దేశానికి, మనకు అందలేదు. కంప్యూటరైజేషన్‌ను కూడా మనం కాస్త ఆలస్యంగా అందిపుచ్చుకున్నాం. కానీ నాలుగో పారిశ్రామిక విప్లవాన్ని అందుకునే అవకాశం, అన్ని రకాల అర్హతలు మనకున్నాయి. దేశంలో ప్రతీ ఒక్క రంగంలో తెలంగాణ కీలకపాత్ర పోషించబోతున్నది.
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు అవుతున్న సందర్భంగా గతేడాది జూన్‌లో ప్రధాని మోదీ అన్ని పార్టీల నేతలతో ఒక సమావేశం ఏర్పాటు చేశారు. కొత్త భారతదేశాన్ని తయారు చేయాలంటే ఏం చేయాలో సూచించాలని అడిగారు. దానికి నేను.. శక్తివంతమైన ఇండియా తయారు కావాలంటే మూడు ‘ఐ’లు కావాలని సూచించా. అవే.. ఇన్నోవేషన్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఇన్‌క్లూజివ్ గ్రోత్. కొత్త ఆవిష్కరణలు ప్రోత్సహించాలని, మౌలిక సదుపాయాలు కల్పించాలని, అందరినీ కలుపుకొని ముందుకు పోవాలని స్పష్టం చేశాను. అప్పుడే ఎటువంటి అంతరాలు లేని సమ్మిళిత అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పాను. గడిచిన ఏడేండ్లలో సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణలో ఇది సాధించి చూపెట్టామని వివరించాను.
అన్ని ప్రాంతాలను సమానంగా చూస్తూ.. అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తూ.. కలిసికట్టుగా ముందుకు సాగడమే సమ్మిళిత వృద్ధి. ఇది తెలంగాణలో అమలవుతున్నది. మనకు సముద్ర తీరం లేదు. ల్యాండ్ లాక్డ్ రాష్ట్రం. దీనికి తగినట్టుగానే 14 ప్రాధాన్య రంగాలను ఎంచుకున్నాం. ఐటీ, టెక్స్‌టైల్స్, ఎలక్ట్రానిక్స్, ఫార్మాస్యూటికల్స్, లైఫ్ సైన్సెస్, ఏరోస్పేస్, డిఫెన్స్, లాజిస్టిక్స్, ఫుడ్ ప్రాసెసింగ్, జెమ్స్ అండ్ జ్యువెల్లరీ వంటివి ఎంచుకొని.. ఒక్కో రంగానికి ప్రత్యేక క్లస్టర్లు ఏర్పాటు చేశాం. ఐటీ అంటే హైదరాబాద్ అనే నిర్వచనాన్ని మార్చేశాం. వరంగల్, కరీంనగర్, ఖమ్మం వంటి నగరాలకు విస్తరించాం. మహబూబ్‌నగర్, సిద్దిపేట, రామగుండం, నల్గొండలోనూ ఐటీ టవర్లు ఏర్పాటు చేస్తున్నాం. ఖమ్మంలో 60వేల చదరపు అడుగులతో ఐటీ టవర్ నిర్మిస్తే.. అది నిండిపోయింది. ప్రస్తుతం అక్కడ 19 కంపెనీలు పనిచేస్తున్నాయి. ఇప్పుడు రెండో దశ పనులు మొదలయ్యాయి. రాబోయే ఐదేండ్లలో ద్వితీయ శ్రేణి పట్టణాల్లోనే 50వేల ఉద్యోగాలు కల్పించాలని రెండో ఐటీ పాలసీలో లక్ష్యంగా పెట్టుకున్నాం. మహబూబ్‌నగర్ మండలం దివిటిపల్లిలో ఎనర్జీ పార్క్ పెడుతున్నాం. సంగారెడ్డి నియోజకవర్గంలోని శివానగర్‌లో ఎల్‌ఈడీల కోసం పార్క్ ఏర్పాటు చేస్తున్నాం. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలోని చందన్‌వెల్లిలో ‘ఈవీ పార్క్’ ప్రారంభించాం. అది నిండిపోవడంతో పక్కనే ఉన్న సీతారాంపూర్‌లో మరో 800 ఎకరాల్లో ప్రత్యేక పార్క్ ఏర్పాటు చేశాం. ఒలెక్ట్రా, మైత్రా అనే కంపెనీలు అక్కడ బస్సులు తయారు చేయబోతున్నాయి. దేశంలోనే అతిపెద్ద కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్‌ను వరంగల్‌లో ఏర్పాటుచేశాం.
ఎమర్జింగ్ టెక్నాలజీస్‌ను అందిపుచ్చుకోవడంలో తెలంగాణ దేశంలోనే అగ్రభాగంలో ఉన్నది. ఇందుకోసం ప్రత్యేకంగా ‘ఎమర్జింగ్ టెక్నాలజీస్ వింగ్’ పేరుతో ఒక విభాగాన్నే ఏర్పాటు చేశాం. దేశంలోనే తొలిసారిగా డ్రోన్ పాలసీని ప్రవేశపెట్టాం. ఫలితంగా ఇటీవలే వికారాబాద్‌లో ‘మెడిసిన్ ఫ్రమ్ స్కై’ ప్రాజెక్టు మొదలైంది. త్వరలో డ్రోన్ల ద్వారా గుండెను తరలించే రోజులు వస్తాయి. ఇదొక్కటే కాదు.. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ పాలసీ, డేటా సెంటర్ పాలసీ, ఇన్నోవేషన్ పాలసీ, రూరల్ టెక్నాలజీ పాలసీ, ఓపెన్ డేటా పాలసీ, సైబర్ టెక్నాలజీ పాలసీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ పాలసీ, ఈ-వేస్ట్ పాలసీ.. ఇలా అత్యాధునిక టెక్నాలజీలన్నింటినీ అందరికంటే ముందుగా తెలంగాణలో ప్రవేశపెడుతున్నాం. దేశంలోనే తొలిసారిగా 2020 సంవత్సరాన్ని ‘ఇయర్ ఆఫ్ ఏఐ’గా ప్రకటించాం. భవిష్యత్తు అంతా బయోఫార్మా రంగానిదే. దీనికి హైదరాబాద్‌ను రాజధానిగా చేయాలనే లక్ష్యంతో దేశంలోనే మొదటిసారిగా బీ-హబ్‌ను ఏర్పాటు చేశాం. టీహబ్, వీహబ్, టాస్క్, టీఎస్‌ఐసీ.. ఇలా అనేక కార్యక్రమాలు మొదలు పెట్టాం. ‘స్టార్టప్ ఎకో సిస్టం’లో మనం దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నాం.
సమర్థుడైన నాయకుడు, స్థిరమైన ప్రభుత్వం ఉంటే పెట్టుబడులు తరలివస్తాయని చెప్పడానికి తెలంగాణ ప్రత్యక్ష సాక్ష్యం. ఒక ప్రాంతంలో అన్ని రకాల ఉత్పత్తులకు అనువైన వాతావరణాన్ని కల్పిస్తే ఖర్చు భారీగా కలిసివస్తుంది. మౌలిక వసతులను అన్నింటికీ కలిపి వాడుకునే అవకాశం ఉంటుంది. చైనా ఉత్పత్తులు 30-40 శాతం తక్కువ ధరలకు లభించడం వెనుక ప్రధాన కారణం ఇదే. టాటాలే కాదు.. తాతల నాటి కులవృత్తులు బాగుండాలన్నదే సీఎం కేసీఆర్ కల. ఈ రెండింటినీ దృష్టిలో పెట్టుకొని తెలంగాణలోనూ సంప్రదాయ, ఎమర్జింగ్ టెక్నాలజీస్‌కు సంబంధించిన పరిశ్రమలు తరలివచ్చేలా క్లస్టర్లు ఏర్పాటు చేశాం. దేశంలోనే అతిపెద్ద టెక్స్‌టైల్‌పార్క్‌ను, ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మాసిటీని ఏర్పాటు చేయడం వెనుక ఉద్దేశం కూడా ఇదే. ఇప్పుడు ట్రాక్టర్ నుంచి హెలికాప్టర్ దాకా.., ఎర్రబస్సు నుంచి ఎలక్ట్రిక్ బస్సు దాకా.., ఎలక్ట్రిక్ బస్సు నుంచి ఎయిర్ బస్ దాకా.., ప్రతి పరిశ్రమకు గమ్యస్థానం తెలంగాణ. కరోనా మొదటి వేవ్ సమయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మన దేశ ప్రధాని మోదీకి ఫోన్ చేసి హైడ్రాక్సీ క్లోరోక్విన్, పారాసిటమాల్ కావాలని కోరితే.. ఆయన హైదరాబాద్‌వైపు చూశారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వాడే హెలికాప్టర్ క్యాబిన్ హైదరాబాద్‌లో తయారవుతున్నది. ప్రపంచ ప్రఖ్యాత సామ్‌సంగ్ టీవీలు, షియోమి, వన్‌ప్లస్ వంటి ఫోన్లు మహేశ్వరంలో ఉత్పత్తి అవుతున్నాయి. ఈవీ పాలసీని ప్రవేశపెట్టిన మొదటి రోజే 3,700 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల కోసం కనీసం స్థలం కూడా చూపెట్టకుండా ఆసక్తి వ్యక్తీకరణకు పిలిస్తే 1400 దరఖాస్తులు వచ్చాయి. ఇది తెలంగాణ ప్రభుత్వం మీద ఉన్న విశ్వాసానికి నిదర్శనం.
కట్టు కథలతో పెట్టుబడులు రావు. కఠోర శ్రమతో వస్తాయి. దాని వెనుక కొందరు వ్యక్తుల సమూహం.. కొన్నేండ్ల శ్రమ దాగి ఉంటాయి. వ్యాపారవేత్తలను ఒప్పించడానికి ఎంతో మందిని సంప్రదించాల్సి ఉంటుంది. అర్ధరాత్రి దాకా కష్టపడాల్సి వస్తుంది. మా వల్ల మీకేం లాభం.. మీ వల్ల మా తెలంగాణకు కలిగే ప్రయోజనం ఏంటో స్పష్టంగా వివరించగలగాలి. తెలంగాణ ఈ స్థాయికి రావడం వెనుక ఎంతో కృషి ఉన్నది. గత ఏడేండ్లలో మొత్తం 1,264 సంస్కరణలు తీసుకొచ్చాం. ఫలితంగా ఈవోడీబీ ర్యాంకింగ్స్‌లో మొదటి నుంచి టాప్ జాబితాలో నిలుస్తున్నాం. ప్రైవేటు పెట్టుబడుల ఆవశ్యకతను ముందే గ్రహించి 2014లోనే ‘టీఎస్- ఐపాస్’ను తెచ్చాం. కరెంటు సమస్యను పరిష్కరించి పవర్ హాలీడేల నుంచి.. పవర్ జాలీడే పరిస్థితిని తీసుకొచ్చాం.
పెట్టుబడులు తేవడమే కాదు.. తెలంగాణ బిడ్డలకు ఉపాధి కల్పించేందుకు ప్రణాళికలు అమలు చేస్తున్నాం. తెలంగాణ స్టేట్ అకాడమీ ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్ ద్వారా 3లక్షల పైగా పిల్లలకు నైపుణ్య శిక్షణ ఇస్తున్నాం. 33 జిల్లాల్లో న్యాక్, సెట్విన్, టాస్క్ ద్వారా విస్తరిస్తున్నాం. తెలంగాణ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తే, అదనపు ప్రోత్సాహకాలు అందిస్తామని కంపెనీలకు చెప్పాం. అయితే ఇక్కడ మనందరం ఒక విషయం ఆలోచించాలి. మన పిల్లలకు కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగాలు కావాలని కోరుకుంటున్నం. అదే కంపెనీల కోసం భూ సేకరణ చేయాలంటే మాత్రం కొందరు చిల్లర రాజకీయాలు చేస్తున్నరు. మా అమ్మమ్మ ఊరు కొదురుపాక మునిగితే మిడ్ మానేరు అయ్యింది. మా నాయినమ్మ ఊరు దోమకొండ మండలం పోసాన్‌పల్లె మునిగితే అప్పర్ మానేరు అయ్యింది. మేము నిర్వాసితులుగా మారినా లక్షల ఎకరాల్లో పంటలు పండి లక్షల మందికి ఉపాధి లభించింది. కాబట్టి కొందరు త్యాగం చేస్తేనే లక్షల మందికి లబ్ధి కలుగుతుందని గుర్తుంచుకోవాలి.
పాతబస్తీలో టాస్క్, టీ-హబ్, న్యాక్, వీ-హబ్ కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తాం. తెలంగాణ ఏర్పాటు తర్వాత ముస్లిం మైనారిటీలకు చెందిన 705 యూనిట్లకు అనుమతులు ఇచ్చాం. రూ.800 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. వీటిద్వారా 6,800 ఉద్యోగాల కల్పన జరిగింది. అన్ని ప్రాంతాలు సమానంగా ఎదుగాలన్నదే మా లక్ష్యం. హైదరాబాద్ దక్షిణ ప్రాంతా న్ని కూడా అభివృద్ధి చేస్తున్నాం. హైదరాబాద్ ఫార్మాసిటీ ద్వారా ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయి” అని మంత్రి కేటీఆర్ తన సుదీర్ఘ ఉపన్యాసంలో వివరించారు.