mt_logo

వ్యవసాయరంగంలో తెలంగాణ దేశంలోనే రెండవ స్థానం.. హర్షం వ్యక్తం చేసిన కేటీఆర్

వ్య‌వ‌సాయ రంగంలో తెలంగాణ రాష్ట్రం అద్భుత‌మైన ప్ర‌గ‌తి సాధించిందని మరోసారి రుజువైంది. నీతి ఆయోగ్ సభ్యులు విడుదల చేసిన ఓ నివేదికలో, భార‌త‌దేశంలోనే తెలంగాణ రెండో స్థానంలో నిలిచి.. ప‌లు రాష్ట్రాల‌కు మార్గ‌ద‌ర్శ‌కంగా నిలిచి ప్ర‌శంస‌లు అందుకుంటోంది. ఈ క్ర‌మంలో తెలంగాణ రెండవ స్థానంలో నిలవడంపై మంత్రి కేటీఆర్ హ‌ర్షం వ్య‌క్తం చేస్తూ ట్వీట్ చేశారు.

నీతి ఆయోగ్ స‌భ్యులైన రమేష్ చాంద్ నేతృత్వంలో స్వాతంత్య్ర భార‌త‌దేశంలో వ్య‌వ‌సాయ రంగం – గ‌తం, భ‌విష్య‌త్ పేరిట ఓ నివేదిక‌ను విడుద‌ల చేశారు. 2011-12 నుంచి 2019-20 మ‌ధ్య కాలంలో దేశంలో వ్య‌వ‌సాయ రంగం సాధించిన పురోగ‌తిని ఆ నివేదిక‌లో క్లుప్తంగా పేర్కొన్నారు. ఈ ద‌శాబ్ద కాలంలో తెలంగాణ రాష్ట్రం వ్య‌వ‌సాయ రంగంలో 6.59 శాతం వృద్ధి రేటును సాధించి, దేశంలోనే రెండో స్థానంలో నిలిచిన‌ట్లు నివేదిక‌లో వెల్ల‌డించారు. మొద‌టి స్థానంలో త్రిపుర‌(6.87 శాతం వృద్ధిరేటు) నిలిచింది. అయితే పెద్ద రాష్ట్రాల‌తో పోల్చితే తెలంగాణ అగ్రభాగాన ఉంది.

తెలంగాణ ప్ర‌భుత్వం.. సాగునీటికి క‌ష్టాలు లేకుండా పెండింగ్ ప్రాజెక్టుల‌ను పూర్తి చేయ‌డం, అన‌తి కాలంలోనే కొత్త ప్రాజెక్టుల‌ను పూర్తి చేయ‌డం, 24 గంట‌ల నాణ్య‌మైన విద్యుత్ ఇవ్వ‌డంతో పాటు పంట పెట్టుబ‌డి సాయం కింద ఎక‌రానికి సంవ‌త్స‌రానికి రూ.10 వేల చొప్పున ఇవ్వ‌డం వ‌ల్లే ఈ విజ‌యం సాధ్య‌మైంది. రైతుల క‌ష్టం తెలిసిన ముఖ్య‌మంత్రి కేసీఆర్ వ్య‌వ‌సాయ రంగంపై ప్ర‌త్యేక దృష్టి సారించి, నిర్విరామంగా కృషి చేయ‌డంతోనే తెలంగాణ రాష్ట్రం అద్భుత విజ‌యాలు సాధిస్తోంది.

వ్య‌వ‌సాయ అనుబంధ రంగాల్లో తెలంగాణ‌కు ఐదో స్థానం :

వ్య‌వ‌సాయ రంగంతో పాటు దాని అనుబంధ రంగాలైన డెయిరీ, ప‌శుసంప‌ద‌, మ‌త్స్య‌సంప‌ద‌లో సాధించిన వృద్ధిరేటును ప‌రిశీలిస్తే తెలంగాణ ఐదో స్థానంలో నిలిచింది. వ్య‌వ‌సాయ అనుబంధ రంగాల్లో పెద్ద రాష్ట్రాల‌తో పోల్చితే తెలంగాణ రెండో స్థానంలో ఉంది.

జీఎస్‌డీపీలో మూడు రెట్లు పెరిగిన వ్య‌వ‌సాయ రంగం వాటా:

తెలంగాణ స్టేట్ స్టాట‌స్టిక‌ల్ అబ్‌స్ట్రాక్ట్ 2020 ప్ర‌కారం.. 2011-12తో పోలిస్తే 2019-20లో జీఎస్‌డీపీలో వ్య‌వ‌సాయ రంగం వాటా దాదాపు మూడు రెట్లు పెరిగింది. 2019-20లో స్థూల రాష్ట్ర దేశీయ ఉత్ప‌త్తిలో (జీఎస్‌డీపీ) వ్య‌వ‌సాయ రంగం వాటా రూ.1,35,109 కోట్ల‌కు చేరింది. అదే సమయంలో ఉమ్మ‌డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం నుండి 2011-12లో కేవలం రూ .54,615 కోట్లుగా ఉండగా, 2015-16లో రూ.75,707 కోట్లు, 2016-17లో రూ.88,979 కోట్లు, 2017-18లో రూ.1,02,044 కోట్లు, 2018-19లో రూ.1,13,223 కోట్లుగా ఉంది. కోవిడ్ లాక్‌డౌన్ స‌మ‌యంలో(2020-21) కూడా వ్య‌వ‌సాయం, దాని అనుబంధ రంగాల నుంచి తెలంగాణ ఆర్థిక వ్యవస్థ జాతీయ స్థాయిలో 3 శాతం నుంచి 21 శాతం వృద్ధిరేటు పెరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *