కేంద్రంలోని బీజేపీపై యుద్ధం చేయడానికి సీఎం కేసీఆర్ వెంట నడవడానికి సిద్ధమని ప్రజాగాయకుడు గద్దర్ ప్రకటించారు. నూతన పార్లమెంట్ భవనానికి అంబేడ్కర్ పేరు పెట్టేలా చూడాలని కోరుతూ చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డిని ప్రజా గాయకుడు గద్దర్ కలిశారు. దళిత-గిరిజన ప్రజా వ్యతిరేక విధానాల మీద మరియు పార్లమెంట్‌కి అంబేడ్కర్ పేరు పెట్టే అంశంపై సీఎం కేసీఆర్ కేంద్రం మీద యుద్ధం ప్రకటిస్తే కేసీఆర్‌తో తాను కూడా నడుస్తానని గద్దర్ అన్నారు. జాతీయ రాజకీయాలపై దాదాపు గంటకు పైగా చర్చించిన గద్దర్.. త్వరలో టీఆర్ఎస్ ఎంపీలతో కలిసి సీఎం కేసీఆర్‌ను కలుస్తానని తెలిపారు.
కాగా గద్దర్ చేసిన సూచనను పార్లమెంట్లో ప్రస్తావిస్తానని ఎంపీ రంజిత్ రెడ్డి హామీ ఇచ్చారు. గద్దర్ అభిప్రాయాలతో ఎంపీ రంజిత్ రెడ్డి పూర్తిగా ఏకీభవించారు. తెలంగాణ ఉద్యమ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ అంబేడ్కర్ రాజ్యాంగం వల్లే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని సీఎం కేసీఆర్ అసెంబ్లీ వేదికగా మాట్లాడటమే గాక మంత్రి కేటీఆర్ కూడా ఇదే అంశంపై తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేసినా అంశాన్ని ఎంపీ రంజిత్ రెడ్డి గద్దర్‌తో ప్రస్తావించారు. ప్రజాస్వామ్య దేవాలయమైన పార్లమెంటు భవనానికి అంబేడ్కర్ పేరు పెట్టడం సముచితమేనని ఎంపీ అన్నారు.