పసితనంలోనే తల్లిదండ్రులను కోల్పోయి… రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అందించిన ఆర్థిక అండతో ఇంజినీరింగ్ విద్యను పూర్తి చేసుకున్న జగిత్యాల జిల్లా రాయికల్ కు చెందిన రుద్ర రచన ఏకంగా ఐదు బహుళజాతి కంపెనీల్లో జాబ్ ఆఫర్లను సాధించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆమె విజయ ప్రస్థానాన్ని మీడియా ద్వారా తెలుసుకున్న మంత్రి కేటీఆర్ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. తన సోషల్ మీడియా ఖాతాలో ఈ ఆనందాన్ని పంచుకుంటూ… ఈ వార్త తన హృదయాన్ని హత్తుకుందని, రచనను సాధించిన విజయానికి గర్విస్తున్నానని అన్నారు. ఎంతో ఉజ్వలమైన భవిష్యత్ ఉన్న విద్యార్థిని రచన.. మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించబోతోందని కేటీఆర్ పేర్కొన్నారు.