హైదరాబాద్ నగరాన్ని సిగ్నల్ ఫ్రీ నగరంగా చేసేందుకు వ్యూహాత్మక రోడ్ల అభివృద్ధి ఫలాలు విడుతల వారీగా ప్రజలకు అందుబాటులోకి వస్తున్నాయి. ఎస్‌ఆర్‌డీపీ పథకం మొదటి దశలో రూ.8092 కోట్లతో 47 చోట్ల ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌లు, కేబుల్ బ్రిడ్జిలు, స్టీల్ బ్రిడ్జిలు, ఆర్వోబీలు, ఆర్‌యూబీల నిర్మాణాలకు శ్రీకారం చుట్టగా, ఇప్పటి వరకు రూ.3748.85కోట్లతో 31 చోట్ల ప్రాజెక్టులు అందుబాటులోకి వచ్చాయి.
15 ఫ్లై ఓవర్లు, 5 అండర్‌పాస్‌లు, ఏడు ఆర్వోబీ/ఆర్‌యూబీలు, ఒక కేబుల్ బ్రిడ్జిలు, విస్తరణ బ్రిడ్జి ఒకటి, ఓఆర్‌ఆర్ నుంచి మెదక్ జంక్షన్ వరకు ప్రాజెక్టులు రావడంతో ట్రాఫిక్ సమస్యకు చెక్ పడింది. ఇక రూ. 4304.07కోట్లతో 16 చోట్ల పనులు పురోగతిలో ఉన్నాయి. 13 చోట్ల జీహెచ్‌ఎంసీ, మరో మూడు చోట్ల ఇతర శాఖలు ఆధ్వర్యంలో నిర్మాణ పనులు జరుగుతున్నాయి. పురోగతిలో ఉన్న 16 చోట్ల ప్రాజెక్టుల పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయడమే లక్ష్యంగా తాజాగా లక్ష్యాలను ఖరారు చేశారు.
దాదాపు 80శాతం మేర పూర్తి చేసుకున్న ఈ పనులను ఈ ఏడాది డిసెంబరు నాటికి కీలకమైన ప్రాంతాలు కలిపి ఏడు చోట్ల ఫ్లై ఓవర్లు అందుబాటులోకి తీసుకువచ్చేలా చర్యలు చేపడుతున్నట్లు చీఫ్ ఇంజినీర్ ప్రాజెక్టు దేవానంద్ తెలిపారు. కొత్తగా వచ్చే ఫ్లై ఓవర్లతో ట్రాఫిక్ సమస్య పూర్తిగా తొలిగిపోనుంది. ప్రయాణం సాఫీగా జరుగడంతో వాహనదారులకు సమయం, ఇందనం ఆదా కానుంది.