నేడు ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో ఉన్న రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్…ఆదిలాబాద్ నుంచి దేశ, విదేశాల్లో సాఫ్ట్ వేర్ కంపెనీలకు ఐటీ సేవలను అందించడం నిజంగా అభినందనీయమన్నారు. ఆదిలాబాద్ జిల్లా లాంటి మారుమూల ప్రాంతాల్లో ఐటీ టవర్ ఏర్పాటు చేయడం గర్వంగా ఉందని కొనియాడారు. ఐటీ కంపెనీలకు అవసరమైన విద్యుత్ సేవలను మెరుగు పరిచేందుకు కోటిన్నర రూపాయల నిధులను వెంటనే మంజూరు చేస్తామన్నారు. అంతేకాదు..త్వరలో జిల్లా కేంద్రంలో శాశ్వతంగా ఐటీ పార్కు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఆదిలాబాద్ జిల్లా లో ఐటీ టవర్ ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిన ఎన్టీటీ డాటా ఐటీ కంపెనీ ప్రతినిధులను మంత్రి అభినందించారు. జిల్లాలో ఐటీతో పాటు టూరిజం అభివృద్ధి చెందేందుకు ఎన్నో అవకాశాలు ఉండటంతో టూరిజాన్ని మరింత మెరుగుపరిచేందుకు ప్రభుత్వపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అంతకుముందు మాతృవియోగంలో ఉన్న ఎమ్మెల్యే జోగు రామన్నను మంత్రి కేటీఆర్ పరామర్శించారు. మంత్రి కేటీఆర్ వెంట మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి ఉన్నారు.