హైదరాబాద్ నగర అభివృద్ధికి బహుముఖైన వ్యూహాంతో ముందుకు వెళ్తున్నామని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. హైదరాబాద్ నగరంలో వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి ప్రాజెక్టు(ఎస్ఆర్‌డీపీ) కింద రూ.37 వేల కోట్లతో 70 పనులను ప్రభుత్వం సిద్ధం చేసిందని మంత్రి తెలిపారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఎస్ఆర్‌డీపీ పథకం కింద చేపట్టిన పనులపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ సమాధానం ఇచ్చారు. ఎస్ఆర్‌డీపీ కింద 8 వేల 52 కోట్ల 82 లక్షల కోట్లతో 47 పనులను చేపట్టడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు రూ.2 వేల 497 కోట్ల 93 లక్షల వ్యయంతో 27 పనులు పూర్తయ్యాయి. మిగిలిన 20 పనులు.. జీహెచ్ఎంసీ ద్వారా 17, ఆర్&బీ, నేషనల్ హైవే శాఖల ద్వారా 3 పనులు పురోగతిలో ఉన్నాయని తెలిపారు. ఎస్ఆర్డీపీ కింద రెండో దశలో ఉప్పల్‌లో రూ. 450 కోట్లతో ఫ్లై ఓవర్, ఖైరతాబాద్ నియోజకవర్గంలో రెండు ఫ్లై ఓవర్లు ఏర్పాటు చేయబోతున్నాం. కార్వాన్ నియోజకవర్గంలో మల్టీ లెవల్ ఫ్లై ఓవర్, కుత్బుల్లాపూర్‌లో ఫాక్ సాగర్ వద్ద అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. చార్మినార్ జోన్‌లో బండ్లగూడ వద్ద ఫ్లై ఓవర్, హుమర్ హోటల్ వద్ద మరో ఫ్లై ఓవర్, రాజేంద్రనగర్‌లో ఫలక్‌నుమా నుంచి బద్వేల్ ఆర్‌వోబీ నిర్మిస్తామన్నారు. సికింద్రాబాద్ పరిధిలోని చిలుకలగూడ, మాణికేశ్వరి నగర్‌లో ఆర్‌యూబీలు నిర్మిస్తామన్నారు. వీటితో పాటు మరిన్ని పనులు చేపడుతామని మంత్రి కేటీఆర్ చెప్పారు.
హైదరాబాద్‌లో పట్టణీకరణ వేగంగా కొనసాగుతోంది. ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని ఫ్లై ఓవర్లు, అండర్ పాస్‌లు నిర్మిస్తున్నామని తెలిపారు. బహదూర్ పురా ఫ్లై ఓవర్‌ను త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. ఓవైసీ ఫ్లై ఓవర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. నగర అభివృద్ధికి బహుముఖమైన వ్యూహంతో ముందుకు వెళ్తున్నాం. భారతదేశంలోని ఏ ఇతర నగరాల్లో జరగనంతా వేగంగా మౌలిక వసతుల అభివృద్ధి జరుగుతుందన్నారు. రాష్ట్రానికి వచ్చే పారిశ్రామికవేత్తలు.. మన నగరాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. మన రోడ్లు, ఇతర కార్యక్రమాలు అద్భుతంగా ఉన్నాయని కొనియాడుతున్నారు.