mt_logo

హైదరాబాద్ లో నివసించే వారంతా తెలంగాణ వారే..

తెలంగాణ రాష్ట్రంలో నివసించే వారందరినీ కడుపులో పెట్టుకుని కాపాడుకుంటామని, ముఖ్యమంత్రిగా ఆ బాధ్యత తనదేనని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు చెప్పారు. బేగంపేట సీఎం క్యాంపు కార్యాలయంలో గురువారం సీఎం కేసీఆర్ సమక్షంలో కూకట్ పల్లికి చెందిన సుమారు వెయ్యిమంది టీఆర్ఎస్ పార్టీలో చేరిన సందర్భంగా వారికి గులాబీ కండువాలు కప్పి కేసీఆర్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వానికి ప్రాంతీయభేదాలు లేవని, హైదరాబాద్ లో నివసించే వారంతా తెలంగాణ వారేనన్నారు. తాతలు, తండ్రులు ఎప్పుడో హైదరాబాద్ కు వచ్చి స్థిరపడ్డవారు తాము సెటిలర్స్ అన్న భావన వదిలేయాలని, ఇక తెలంగాణలో సెటిలర్స్ అనేవారు ఉండరని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

నగరంలో అన్ని ప్రాంతాల ప్రజలు నివసిస్తున్నారని, ఇక్కడ ఆధార్ కార్డు, రేషన్ కార్డు తీసుకుని స్థిరపడ్డవారంతా తెలంగాణ వారేనని, విదేశాల్లో సైతం ఐదేండ్లు నివసిస్తే అక్కడ లోకల్ గా పరిగణిస్తారని, ఇక్కడ మనం అందరం ఒకే దేశంలోని వారిమని కేసీఆర్ పేర్కొన్నారు. తనది మెదక్ జిల్లా అయినా హైదరాబాద్ అనే చెప్పుకుంటానని, ఇక్కడ నివసించే ప్రతి ఒక్క వ్యక్తి బాధ్యత ముఖ్యమంత్రిగా తనదేనని, చీమ కుట్టినా, కాలుకు ముల్లు గుచ్చినా పంటితో తీస్తానని, ఎవరికీ ఎలాంటి అభద్రతా భావం అవసరం లేదని హామీ ఇచ్చారు. హైదరాబాద్ కు ఘన చరిత్ర ఉందని, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉందని, విజన్ హైదరాబాద్ అమలుకు అందరం కలిసి కృషి చేద్దామని సీఎం పిలుపునిచ్చారు.

ఇప్పుడు కూకట్ పల్లి ప్రాతం వారితోనే కలిశామని, త్వరలోనే అన్ని ఏరియాల ప్రజలను పిలిచి తన అధికారిక నివాసంలో ఒక గెట్ టుగెదర్ ఏర్పాటు చేసుకుని సమస్యలు పరిష్కరించుకుందామని, హైదరాబాద్ అభివృద్ది అంశంపై మాట్లాడుకుని కలిసి భోజనం చేద్దామని అన్నారు. చిత్ర పరిశ్రమలో కీలకమైన వ్యక్తి అయినందునే ఎలాంటి ప్రాంతీయ బేధం లేకుండా ప్రభుత్వ లాంఛనాలతో రామానాయుడు అంత్యక్రియలు జరిపించామని, హైదరాబాద్ లో సినీ పరిశ్రమ అభివృద్ధిలో రామానాయుడు కృషి ఉందని కేసీఆర్ గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో జంటనగరాల అడ్ హక్ కమిటీ కన్వీనర్ మైనంపల్లి హన్మంతరావు, కేసీఆర్ రాజకీయ సలహాదారు శేరి సుభాష్ రెడ్డి, గ్రేటర్ హైదరాబాద్ పరిశీలకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి, కూకట్ పల్లి ఇన్చార్జి గొట్టిముక్కల పద్మారావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *