తెలంగాణ ప్రగతిలో గ్రేటర్ హైదరాబాద్ పాత్ర కీలకంగా మారింది. పట్టణ విస్తీర్ణం తక్కువైనా విద్య, వైద్య, ఐటీ రంగాల్లో నగరానికి ప్రత్యేక స్థానం ఉంది. తాజాగా తెలంగాణ రాష్ట్ర డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ రూపొందించిన గణాంకాల జాబితాలో గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు ప్రత్యేక స్థానం దక్కింది. గ్రేటర్‌లో ట్రాఫిక్ సమస్యలు, ప్రయాణ దూరం తగ్గించడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రణాళికా బద్ధంగా రహదారులను అభివృద్ధి చేస్తున్నది. పెరుగుతున్న జనాభా, జన సాంద్రతను దృష్టిలో ఉంచుకొని కొత్త రోడ్ల నిర్మాణం, ఉన్న రోడ్ల పరిరక్షణ, లింకు రోడ్లకు వేర్వేరుగా ప్రణాళికలతో నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నది. మేడ్చల్- మల్కాజిగిరి జిల్లాలో 938.6 కిలోమీటర్ల రహదారుల అభివృద్ధి జరుగగా, ఇందులో జాతీయ రహదారులు 50.3 కిలోమీటర్లు, పంచాయతీరాజ్ శాఖ పరిధిలోని 497.2, ఆర్&బీ పరిధిలో 391.1 కిలోమీటర్లు ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా పరిధిలో 5,061.7 కిలోమీటర్ల మేరలో రహదారులు ఉండగా, 167.3 కి.మీల జాతీయ రహదారులు, 3,790.09 కి.మీలో పంచాయతీ రాజ్ శాఖ, ఆర్‌అండ్‌బీ శాఖ పరిధిలో 1103.05 కిలోమీటర్ల రహదారులు అభివృద్ధి చెందాయి.
*హైదరాబాద్ జిల్లాలో అక్షరాస్యత శాతం 83.2గా ఉండగా, అందులో 6 ఏండ్ల పైబడి ఉన్న జనాభా 34,74,197 ఉండగా, అందులో అక్షరాస్యత కలిగిన వారు 28,92,155 మంది ఉన్నారు. ఇందులో పురుషుల జనాభా 17,73,448 ఉండగా, 15,42,688 మంది అక్షరాస్యతను కలిగి ఉన్నారు. పురుషులు 87 శాతం ఉండగా, మహిళల శాతం 79.3గా ఉంది. వీరిలో 17,00,749 మంది ఆరేండ్లకు పైబడిన వారు ఉండగా, అందులో 13,49,467 మంది అక్షరాస్యతను కలిగి ఉన్నారు. జిల్లాలో పురుషులు 20,18,575, మహిళలు 19,24,748 ఉండగా, వారిలో పురుషులు, మహిళల మధ్య వ్యత్యాసం 957గా ఉంది.
*హైదరాబాద్ జిల్లాలో విద్యుత్ కనెక్షన్లు గృహ వినియోగం కోసం 17,15,957, వ్యవసాయ కనెక్షన్లు 86, ఇండస్ట్రియల్ కనెక్షన్లు 4,01,504లు ఉండగా, మొత్తం విద్యుత్ కనెక్షన్లు 21,17,547 ఉన్నాయి.
*హైదరాబాద్‌లో 1,05,621 వాహనాలు రిజిస్ట్రేషన్ కాగా, మేడ్చల్-మల్కాజిగిరిలో 1,04,403 వాహనాలు, రంగారెడ్డిలో 95,944 వాహనాలు రిజిస్ట్రేషన్ అయ్యాయి. మూడు జిల్లాల్లో నాన్ ట్రాన్స్‌పోర్ట్ వాహనాలు 2.91 లక్షలు రిజిస్ట్రేషన్ అయ్యాయి. ట్రాన్స్‌పోర్ట్ వాహనాలు 15 వేలు ఉన్నాయి. ద్విచక్ర వాహనాలు 2.15 లక్షలు రిజిస్ట్రేషన్ అయ్యాయి.
*గ్రేటర్ ప్రగతిలో బస్తీ దవాఖానలు :
ఒక హైదరాబాద్ జిల్లాలోనే 85 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 14 ఏరియా ఆస్పత్రులు, 12 ట్రెషరీ ఆస్పత్రులు ఉన్నాయి. నాలుగేండ్ల కిందట ప్రవేశపెట్టిన బస్తీ దవాఖానల సంఖ్య ప్రస్తుతం 151కి చేరింది. బస్తీ దవాఖానల్లో సాధారణ వైద్య సేవలతో పాటు టెలీ మెడిసిన్ ద్వారా ఉస్మానియా, గాంధీ, నిమ్స్ వంటి ట్రెషరీ దవాఖానల నుంచి సూపర్ స్పెషాలిటీ సేవలు లభిస్తున్నాయి.
ప్రస్తుతం 142 బస్తీ దవాఖానల్లో టెలీమెడిసిన్ సేవలు అందుబాటులో ఉన్నాయి. అవసరమైన వైద్య పరీక్షలను తెలంగాణ డయగ్నోస్టిక్ సెంటర్ల ద్వారా నిర్వహిస్తున్నారు.