దరఖాస్తు చేసుకున్న పదిరోజుల్లోనే పారిశ్రామికవేత్తలకు అన్ని అనుమతులు ఇచ్చి ఒక కొత్త ఒరవడికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టుతున్నది. ఒకేసారి 17 కంపెనీలకు మంగళవారం మధ్యాహ్నం రెండు గంటలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు స్వయంగా అనుమతులు అందజేయనున్నారు. రూ. 1500 కోట్ల పెట్టుబడితో సుమారు 4 వేలమందికి ఈ కంపెనీలు ఉపాథి కల్పించనున్నాయి. రంగారెడ్డి, నల్గొండ, మెదక్, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఈ కంపెనీలను ఏర్పాటు చేస్తున్నారు. ఐటీసీ, సోలార్ పవర్, బల్క్ స్పేర్ పార్ట్స్, ప్రముఖ కంపెనీల ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, ఇంజినీరింగ్ పరికరాల తయారీ తదితర పరిశ్రమలు ఈరోజు అనుమతులు అందుకోనున్నాయి.
ఈనెల 12న దేశంలోని పారిశ్రామిక దిగ్గజాల సమక్షంలో సీఎం కేసీఆర్ టీఎస్-ఐపాస్ ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ప్రపంచంలోకెల్లా అత్యుత్తమ పారిశ్రామిక విధానం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో పర్యటనలు, అధ్యయనాలు చేసి ఈ టీఎస్-ఐపాస్ ను రూపొందించింది. పరిశ్రమలకు కావాల్సిన భూములు, నీళ్ళు, విద్యుత్, రాయితీలకు ఈ నూతన విధానంలో పెద్దపీట వేశారు. దేశంలోనే ఇప్పటివరకు ఇలాంటి పారిశ్రామికవిధానం ఏ రాష్ట్రంలో కూడా లేదని చెప్తూ అదే వేదికపైనుండి అనేకమంది పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెడతామని కూడా ప్రకటించారు. పారిశ్రామిక దిగ్గజం ఐటీసీ సంస్థ చైర్మన్ దేవేశ్వర్ తెలంగాణలో రూ. 8000 కోట్ల పెట్టుబడులు పెడతామని ప్రకటించిన వెంటనే ఇతర పారిశ్రామికవేత్తలు కూడా తెలంగాణలో పరిశ్రమలు పెట్టడానికి ముందుకొచ్చి దరఖాస్తులు చేశారు.
రెండువారాల్లోనే అనుమతులు ఇస్తామని ముఖ్యమంత్రి చెప్పినా అధికారులు వేగంగా పనులు పూర్తిచేసి కేవలం 10 రోజుల్లోనే అనుమతుల ప్రక్రియను పూర్తి చేశారు. దీంతో మొదటి విడత అనుమతులు పొందే కంపెనీలకు ప్రభుత్వం ఈరోజు ఆహ్వానం పంపింది. పారిశ్రామిక విధానం ప్రకటించిన 10 రోజులకే అనుమతులు ఇవ్వడం ఒక రికార్డని, ఇది తెలంగాణ ప్రభుత్వం సాధించిన గొప్ప విజయమని పారిశ్రామికవేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య అధ్యక్షుడు కే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వ పారిశ్రామిక విధానాలపై దృష్టి సారించాయని, ఇవాళ జరిగే అనుమతుల జారీ ఆరంభం మాత్రమేనని, ముందుముందు గొప్ప పారిశ్రామిక విప్లవాన్ని చూడటం ఖాయమని పేర్కొన్నారు. దేశవిదేశాల నుండి తమను సంప్రదిస్తున్నారని, ఎలాంటి ప్రోత్సాహకాలు ఇస్తున్నారు? ప్రభుత్వం సహకారం ఎలా ఉంది? అంటూ ఈ మెయిల్స్ ద్వారా అడుగుతున్నారని ఆయన అన్నారు.