ప్రముఖ దైవక్షేత్రం యాదగిరి గుట్టలోని లక్ష్మి నరసింహ స్వామి వారికి విరాళాలు ఇవ్వాలని సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేయగా.. దానికి విపరీతమైన స్పందన వస్తోంది. మొదట ముఖ్యమంత్రి కేసీఆర్ తన వంతుగా కిలో 16 తులాల బంగారం విరాళంగా ప్రకటించారు. సీఎం కేసీఆర్ స్ఫూర్తితో హెటిరో గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ పార్థసారథిరెడ్డి 5 కిలోల బంగారం ఇచ్చేందుకు ముందుకొచ్చారు. చరిత్రలో నిలిచిపోయే గొప్ప నిర్మాణంలో తాము, తమ కుటుంబ సభ్యులు భాగస్వామం కావడం సంతోషంగా ఉన్నదని చెప్పారు. నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి టెంపుల్ సిటీలో కాటేజీ నిర్మిణానికి రూ.2 కోట్ల నగదు విరాళం ప్రకటించారు. ఎంపీ మల్లారెడ్డి రెండు కిలోల బంగారాన్ని విరాళంగా ప్రకటించగా, ఆర్థిక మంత్రి హరీష్ రావు తనవంతుగా కిలో బంగారాన్ని విరాళంగా ప్రకటించారు. మరికొందరు రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల ప్రజాప్రతినిధులు కిలో బంగారం చొప్పున విరాళం ప్రకటించారు. వీరితోపాటు నమస్తే తెలంగాణ సంస్థల ఎండీ, జలవిహార్ ఎండీ, కావేరీ సీడ్స్ ఎండీ, జీయర్ పీఠం తరపున కిలో బంగారం చొప్పున స్వామి వారికి విరాళం ప్రకటించారు. యాదాద్రికి పలువురు మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యే, సంస్థలు, ప్రముఖులు భూరి విరాళాలు ప్రకటించారు.