mt_logo

మాదకద్రవ్యాల వినియోగంపై ఉక్కుపాదం : సీఎం కేసీఆర్

రాష్ట్రంలో గంజాయి అక్రమ సాగు, వినియోగంపై ఉక్కుపాదం మోపాలని ముఖ్యమంతి కేసీఆర్‌ పోలీస్, ఎక్సైజ్ శాఖల అధికారులను ఆదేశించారు. గంజాయి వినియోగ పరిస్థితి మరింత తీవ్రతరం కాకముందే పూర్తిగా అప్రమత్తం కావాలని ఆదేశించారు. ఉన్నతస్థాయి సమావేశంలో విస్తృతంగా చర్చించి గంజాయి ఉత్పత్తిని సమూలంగా నిర్మూలించడానికి సమగ్ర ప్రణాళికను సిద్ధం చేయాలని సీఎం కేసీఆర్ ఉన్నతాధికారులను ఆదేశించారు. బుధవారం ప్రగతిభవన్‌లో నిర్వహించిన పోలీస్, ఎక్సైజ్ శాఖల ఉన్నతస్థాయి సమావేశంలో అధికారులనుద్దేశించి సీఎం మాట్లాడుతూ.. ఒక వైపు రాష్ట్రం గొప్ప అభివృద్ధిని సాధిస్తున్న సందర్భంలో గంజాయి వంటి మాదక ద్రవ్యాల లభ్యత పెరగడం శోచనీయమన్నారు. ఈ పీడను తొందరగా తొలగించకపోతే మనం సాధిస్తున్న విజయాలు వాటి ఫలితాలు నిర్వీర్యమైపోయే ప్రమాదం వుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాద ఘంటికలు మోగుతున్నాయనే విషయాన్ని పోలీస్, ఎక్సైజ్ శాఖాధికారులు తీవ్రంగా పరిగణించాలని అన్నారు. ఎంతో ఆవేదనతో తాను ఈరోజు ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. పెడతోవ పట్టిన యువత గంజాయి గ్రూపులుగా ఏర్పడి వాట్సాప్ మెసెజ్‌ల ద్వారా గంజాయి సేవిస్తున్నారని నివేదికలు వస్తున్నాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చన్నారు. గంజాయిని నిరోధించడానికి డీజీ స్థాయి అధికారిని ప్రత్యేకంగా నియమించి ఒక ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేయాలన్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ను, ఫ్లయింగ్ స్క్వాడ్స్‌ను బలోపేతం చేయాలని ఎక్సైజ్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్‌ను ఆదేశించారు. విద్యా సంస్థల దగ్గర ప్రత్యేక నిఘా పెట్టాలని సూచించారు. బార్డర్లలో చెక్ పోస్టుల సంఖ్యను పెంచాలన్నారు. సమాచార వ్యవస్థను పటిష్టం చేయడంతో పాటు తగినన్ని వాహనాలను ఏర్పాటు చేయాలన్నారు. ఇంటలిజెన్స్ శాఖలో కూడా ఇందుకోసం ప్రత్యేక విభాగాన్ని నెలకొల్పాలని చెప్పారు. ఈ సమావేశంలో హోంమంత్రి మహమూద్ అలీ, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, తదితర నాయకులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *