mt_logo

ఈ కుటుంబానికి సాయం చేయండి!

[వీరికి సహాయం చేయాలనుకుంటే… 9701611780, 949235 8700 నంబర్లలో సంప్రదించవచ్చు. బ్యాంకు ఖాతా సంఖ్య 62087646009 (ఎం.రవీందర్, ఎస్‌బీహెచ్, హుజూర్‌నగర్ బ్రాంచ్, నల్లగొండ జిల్లా).

తీరని కష్టం!

కుదేలైన గిరిజన కుటుంబం..
చిన్నారికి అప్పటికే గుండె జబ్బు
పేలుడులో కాలు కోల్పోయిన తండ్రి..
8 నెలలు కదల్లేని స్థితిలో తల్లి
కుటుంబమంతా ఆస్పత్రిపాలు
దిక్కు తోచని ఇద్దరు పిల్లలు
దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్లకు శాశ్వత బాధితులుగా మారిన
రవీందర్ నాయక్ కుటుంబం దీనగాథ…

కుడికాలు కోల్పోయిన తండ్రి! మరో ఎనిమిది నెలల వరకూ కదల్లేని స్థితిలో తల్లి! ఆస్పత్రిలో ఆ ఇద్దరి మధ్యలో… రెండున్నరేళ్ల చిన్నారి! ఆ పసి గుండెకు… మూడు రంధ్రాలు! అదే కుటుంబంలో మరో నలుగురు క్షతగాత్రులు! ఇది కష్టాలకు సైతం కన్నీళ్లు తెప్పించే కష్టం! కరకు రాతిని సైతం కరిగించే కష్టం.

హైదరాబాద్, మార్చి 2 : రవీందర్ నాయక్, లక్ష్మి! ఐదేళ్ల క్రితం పెళ్లయింది. వారికి ఇద్దరు పిల్లలు… అర్చన (5), అనిల్ (రెండున్నరేళ్లు)! నల్లగొండ జిల్లా మఠంపల్లి మండలం రామచంద్రాపురం గ్రామానికి చెందిన గిరిజన కుటుంబం! కూలీకి వెళుతూ జీవనం సాగించేవారు. చిన్న కుటుంబం… కానీ, చింత మాత్రం పెద్దదే! ఎందుకంటే, అనిల్ చిన్ని గుండెకు మూడు రంధ్రాలున్నాయి. గుండె జబ్బు కారణంగా అనిల్‌కు మాటలు కూడా రాలేదు.

‘మన ప్రయత్నం మనం చేద్దాం’ అంటూ రవీందర్ నాయక్ దంపతులు తమ కుమారుడిని చాలామంది డాక్టర్లకు చూపించారు. ఇందులో భాగంగానే, పేలుళ్ల ఘటనకు మూడు రోజుల ముందు రవీందర్, లక్ష్మి, ఇద్దరు పిల్లలు, రవీందర్ తల్లి, లక్ష్మి తల్లిదండ్రులు… మొత్తం ఏడుగురు హైదరాబాద్‌కు వచ్చారు. తార్నాకలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో అనిల్‌కు పరీక్షలు చేయించారు. ‘అనిల్ ఆపరేషన్‌కు రూ.10 లక్షలు ఖర్చు అవుతుంది’ అని డాక్టర్లు చెప్పారు. అంత డబ్బులేదు!

‘సరే… మూడు నెలల్లో మళ్లీ వస్తాం’ అని ఆస్పత్రిలో చెప్పి… అందరూ వెనుదిరిగారు. కొత్తపేటలో నివసిస్తున్న తన సోదరుడు రంగారావు ఇంటికి వచ్చారు. గత నెల 21న తిరిగి ఊరికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. దిల్‌సుఖ్‌నగర్‌లోని 107 బస్‌స్టాప్ వద్దకు చేరుకున్నారు. బస్సు రావడానికి ఇంకా సమయం ఉండటంతో… ‘పిల్లలకు ఏమైనా కొందాం!’ అనుకున్నారు. గౌను, పిన్నులు, గాజులు కొంటుండగానే…. పేలుడు సంభవించింది. ఘోరం జరిగిపోయింది! రవీందర్, లక్ష్మి, వారి పిల్లలు, లక్ష్మి తండ్రి…. అందరూ క్షతగాత్రులయ్యారు. రవీందర్ తల్లి కూడా స్వల్పంగా గాయపడ్డారు.

కాలుపోయింది…

రవీందర్ నాయక్ కుడికాలుకు తీవ్రగాయాలు కావడం, ఇన్‌ఫెక్షన్ సోకడంతో దానిని మోకాలి వరకు తొలగించారు. లక్ష్మి రెండురోజుల తర్వాతగానీ స్పృహలోకి రాలేదు. ఆమె కుడికాలు కూడా బాగా దెబ్బతింది. ‘ఎనిమిది నెలల వరకు కదలకుండా ఉంచాలి. అప్పటికీ ఫలితం లేకపోతే, ఆమె కాలు కూడా తొలగించాల్సిందే’ అని నాంపల్లి కేర్ వైద్యులు తెలిపారు. పేలుళ్ల శబ్దం తీవ్రతకు రవీందర్ నాయక్ కుటుంబ సభ్యులంతా వినికిడి శక్తి కోల్పోయారు. చిన్నారి అనిల్‌కు… మాట రాదు! ఇప్పుడు… వినిపించదు కూడా!

“పిల్లవాడి గుండె జబ్బు చికిత్సకు 10 లక్షలు అవుతుందన్నారు. అందులో రెండు లక్షలు ప్రభుత్వం ఇస్తుందంట. ఇంకా ఎనిమిది లక్షలు కావాలి. మేం బాగుంటే ఏమైనా చేయవచ్చు. కానీ, మా పరిస్థితే ఇలా ఉంది!” అని లక్ష్మి కన్నీటి పర్యంతమైంది. కాలు పోగొట్టుకున్న తాను ఇక కుటుంబాన్ని ఎలా పోషించాలో తెలియక రవీందర్ తనలో తాను కుమిలిపోతున్నాడు. “ఎలా బతకాలో తెలియడంలేదు. వారిలో ఎవ్వరికీ ఏమీ వినిపించడంలేదు. ఇలాంటి బతుకుకంటే చావడమే నయమని తమ్ముడు ఏడుస్తున్నాడు” అని రవీందర్ అక్క గుడ్లనీరు కక్కుకుంది. రవీందర్ సోదరులు రంగారావు, సోమ్లాతో సహా వారి సన్నిహితులంతా విషాదంలో మునిగిపోయారు. దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. చిన్నారి అనిల్ గుండె ఆపరేషన్‌కు సహకరించాలని, రవీందర్ కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని, మనసున్న మనుషులను వేడుకుంటున్నారు.

వీరికి సహాయం చేయాలనుకుంటే… 9701611780, 949235 8700 నంబర్లలో సంప్రదించవచ్చు. బ్యాంకు ఖాతా సంఖ్య 62087646009 (ఎం.రవీందర్, ఎస్‌బీహెచ్, హుజూర్‌నగర్ బ్రాంచ్, నల్లగొండ జిల్లా).

(ఆంధ్రజ్యోతి సౌజన్యంతో)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *