mt_logo

హరితహారం క్రెడిట్ అంతా కేసీఆర్ కే : ప్రపంచ పర్యావరణవేత్తకు తెలిపిన మంత్రి కేటీఆర్

దేశంలోని అన్ని మెట్రో నగరాల్లో అటవీ విస్తీర్ణం వృద్ధిలో హైదరాబాద్ మొదటిస్థానంలో నిలవడం గొప్ప విషయమని అభినందించారు ప్ర‌పంచ ప‌ర్యావ‌ర‌ణ‌వేత్త ఏరిక్ సోలీహిమ్. ఈ విషయంలో హైద‌రాబాద్ వాసుల‌కు సోషల్ మీడియా వేదికగా కంగ్రాట్స్ చెబుతూ, వెల్ డ‌న్ తెలంగాణ అని ఏరిక్ సోలీహిమ్ ప్ర‌శంస‌లు కురిపించారు. కాగా ఏరిక్ సోలిహిమ్ ట్వీట్ పై రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. హ‌రిత‌హారం క్రెడిట్ అంతా ముఖ్య‌మంత్రి కేసీఆర్‌దే అని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. హ‌రిత‌హారం కోసం గ్రామాలు, మున్సిపాలిటీల‌కు గ్రీన్ బ‌డ్జెట్ కింద నిధులు కేటాయిస్తూ.. ప‌చ్చ‌ద‌నాన్ని పెంచేందుకు ప్రోత్స‌హిస్తున్నామ‌ని కేటీఆర్ ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మానస పుత్రిక హరితహారం కార్యక్రమం రాష్ట్రంలో మంచి ఫలితాలు ఇస్తున్నది. ఈ పథకంతో రాష్ట్రంలో ఏకంగా 63,200 హెక్టార్లలో అదనపు పచ్చదనం పెరిగింది. దీంతో అటవీ విస్తీర్ణంలో మన రాష్ట్రం దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. రాష్ట్రంలో ప్రస్తుతం 21.47 శాతం అడవులు ఉన్నాయి. మెట్రో నగరాల్లో అటవీ విస్తీర్ణం వృద్ధిలో హైదరాబాద్‌ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. దశాబ్దకాలంలో నగరంలో 4,866 హెక్టార్ల అటవీ విస్తీర్ణం పెరిగింది. దేశంలో గత రెండేండ్లలో అటవీ విస్తీర్ణం 2,261 చదరపు కిలోమీటర్లు పెరుగగా, తెలంగాణలోనే 632 చదరపు కిలోమీటర్ల పెరుగుదల నమోదు కావటం విశేషం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *