వచ్చే ఏడాది నుండి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రారంభించనున్నట్టు విద్యాశాఖ మంత్రి పీ సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వచ్చే విద్యా సంవత్సరం నుంచే మొదటి నుండి పదవ తరగతులకు ఇంగ్లిష్ మీడియం బోధన ప్రారంభిస్తామని చెప్పారు. ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టినా, తెలుగు మీడియం బోధన యథావిధిగా కొనసాగుతుందని వెల్లడించారు. బుధవారం బషీర్‌బాగ్‌లోని కార్యాలయంలో సబితా ఇంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ… ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టడంపై క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశంలో చర్చించి, నిపుణుల నుంచి సలహాలను స్వీకరించి సమగ్రమైన విధానాన్ని రూపొందిస్తామని, క్షేత్రస్థాయి పరిస్థితులపైన అధ్యయనం చేస్తామని పేర్కొన్నారు. ఏడో తరగతి వరకు ఒక పేజీలో తెలుగు, మరో పేజీలో ఇంగ్లిష్‌లో పాఠ్యాంశాలతో కూడిన పుస్తకాలను రూపొందించామని, ప్రస్తుతం పనిచేస్తున్న టీచర్లకు శిక్షణనివ్వడమే కాకుండా, త్వరలోనే ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీచేస్తామని చెప్పారు. సర్కారు స్కూళ్లల్లో ఇంగ్లిష్ మీడియం బోధన లేకనే తమ పిల్లలను ప్రైవేటు స్కూళ్లకు పంపిస్తున్నామని తల్లిదండ్రులు వెల్లడించారని, అందువల్లనే ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం ప్రారంభించాలని నిర్ణయం తీసుకొన్నామని చెప్పారు. ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణకు ప్రత్యేక చట్టం తేవాలన్న ప్రొఫెసర్ తిరుపతిరావు కమిటీ సూచనల మేరకే చట్టాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామని వివరించారు. మన ఊరు – మన బడి కార్యక్రమాన్ని వీలైనంత త్వరగా ప్రారంభిస్తామని, ఈ యజ్ఞంలో ఎన్నారైలు, పూర్వ విద్యార్థులు భాగస్వామ్యం కావాలని మంత్రి పిలుపునిచ్చారు. ప్రైవేటు విద్యాసంస్థలతో ప్రభుత్వం లాలూచీ పడిందన్న విమర్శలను మంత్రి తీవ్రంగా ఖండించారు. ఇంగ్లిష్ మీడియం బోధించేందుకు టీచర్లు లేరనడం సరికాదని, ఇప్పటికే 10 లక్షల పైచిలుకు విద్యార్థులు ఇంగ్లిష్ మీడియంలో చదువుతున్నారని తెలిపారు. 1.03 లక్షల మంది టీచర్లు ఉంటే వారిలో చాలా మంది ఇంగ్లిష్ మీడియం బోధనలో శిక్షణ పొందారని మంత్రి వెల్లడించారు. ఇతర రాష్ట్రాల్లో విధానాలను అధ్యయనం చేసి ఫీజుల నియంత్రణపై పటిష్ఠ చట్టాన్ని తెస్తామని వివరించారు. ఫీజులను నియంత్రించాలని సాక్షాత్తు ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలే కోరుతున్నాయని, ఇలాంటప్పుడు చట్టం తెస్తే అభ్యంతరం ఎందుకని ప్రశ్నించారు.
పరీక్షల రద్దు ఉండదు :
విద్యాసంస్థలను పునఃప్రారంభించటంపై పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకొంటామని మంత్రి సబిత తెలిపారు. దీనిపై అధికారుల నుంచి పూర్తి నివేదిక తెప్పించుకొని, పరిస్థితులు అనుకూలిస్తేనే తెరుస్తామని స్పష్టంచేశారు. కరోనా కేసుల తీవ్రత పెరిగితే సెలవులు పొడిగించక తప్పదన్నారు. ఈ ఏడాది కరోనా నేపథ్యంలో పరీక్షలు రద్దు చేయడం, పై తరగతులకు ప్రమోట్ చేయడం ఉండదని మంత్రి స్పష్టంచేశారు. విద్యార్థులంతా పరీక్షలు రాయాల్సిందేనని, విద్యార్థులు ఎలాంటి ఆశలు పెట్టుకోకుండా పరీక్షలకు సన్నద్ధంకావాలని సూచించారు.