mt_logo

ఆర్టీసీ సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు లేఖ

ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన వివిధ సమస్యల గురించి సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు లేఖ రాశారు.ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేసే అపాయింటెడ్ డే అమలు చేయడం గురించి.. పెరిగిన రద్దీకి అనుగుణంగా కొత్త బస్సుల కొనుగోలు గురించి.. 2013 పీఆర్సీ బాండ్స్ పేమెంట్ చెల్లించుట గురించి తన లేఖలో హరీష్ రావు ప్రస్తావించారు.

లేఖ యధాతథంగా 👇
కార్మికులు, ఉద్యోగుల భద్రత, సంస్థ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు వీలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి, ఆమోదింప చేసిన విషయం మీకు తెలిసిందే. గత ఏడాది చివరి అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదించిన ఆర్టీసీ విలీన బిల్లును కొన్ని వివరణలు కోరుతూ, గౌరవ గవర్నర్ గారు మొదట ఆమోదించలేదు. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇవ్వడంతో పాటు, ఆర్టీసీ కార్మికులతో కలిసి తెచ్చిన వత్తిడి ఫలితంగా గవర్నర్ గారు బిల్లును ఆమోదించిన విషయం కూడా మీకు తెలిసిందే. శాసనసభ, గవర్నర్ ఆమోదించిన బిల్లును అమలు చేసే ‘అపాయింటెడ్ డే’ మాత్రమే మిగిలి ఉంది. ఎన్నికల కోడ్ రావడంతో మా ప్రభుత్వం విలీన నిర్ణయాన్ని అమలు చేసే ‘అపాయింటెడ్ డే’ నిర్వహించలేకపోయింది. ఎన్నికలు పూర్తయిన వెంటనే ‘అపాయింటెడ్ డే’ అమలు చేస్తామని బి.ఆర్.ఎస్. నాడు స్పష్టం చేసింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మానిఫెస్టోలో కూడా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే విలీన బిల్లును అమలు చేసి, ఆర్టీసీని ప్రభుత్వంలో కలుపుతామని, కార్మికులకు ప్రభుత్వమే జీతాలు చెల్లిస్తుందని ఇచ్చిన హామీని మీ దృష్టికి తెస్తున్నాను.

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి రెండున్నర నెలలు దాటినా, ఇంత వరకు ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనానికి సంబంధించిన ‘అపాయింటెడ్ డే’ ప్రకటించలేదనే విషయాన్ని మీ దృష్టికి తెస్తున్నాను. వాస్తవంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పథకం ప్రారంభిచిన నాడే, ఆర్టీసీ విలీనానికి సంబంధించిన జీవో విడుదల చేస్తారని కార్మికులు, ఉద్యోగులు ఆశించారు. కానీ నేటి వరకు విలీనానికి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం ప్రవేశ పెట్టిన తర్వాత ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు ముఖ్యంగా మహిళా కండక్టర్లపై పనిభారం చాలా పెరిగింది. బస్సుల్లో ఎక్కువ మంది మహిళలు ఉండడంతో ఓవర్ లోడ్ వెహికిల్ నడపలేక డ్రైవర్లు, కిక్కిరిసిన బస్సుల్లో కలియ తిరుగుతూ టికెట్లు ఇవ్వడానికి కండక్టర్లు ఎంతో శ్రమించాల్సి వస్తున్నది. డ్రైవర్లు ఎక్కువ గంటలు పనిచేయాల్సి వస్తున్నది. వారి అదనపు శ్రమను దృష్టిలో పెట్టుకుని అయినా వెంటనే ‘అపాయింటెడ్ డే’ని ప్రకటించి, విలీన జీవో విడుదల చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను.  కనీసం మార్చి నెల నుంచైనా ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వ ఖజానా నుంచి వేతనాలు చెల్లించాలని కోరుతున్నాను. 

ప్రయాణీకుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని బి.ఆర్.ఎస్. ప్రభుత్వం 1000 డీజిల్ బస్సులను కొనుగోలు చేయడంతో పాటు, 500 ఎలక్ట్రిక్ బస్సులను కిరాయికి కూడా తెప్పించింది. వాటిని కూడా మీరే ఇటీవల ప్రారంభించారు. పెరిగిన మహిళల రద్దీని దృష్టిలో పెట్టుకుని మరో 2000 బస్సులను అదనంగా కొనుగోలు చేయాలని కోరుతున్నాను.
2013లో జారీ చేసిన పీఆర్సీ బాండ్స్ కు పేమెంటు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. మీరు చెప్పిన విద్ధంగానే బాండ్స్ కు అనుగుణంగా నగదు చెల్లింపులు చేయాలని కోరుతున్నాను.

అదనపు బస్సులు సమకూర్చే విషయంలో, పీఆర్సీ బాండ్స్ చెల్లించే విషయంలో మీరే స్వయంగా చొరవ చూపగలరని విన్నవించుకుంటున్నాను.