వరద బాధితులకు సాయం అందించడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం, సాయాన్ని పెంచడంతో పాటు, బాధితులందరికీ తక్షణమే ఆ సాయం అందేలా చూడాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు లేఖ రాశారు.
హరీష్ రావు రాసిన లేఖ యధాతధంగా
గౌరవ ముఖ్యమంత్రి గారికి,
ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేసాయి. ఖమ్మం, భద్రాచలం, మహబూబాబాద్, సూర్యాపేట్, వరంగల్ తో పాటు పలు జిల్లాల్లో వరద ఉధృతి బీభత్సాన్ని సృష్టించింది. కాలనీలు పూర్తిగా వరద నీటితో నిండిపోగా, జనజీవనం స్తంభించిపోయింది.
ఎంతో మంది నిరాశ్రయులయ్యారు. సర్వస్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలారు. అధికారిక లెక్కల ప్రకారమే, 33 మంది ప్రాణాలు కోల్పోయారు. రూ. 5,438 వేల కోట్ల ఆస్తి నష్టం, 4.25 లక్షల ఎకరాల్లో పంట నష్టం సంభవించింది. ఇంకా లెక్కకు రాని మరణాలు ఆస్తి నష్టం, పంట నష్టం చాలా ఉంటుంది. ఇది అత్యంత బాధాకరం.
ఇది అందరి మనస్సులను కలిచివేసిన విషాదం. వరదలు వచ్చిన ప్రాంతాల్లో ఇప్పటికీ ఇంకా బురద నిండిన ఇళ్లు, ఇసుక మేటలు వేసిన పొలాలు, కొట్టుకుపోయిన రోడ్లు కనిపిస్తున్నాయి. ప్రాణాలు కోల్పోయిన విషాదాలు, బాధితుల విలాపాలే కనిపిస్తున్నాయి. ఎవరిని పలుకరించినా హృదయాన్ని కదిలించే కన్నీటి గాథలే వినిపిస్తున్నాయి. కడగండ్ల పాలైన తమకు ప్రభుత్వం వైపు నుంచి కనీస ఓదార్పు కూడా కరువైందని, ఆపద తమను సమయంలో ఆదుకోలేదనే ఆగ్రహం వరద బాధితుల్లో పెల్లుబుకుతున్నది.
ఇటువంటి విపత్కర పరిస్థితిలో అధికారంలో ఉన్న మీరు మరింత బాధ్యతగా వ్యవహరించాలి. పాలకులు అండగా ఉన్నారనే ధీమాను ప్రజలకు కల్పించాలి. కానీ, ఈ విషయంలో మీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైపోయిందని చెప్పడానికి చింతిస్తున్నాను.
వాతావరణ శాఖ ముందే హెచ్చరించినప్పటికీ విపత్తును ఎదుర్కొనే సన్నాహక చర్యలు తీసుకోవడంలో, ప్రజలను అప్రమత్తం చేయడంలో వైఫల్యం, ముంపు ప్రదేశాలను గుర్తించి ప్రజలను ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో వైఫల్యం, వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించడంలో వైఫల్యం, బాధితులను గుర్తించడంలో పైఫల్యం, ఓదార్చడంలో వైఫల్యం, సాయం అందించడంలో వైఫల్యం. మొత్తంగా విపత్తు నిర్వహణ, నష్టనివారణ చర్యలు తీసుకోవడంలో పూర్తిగా వైఫల్యం చెందారు.
ఇన్ని రోజుల తర్వాత కూడా వరద మిగిల్చిన బురదను తొలగించే ప్రక్రియ ఇంకా కొనసాగుతున్నదంటే మీ వైఫల్యాన్ని అంచనా వేయొచ్చు. అధికార పార్టీ నుంచి 9 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఖమ్మంలో వరదల్లో చిక్కుకున్న 9 మందిని కాపాడే నాయకుడే కరువయ్యాడు. చివరికి ఒక హెలికాప్టర్ కూడా దిక్కులేని దీన రాష్ట్రంగా తెలంగాణను మార్చారు. వరదలో చిక్కుకున్న వారిని కాపాడటంలో ఒక జేసీబీ డ్రైవర్ చేయగలిగిన పనిని యావత్ ప్రభుత్వ యంత్రాంగం చేయలేకపోయిందంటే ఇంతకు మించిన చేతకాని తనం ఉంటుందా? వరద తాకిడికి గురైన ప్రాంతాలను, కాలనీలను సంపూర్ణంగా పర్యటించడానికి మీకు ఓపిక లేక పోయింది.
విషాద పర్యటనలో సైతం చిరునవ్వులు చిందిస్తూ చేతులూపుతూ ప్రచార పర్యటన చేసిన విధానం చూసి ప్రజలు విస్తుపోయారని మీకు తెలియచేయడానికి చింతిస్తున్నాను. వరద బాధితులకు సహాయం చేయడంలో మీ ప్రభుత్వం అన్ని దశల్లో విఫలమైంది. ప్రజల విశ్వాసాన్ని కోల్పోయింది. ఇది కోతల ప్రభుత్వమే తప్ప చేతల ప్రభుత్వం కాదని ఈ సందర్భంగా తేలిపోయింది. అందుకే బాధితుల్లో ఎవరిని పలకరించినా మీ ప్రభుత్వంపై ఆక్రోశం, ఆగ్రహమే కనిపిస్తున్నాయి.
విపత్తు వేళ మీ నిర్లక్ష్యానికి తోడుగా, నష్టపరిహారం విషయంలో మీ అసమంజస వైఖరి ప్రజలను మరింత ఆగ్రహానికి, ఆవేదనకు గురి చేస్తున్నది. ముఖ్యమంత్రి గారు తక్షణ సాయం కింద ముందు పదివేల రూపాయల నష్టపరిహారం ఇస్తామన్నారు. ఆ తర్వాత నష్ట స్థాయిని బట్టి తగిన సాయం చేస్తామని చెప్పారు. మంత్రి పొంగులేటి గారు బాధిత కుటుంబాలకు ఇచ్చే సాయాన్నిమరో రూ. 6,500 కలిపి మొత్తం రూ. 16,500లకు పరిమితం చేశారు.
ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు కొట్టుకుపోయి, చెడిపోయి కట్టుబట్టలతో మిగిలిన వారికి రూ. 16,500 సహాయం ఏ మూలకు వస్తాయి. ఇండ్లు కూలిన పేద వారికి 18వేల సహాయం చేస్తే ఎలా సరిపోతాయి? ఒక్క ఖమ్మం జిల్లాలోనే 15,096 మంది వరద బాధితులకు రూ. 16,500 సహాయం అందించేటందుకు గుర్తిస్తే, రూ. 18 వేల సహాయం అందించేటందుకు కేవలం 146 మంది మాత్రమే గుర్తించడంలో మీ ఆంతర్యం ఏమిటి? రుణమాఫీలో లబ్ధిదారులను కుదించినట్లుగానే, వరద బాధితుల సంఖ్యను కూడా కుదించేందుకు మీరు ప్రయత్నాలు చేయడం సిగ్గుచేటు.
ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంకోటి ఉండదు. చిన్న చిన్న వ్యాపారస్తులు నిల్వ చేసుకున్న సరుకులు కూడా వరద పాలై పోయి పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయి, జీవితమే అగమ్యగోచరమైన స్థితిని ఎదుర్కొంటున్నారు. వారికి మీరిచ్చే కొద్దిపాటి సాయంతో ఉపశమనం కలగదు.
పంట మునిగిన వారికి ఒక్క రూపాయి విడుదల చేయలేదు. పంట నష్టం జరిగిన రైతన్నకు ఎకరాకు మీరిచ్చే పదివేల సాయం ఏ మూలకు సరిపోతుంది. రేవంత్ రెడ్డి గారూ.. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీ నోటితోనే పంట నష్టానికి ఆర్థిక సాయంగా ఎకరాకు 25వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
మరి ఇప్పుడు అధికారంలో మీరే ఉన్నరు. ఎందుకు నష్టపరిహారాన్ని పది వేలకు కుదించారు. వరద బాధితులకు చేసే సహాయం దగ్గర కూడా మీరు మాట మార్చడమేనా? ఇది మీ మోసపూరిత వైఖరి కాదా? నామమాత్రంగా సహాయం చేసి చేతులు దులుపుకుందామనుకుంటున్న మీ బాధ్యతారాహిత్యాన్ని చూసి వరద బాధితులు లబోదిబోమంటున్నారు.
వరద ప్రభావం తగ్గి 20 రోజులు గడిచినా ప్రభుత్వం ఇస్తానన్న పరిహారం అందక బాధితులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని కుటుంబాలకు సాయం అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. సర్వే సమయంలో ఇళ్ల వద్ద బాధితులు లేకపోవడం, బ్యాంకు ఖాతా పుస్తకాలు సమర్పించకపోవడం, ఇళ్లు మునిగిన ఫోటోలు లేకపోవడం, ఇతర సాంకేతిక అంశాలు కారణాలుగా చూపుతూ పరిహారం జమచేయకపోవడం దుర్మార్గమైన చర్య.
తమకు పరిహారం అందించాలని అధికారుల చట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా పట్టించుకోకపోవడం దారుణం. అద్దె ఇండ్లలో నివాసం ఉండి, వరద వల్ల నష్టపోయిన వారి వివరాలు నమోదు చేయకపోవడంతో వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వరద వల్ల నష్టపోయిన ప్రతి ఒక్కరికి సాయం అందేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది.
ఈ విపత్తు వేళనైనా బాధ్యతగా వ్యవహరించండి. మిమ్మల్ని నమ్మి ఓటేసి అధికారంలోకి తెచ్చిన ప్రజల పట్ల జవాబుదారీతనంతో వ్యవహరించండి. బాధితులకు నిజమైన ఉపశమనం కలిగే విధంగా చర్యలు తీసుకోండి. వారు కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి వీలుగా సరిపోయే సహాయాన్ని చేయండి. మీడియా మేనేజ్మెంట్ విడనాడి డిజాస్టర్ మేనేజ్మెంట్ మీద దృష్టి కేంద్రీకరించండి.
మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షలకు తగ్గకుండా సహాయం చేయాలని, ఇండ్లు కూలిపోయి ఇంట్లో సామాన్లు నష్టపోయిన వారికి 2 లక్షల సహాయం అందించాలని, పూర్తిగా ఇళ్లు కొట్టుకుపోయిన వారికి రూ. 10 లక్షల సహాయం, పంట నష్టం కింద ఎకరాకు మీరు గతంలో డిమాండ్ చేసినట్లుగానే రూ. 25 వేల రూపాయల సహాయం అందించాలని, పశువులు నష్టపోయిన వారికి లక్షకు తగ్గకుండా సహాయం చేయాలని, చిన్న వ్యాపారస్తులకు 5లక్షల నష్టపరిహారంతో పాటు వడ్డీ లేకుండా రుణాలు అందించాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం.
ఇట్లు
తన్నీరు హరీశ్ రావు,
మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే
- Revanth & Co’s frequent foreign trips: A drain on Telangana’s exchequer
- KTR accuses Congress govt. of implementing ‘bulldozer culture’ in Telangana
- Why did cost of Musi Beautification Project soar to Rs. 1.5 lakh cr?
- Fearing backlash, saree distribution to women’s groups in 6 districts halted
- Will HYDRAA demolish these 11 major projects?
- కొండా సురేఖపై పరువు నష్టం కేసు వేసిన కేటీఆర్
- భారత వ్యాపార ముఖచిత్రాన్ని మార్చేసిన రతన్ టాటా ఎందరికో ప్రేరణ: కేటీఆర్
- ఆర్థిక ప్రగతికి మానవత్వాన్ని అద్దిన అరుదైన పారిశ్రామికవేత్త రతన్ టాటా: కేసీఆర్
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్
- డబ్బు సంచులతో పట్టుబడ్డ రేవంత్ ఉపాధ్యాయులకు నీతి వచనాలు చెబుతున్నాడు: హరీష్ రావు
- యూపీలో లాగా తెలంగాణలో రేవంత్ బుల్డోజర్ సంస్కృతిని తీసుకొచ్చాడు: కేటీఆర్
- ఏడు గ్యారెంటీల కాంగ్రెస్ గారడీని హర్యానా ప్రజలు తిరస్కరించారు: కేటీఆర్
- 10 లక్షల మంది గురుకుల విద్యార్థులతో ప్రభుత్వం ఆడుకుంటోంది: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
- కాంగ్రెస్ గ్యారెంటీల మోసం నుండి తప్పించుకున్న హర్యానా!
- సోషల్ మీడియాను చూసి భయపడుతున్న రేవంత్ రెడ్డికి కేసీఆర్ కావాలా?: జగదీశ్ రెడ్డి