వినియోగదారుడికి సకల సౌకర్యాలతో అన్ని వస్తువులు ఒకేచోట దొరికే విధంగా సమీకృత వ్యవసాయ మార్కెట్ ను సిద్ధిపేట పట్టణంలో ఈరోజు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ప్రారంభించారు. సిద్దిపేట పట్టణంలోని కరీంనగర్ రోడ్డులోని పాత వ్యవసాయ మార్కెట్ ప్రాంగణంలో ఈ మార్కెట్ ను నిర్మించారు. ఈ మార్కెట్ తెలంగాణలోనే తొలి ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్. దీనిని రూ. 20 కోట్లతో 6.10 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. కూరగాయలు, పాలు, పండ్లు, మాంసం, చేపలు, నిత్యావసర వస్తువులు అన్నీ ఒకేచోట అందుబాటులోకి వచ్చాయి.
మార్కెట్ ప్రాంగణంలో పార్కింగ్ ఇబ్బంది లేకుండా రెండుచోట్ల పార్కింగ్ కోసం ప్రత్యేక స్థలాన్ని కేటాయించారు. మార్కెట్ ప్రాంగణం ముందు భాగాన్ని కార్పొరేట్ కార్యాలయాల తరహాలో అత్యంత ఆధునికంగా నిర్మించారు. మార్కెట్ లో రెండు మంచినీటి ప్లాంట్లను నిర్మించారు. పచ్చదనం ఉట్టిపడేలా మొక్కలు నాటారు. అంతేకాకుండా రైతులు, వ్యాపారులు, వినియోగదారుల కోసం రెస్టారెంట్ తో పాటు శుభకార్యాలు, మార్కెట్, వ్యాపారుల సమావేశాలకు బాంక్వెట్ హాల్ కూడా ఏర్పాటు చేశారు.