mt_logo

సర్పంచులు గ్రామవికాసాలకు పాటుపడాలి..

గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతాయని, గ్రామాలు వేదికగానే ప్రగతి ప్రణాళికలు అమలుచేయాలని ముఖ్యమంత్రి శ్రీ కే చంద్రశేఖర్ రావు అన్నారు. కొత్తగా ఎన్నికైన సర్పంచ్ లు, కార్యదర్శులకు శిక్షణ ఇచ్చే రిసోర్స్ పర్సన్స్ తో సీఎం కేసీఆర్ బుధవారం ప్రగతి భవన్ లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ కొత్తగా ఎన్నికైన సర్పంచులు, వార్డు సభ్యులు ప్రజలను కలుపుకొని గ్రామవికాసానికి పాటుపడాలని, గ్రామ పంచాయితీలకు అవసరమైన అన్ని నిధులు కేటాయిస్తామని చెప్పారు. మంచినీటి సరఫరా, విద్యుత్ సరఫరా, రహదారుల నిర్మాణం వంటి ముఖ్యమైన పనులన్నీ ప్రభుత్వమే నేరుగా పనిచేస్తున్నదని, గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత పాటించడం, వైకుంఠధామాల నిర్మాణంపై పంచాయితీలు ఎక్కువ దృష్టి పెట్టాలని కేసీఆర్ సూచించారు.

ప్రజాప్రతినిధులు తాము ప్రజాసేవకులమనే విషయాన్ని మరవొద్దని, చట్టసభల్లో అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ అనే పదాలు పోవాలన్నారు. గ్రామాల్లో కూడా అధికారం అనే మాట రావొద్దు. పదవి సేవ కోసం.. అధికారం కోసం కాదు అని ప్రజాప్రతినిధులు భావించాలని సీఎం సూచించారు. గ్రామానికో నర్సరీ ఉండాలని, ప్రతి ఇంటికి ఆరు మొక్కలు ఇవ్వాలన్నారు. గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ కట్టుదిట్టంగా జరగాలి. రోడ్డుపై చెత్త వేస్తే రూ.500 జరిమానా విధించాలి. గ్రామంలో నూటికి నూరుశాతం పన్నులు వసూలు చేయాలి. సర్పంచులు గ్రామంలోనే నివాసం ఉండి ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకోవాలని చెప్పారు.

పంచాయితీలకు కావాల్సిన నిధులిస్తాం.. బాధ్యతలూ అప్పగిస్తాం.. అన్నీఇచ్చినా పనిచేయని పంచాయితీల విషయంలో కఠినంగా ఉంటాం. ప్రభుత్వ నిధులు ఎట్లా ఖర్చు పెడుతున్నారో తెలుసుకోవడానికి 25 ఆకస్మిక తనిఖీ బృందాలు ఏర్పాటుచేస్తాం. ఒక బృందంలో నేనూ ఉంటా. ఎవరు ఎక్కడికి పోతున్నారో తెలీకుండా తనిఖీలు ఉంటాయి. ఎక్కడ తేడా వచ్చినా సర్పంచ్, గ్రామకార్యదర్శులను సస్పెండ్ చేస్తామని సీఎం హెచ్చరించారు. వీధి దీపాలు, ఇతరత్రా అవసరాలకు వాడే కరెంట్ బిల్లులు స్థానిక సంస్థలు సరిగా చెల్లించడం లేదని, ఇకపై ఎప్పటికప్పుడు కరెంట్ బిల్లులు చెల్లించాలన్నారు.

ఇదిలావుండగా కూసం రాజమౌళి అనే మాజీ సర్పంచ్ కృషి కారణంగా వరంగల్ జిల్లా గంగదేవిపల్లి ప్రపంచానికే ఆదర్శ గ్రామంగా ఎట్లా తయారయిందో ముఖ్యమంత్రి వివరించారు. రిసోర్స్ పర్సన్లలో రాజమౌళి కూడా ఉండడంతో ఆయనను సీఎం వేదికపైకి పిలిపించి సీనియర్ అధికారులు, ఎమ్మెల్యేల పక్కన కూర్చోపెట్టి గౌరవించారు. నిజామాబాద్ జిల్లా అంకాపూర్ గ్రామాన్ని కూడా రోల్ మోడల్ గా తీసుకోవాలని, ముఖ్యంగా మహిళా సాధికారతకు ఈ గ్రామం ఒక ఉదాహరణ అని చెప్పారు. ఒక్క దోమ కూడా లేకుండా పరిసరాలను ఎలా కాపాడుకోవచ్చో హైదరాబాద్ నగర శివారు ప్రగతి రిసార్ట్స్ చేసి చూపించిందని, రిసోర్స్ పర్సన్లంతా తమ శిక్షణా సమయంలో గంగదేవిపల్లి, అంకాపూర్, ప్రగతి రిసార్ట్స్ ను సందర్శించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *