mt_logo

రాజధానిలో ప్రెస్ మీట్లు కాదు.. గ్రామాల్లో కొచ్చి చూడండి-హరీష్ రావు

హైదరాబాద్ లో కూర్చుని ప్రెస్ మీట్లు పెట్టి నోటికొచ్చింది మాట్లాడటం కాదు, గ్రామాలకు వెళ్లి చూడాలని, తెలంగాణకు సాగునీరు రాకపోవడానికి, వ్యవసాయం నాశనం కావడానికి ముఖ్య కారణం కాంగ్రెస్ పార్టీ పాలనే అని భారీ నీటిపారుదల శాఖామంత్రి హరీష్ రావు గురువారం నాడు కాంగ్రెస్ నాయకులపై మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులు ఆంధ్రా పాలకుల పల్లకీలు మోసి తెలంగాణ ప్రజలను పాడెలెక్కించారని, చేసిన వాగ్ధానాలు నిలుపుకున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీకి లేదని, తాము అన్ని వాగ్దానాలను అమలు చేసుకుంటూ పోతున్నామని మంత్రి చెప్పారు.

వరంగల్ ఉప ఎన్నికల్లో ఓడిపోతే రాజీనామాకు సిద్ధమా? అని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి హరీష్ రావు సవాల్ విసిరారు. వంద ఎలుకలు తిన్న పిల్లి దొంగ జపం చేసినట్లుగా కాంగ్రెస్ నేతలు శ్రీరంగ నీతులు చెప్తున్నారన్నారు. 48 ఏళ్ళు పాలించిన కాంగ్రెస్ పార్టీయే తెలంగాణ వెనుకబాటుతనానికి, వ్యవసాయం దెబ్బ తినడానికి, యువకులు నిరుద్యోగులుగా మిగిలి పోవడానికి కారణమని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 500 రోజులే అయ్యిందని, అంతలోనే ఏం చేశారని నంగనాచి ప్రశ్నలు వేస్తున్నారని హరీష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వను అని కిరణ్ కుమార్ రెడ్డి అంటే మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి నోరెత్తలేదని, ఆరు దశాబ్దాలుగా తెలంగాణ నాయకులంతా నోరు మూసుకోబట్టే, ఎంగిలి మెతుకులకు ఆశ పడబట్టే రాష్ట్రం ఈరోజు ఇంత దీనస్థితిలో ఉందని అన్నారు.

ఎన్నికల ముందు అద్భుతాలు చేస్తామని చెప్పి ఆ తర్వాత మాటమార్చడం టీఆర్ఎస్ పార్టీ చరిత్రలో లేదని, ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా మళ్ళీ ఎన్నికలప్పుడు ఓట్లు అడగం అని సీఎం కేసీఆర్ ధైర్యంగా ప్రకటించారని హరీష్ రావు గుర్తు చేశారు. తాము చేసింది ఏమిటో ప్రజలు చూస్తున్నారని, కాంగ్రెస్ నాయకులు చెప్పేది కూడా ప్రజలు వింటున్నారని, వారే సరైన తీర్పు ఇస్తారని మంత్రి స్పష్టం చేశారు. సంక్షోభంలో ఉన్న ఆర్టీసీ, విద్యుత్ రంగాలను గట్టెక్కించిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిది.. ఏ డిపో ఆర్టీసీ కార్మికుడినైనా పోయి అడగండి.. కేసీఆర్ ఏం చేశారో, టీఆర్ఎస్ పాలన వల్ల ఏం జరిగిందో చెప్తారని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణికి మేము చేయూతనివ్వడం వల్లే బాగుపడ్డది.. కార్మికులు బాగు పడ్డారు. ఏ బొగ్గుగనికి వెళ్లి అడిగినా 500 రోజుల పాలనలో టీఆర్ఎస్ ఏం చేసిందో ప్రతి కార్మికుడు చెప్తాడని హరీష్ పేర్కొన్నారు.

కాంగ్రెస్ పాలనలో ఒక్క చెరువునైనా బాగుచేశారా? ఈరోజు మేం పూడిక తీసిన చెరువుల్లో నిండిన నీళ్ళను చూస్తే తెలుస్తుంది టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో అని అన్నారు. కాంగ్రెస్ హయాంలో హాస్టల్ విద్యార్థులకు గ్రాముల లెక్కన భోజనం పెట్టేవారని హరీష్ గుర్తు చేశారు. దొడ్డు బియ్యం, పురుగుల అన్నం తినలేక బాధపడే హాస్టల్ విద్యార్థులకు కనీసం మంచి భోజనం అయినా పెట్టాలనే ఆలోచన మీ బుర్రలకు తట్టిందా? గ్రాముల లెక్కన కొలిచి అన్నం పెట్టిన కక్కుర్తి మీది. కానీ మేము ప్రతి విద్యార్థికి కడుపునిండా అన్నం పెడుతున్నాం.. ఏ హాస్టల్ కైనా పోయి అడగండి.. టీఆర్ఎస్ పాలనలో ఏం జరిగిందో చెప్తారన్నారు. మీ పాలనలో ప్రజా సంక్షేమానికి కేవలం రూ. 13 వేల కోట్లు ఖర్చు చేస్తే, మేం రూ. 34 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. ఇదొక్క ఉదాహరణ చాలు.. మీరేంటో, మేమేంటో అని హరీష్ రావు స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *