ఖమ్మం రూరల్ మండలం పల్లెగూడెం వద్ద వంతెన నిర్మాణానికి భారీ నీటిపారుదల శాఖామంత్రి హరీష్ రావు రోడ్లు భవనాల శాఖామంత్రి తుమ్మలతో కలిసి మంగళవారం శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో హరీష్ మాట్లాడుతూ, మంత్రిగా ప్రమాణస్వీకారం చేయించిన గవర్నర్ పైనే టీడీపీ నేతలు విమర్శలు చేయడం సిగ్గుచేటని, ఉన్నది ఉన్నట్లు చెప్తే గవర్నర్ తప్పు మాట్లాడినట్లుగా ప్రచారం చేయడం వారికే చెల్లిందని అన్నారు. దొంగబాబు చంద్రబాబుకు, శిష్యుడు రేవంత్ కు శిక్ష తప్పదని, ఈ వ్యవహారంలో చాలామంది చరిత్ర బయటపడనుందని హరీష్ రావు పేర్కొన్నారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబే నేరుగా బేరసారాలకు దిగి నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ తో ఫోన్లో మాట్లాడినట్లు ఏసీబీ, ఐబీ, నిఘా వర్గాలు స్పష్టం చేశాయని అన్నారు.
పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని నిర్మించి హైదరాబాద్ ప్రజలకు తాగునీరు ఇస్తామంటే చంద్రబాబు, జగన్ అడ్డుపడి కేంద్రానికి ఫిర్యాదు చేస్తున్నారని హరీష్ మండిపడ్డారు. జగన్ తండ్రి మాజీ సీఎం వైఎస్ హయాంలోనే పాలమూరు ఎత్తిపోతల పథకానికి జీవో వచ్చిందని, తండ్రి ఆశయాలను నెరవేర్చడం మీకు ఇష్టం లేదా అని జగన్ ను ప్రశ్నించారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ పథకాన్ని పూర్తిచేసి తాగు, సాగునీరు ప్రజలకు అందిస్తామని హరీష్ తేల్చిచెప్పారు. సాగర్ కాల్వల ఆధునీకరణకు రూ.590 కోట్లు కేటాయిస్తే ఇప్పటివరకు కేవలం రూ.330 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారని, ఎనిమిదేళ్లుగా పనులు సాగుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. పనులు వేగంగా పూర్తిచేసి జిల్లాకు రెండో పంటకు పుష్కలంగా నీరు అందించేందుకు కృషి చేస్తామని, ఖమ్మం జిల్లాలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని హరీష్ రావు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రాంరెడ్డి వెంకటరెడ్డి, కోరం కనకయ్య, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.