mt_logo

పార్సిగుట్టను సందర్శించిన సీఎం కేసీఆర్

స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు పార్సిగుట్టలో ఏర్పాటు చేసిన ఒక సమావేశంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు పాల్గొన్నారు. మధురానగర్ రాఘవ గార్డెన్ లో జరిగిన ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ తో పాటు మంత్రి పద్మారావు, జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, హైదరాబాద్ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుకునేందుకు నగరవాసులందరూ కృషి చేయాలని, నగరంలో నిర్మాణాలు క్రమపద్దతిలో జరగాలని సూచించారు.

స్వచ్ఛ హైదరాబాద్ బృందాలను దేశంలోని ఢిల్లీ, నాగపూర్ లను పరిశీలించేందుకు పంపానని, నాగపూర్ లో చెత్తనుండి విద్యుత్ ఉత్పత్తి చేయడంపై రాష్ట్ర బృందం అధ్యయనం చేసిందని సీఎం పేర్కొన్నారు. నాగపూర్ లో గతంలో వెయ్యి చెత్త కుండీలు ఉండేవని, ప్రస్తుతం వాటి సంఖ్య వందకు చేరిందని తెలిపారు. సుందర నగరంగా నాగపూర్ మారిందని, మనం కూడా చెత్త కుండీలు లేని నగరంగా హైదరాబాద్ ను మార్చుకోవచ్చని కేసీఆర్ చెప్పారు. మహిళలు ఇందుకు పూనుకుంటే తప్పకుండా సాధ్యమవుతుందని, పదిహేను రోజుల్లో జీహెచ్ఎంసీ అధికారులు రెండు చెత్త బుట్టలు సరఫరా చేస్తారని, వాటిలో ఒక దాంట్లో తడి చెత్త, మరో దాంట్లో పొడి చెత్త వేసి మున్సిపల్ సిబ్బందికి అందజేయాలని కోరారు. ఇన్నేళ్ళు ఉన్న దరిద్రం ఒక్కసారిగా పోదని, మనమంతా కృషి చేస్తే త్వరలోనే నగరం పరిశుభ్రంగా మారుతుందని సీఎం తెలిపారు.

ఇటీవల ఐదు రోజులపాటు స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహించామని, ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నామని సీఎం అన్నారు. నగరంలో వందల సంఖ్యలో నాలాలు ఉన్నాయని, నాలాలపై పేదలు ఇళ్లు కట్టుకుని అపరిశుభ్ర వాతావరణంలో జీవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వీరికోసం ప్రభుత్వమే పక్కా ఇళ్ళు కట్టించి ఇస్తుందని, ఇందుకోసం చిలకలగూడలో ఉన్న రైల్వే భూముల్లో పది ఎకరాలు తీసుకోవాలని నిర్ణయించామని, దీనిపై రైల్వే శాఖతో చర్చిస్తామని కేసీఆర్ చెప్పారు. ప్రతినెలా తాను ఇక్కడికి వస్తానని, ప్రతినెల 17న స్వచ్ఛ కమిటీ సమావేశం కావాలని సీఎం అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *