mt_logo

డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్టుపై మంత్రి కేటీఆర్ సమీక్ష..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తాగునీటి సరఫరా ప్రాజెక్టుపై పంచాయితీ రాజ్ శాఖామంత్రి కేటీఆర్ మంగళవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని, పనులు పూర్తయిన చోట ప్రజలకు నీళ్ళు అందించే ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం జరుగుతున్న ఇన్ టేక్ వెల్స్ నిర్మాణ పనులపై సైట్ల వారీగా మంత్రి అధికారులతో సమీక్ష జరిపారు. దాదాపు అన్ని ఇన్ టేక్ వెల్స్ పూర్తయ్యే స్టేజికి వచ్చాయని అధికారులు వివరించారు. దీనిపై స్పందించిన మంత్రి మాట్లాడుతూ, ఇన్ టేక్ వెల్స్ నిర్మాణ పనులు వేగంగా జరిగితే మొత్తం ప్రాజెక్టును నిర్ధిష్ట సమయంలో పూర్తి చేయవచ్చని అన్నారు.

పైపు లైన్ల నిర్మాణంతో పాటు ఇంటింటికి ఇంటర్నెట్ సౌకర్యం కల్పించేందుకు వేయనున్న ఫైబర్ ఆప్టిక్ కేబుల్ వేసే అంశంపై ఐటీ శాఖతో ఒకట్రెండు రోజుల్లో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. ఫ్లోరైడ్ బాధిత ప్రాంతాలైన నల్గొండ, కరువుపీడిత మహబూబ్ నగర్ జిల్లాలకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని, ఈ జిల్లాల్లో నీటి వనరులకు దగ్గరలో ఉన్న ప్రాంతాల్లో పైపులైన్లు పూర్తయిన వెంటనే నీళ్ళందించాలని కేటీఆర్ అధికారులను ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *