mt_logo

రేవంత్ లాగే రఘునందన్‌వి మాటలే.. చేతలు లేవు: నర్సాపూర్‌లో హరీష్ రావు

నర్సాపూర్‌లో నిర్వహించిన మెదక్ పార్లమెంట్ బీఆర్ఎస్ సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు, ఎంపీ అభ్యర్థి వెంకట్రామి రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. మీ పట్టుదలకు నా హ్యాట్సాఫ్.. కేసీఆర్ గారంటే మీకు ఎంతో ప్రేమ. ఉద్యమం సమయంలో మీరు ఎంతో తెగువ చూపారు. అందుకే ప్రత్యేకంగా నిధులు ఇచ్చారు.. డిపో ఇచ్చారు, మంజీరా మీద చెక్ డ్యాంలు నిర్మించారు. గత ప్రభుత్వాలు ఇక్కడి ప్రాంతానికి మొండి చెయ్యి చూపారు అని పేర్కొన్నారు.

తెలంగాణ రాకుంటే, కేసీఆర్ సీఎం కాకుంటే మండుటెండల్లో చెక్ డ్యాముల్లో నీళ్ళు దుంకేవి కాదు. ఇచ్చినవి నెరవేర్చారు, ఇవ్వని హామీలు నెరవేర్చారు. కళ్యాణ లక్ష్మి ఇచ్చారు, న్యూట్రిషన్ కిట్ ఇచ్చారు, రైతు బంధు, బీమా ఇలా అనేకం ఇచ్చారు.. కాంగ్రెస్ మాత్రం ఓడ దాటేదాక ఓడ మల్లన్న, ఓడ దాటినంక ఓడ మల్లన్న అని అన్నారు.

బాండ్ పేపర్ మీద రాశిచ్చి మాట తప్పారు. ఆరు గ్యారెంటీలకు చరమ గీతం పాడారు..రుణమాఫీ అన్నారు చెయ్యలేదు.. పంటకు 500 బోనస్ అన్నారు… పంట కోతకు వచ్చినా రైతు బంధు రాలేదు.. రూ. 4000 పింఛన్లు ఇవ్వలేదు, మహాలక్ష్మి రూ. 2,500 ఇవ్వలేదు. మా అక్కా చెల్లెళ్ళు చీపుళ్ళు పట్టుకొని తరుముతారు అని దుయ్యబట్టారు.

కళ్యాణ లక్ష్మి ఇవ్వడం లేదు.  ఇస్తామన్న తులం బంగారం ఎగబెట్టారు. అధికారంలోకి వచ్చాక.. అయ్యాక పెళ్లిళ్లకు లక్షతో పాటు తులం బంగారం ఇవ్వాలి.. స్కూటీలు ఇస్తా అని మాట తప్పారు.. కాంగ్రెస్ వచ్చింది, కేసీఆర్ కిట్ బంద్ అయ్యింది.. కరెంట్ కోతలు స్టార్ట్ అయ్యాయి.. చెయ్యారాకనా రైతుల మీద కక్షనా.. మాటలు ఎక్కువ చేతలు తక్కువ అని విమర్శించారు.

అన్ని వర్గాల ప్రజలను రేవంత్ రెడ్డి మోసం చేసిండు. అందుకే కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో సురుకు పెట్టాలి.. మీ అందరి తరుపున అసెంబ్లీలో నిలదీసే హక్కు నాకు వస్తుంది. కాంగ్రెస్ మెడలు వంచాలంటే వెంకట్రామ రెడ్డిని గెలిపించాలని కోరుతున్నా అని తెలిపారు.

హామీలు నెరవేర్చేందుకు కాంగ్రెస్ పార్టీ మీద చీటింగ్ కేసు పెట్టాలి. బాకీ పడ్డ హామీలు అమలు చేశాకే ప్రజల మధ్యకు రావాలి. అప్పుడే ఓట్లు అడగాలని నేను కోరుతున్నా.  నిరుద్యోగ భృతి విషయానికి వస్తే అది కూడా మాట తప్పారు అని హరీష్ అన్నారు.

తుపాకీ ఎక్కుపెట్టిన రైఫిల్ రెడ్డి రేవంత్ రెడ్డి.. సీఎం అయ్యాక ఒక్కనాడు జై తెలంగాణ అనలేదు. అమరులకు ఒక్కనాడు దండం పెట్టలేదు. రఘునందన్ రేవంత్ రెడ్డి లాగే మాటలు చెప్పాడు, చేతలు లేవు. మోసం చేసిన ఆయన్ను దుబ్బాక ప్రజలు మడత పెట్టి ఉతికారు అని ధ్వజమెత్తారు.

బీజేపీ, కాంగ్రెస్ ఏది అయినా వాళ్లకు పదవులు ముఖ్యం.. మనకు తెలంగాణ ముఖ్యం. బీజేపీ, కాంగ్రెస్ తెలంగాణ గొంతు పిస్కుతాయి
భారీ మెజారిటీతో వెంకట్రామ రెడ్డి గారిని గెలిపించాలి. కలెక్టర్‌గా ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు..ఎంపీగా తప్పకుండా సేవా కార్యక్రమాలు చేస్తరు. అటెండర్ ఆరోగ్యం కోసం తిరుపతికి మొక్కి తలనీలాలు సమర్పించిన వ్యక్తి అని ప్రశంసించారు.

మెదక్ బీఆర్ఎస్‌కు కంచుకోట.. ఎవరు అధైర్యపడద్దు.. ఏ కార్యకర్తకు ఇబ్బంది వచ్చినా తోడు ఉంటాం. ఉద్యమాల్లో పుట్టింది బీఆర్ఎస్.. కలిసి పని చేద్దాం ఆని పిలుపునిచ్చారు.