mt_logo

రాహుల్ గాంధీపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్

కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ పైన కేంద్ర ఎన్నికల సంఘానికి భారత రాష్ట్ర సమితి ఫిర్యాదు చేసింది. రాహుల్ గాంధీ తన తాజా పర్యటనలో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి పంపిన ఫిర్యాదు లేఖలో పేర్కొంది. మొన్న జరిగిన తుక్కుగూడ సభలో రాహుల్ గాంధీ ఎలాంటి సాక్ష్యాదారాలు లేకుండా దురుద్దేశం పూర్వకంగా టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ తమ పార్టీపై చేసిన వ్యాఖ్యలను ముఖ్యంగా, పార్టీ అధ్యక్షులు కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యల విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది.

ఎన్నికల నియమావళి ప్రకారం ఇతర పార్టీల విధానాలపైన మాత్రమే మాట్లాడాలి గానీ, వ్యక్తిగతం ప్రతిష్టకు బంధం కలిగించేలా, అడ్డగోలుగా మాట్లాడకూడరాదని స్పష్టమైన నిబంధనలు ఎన్నికల నియమావళిలో  ఉన్నాయని, అయినప్పటికీ రాహుల్ గాంధీ అబద్ధాలను, అసత్యాలను మాట్లాడుతూ తన ప్రసంగం కొనసాగించారని పేర్కొంది.

ఎలాంటి ఆధారాలు లేకుండానే కేసీఆర్ ప్రస్తావనను టెలిఫోన్ ట్యాపింగ్ అంశంతో ముడిపేడుతూ అప్పటి రాష్ట్ర ప్రభుత్వ పోలీస్ మరియు ఇంటిలిజెన్సు వర్గాలను దుర్వినియోగం చేశారని, ఈ ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని, అక్రమమని కేంద్ర ఎన్నికల సంఘానికి పంపిన లేఖలో పార్టీ పేర్కొంది. పోలీస్ వ్యవస్థను దుర్వినియోగం చేసి, వేలాది మంది ఫోన్లను ట్యాప్ చేశారని, ఫోన్ టాపింగ్ ద్వారా ఆర్థిక ప్రయోజనాలు పొందారని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని, వీటి పైన వెంటనే చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ పార్టీ కోరింది. ఈ మేరకు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల తాలూకు వీడియోలను తన ఫిర్యాదుకు జతపరిచింది.

తమ పార్టీ అధినేత కేసీఆర్‌కి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో ఎలాంటి సంబంధం లేదని, ప్రస్తుతం విచారణ జరుగుతున్న అంశంపైన రాహుల్ గాంధీ మాట్లాడడం చట్ట వ్యతిరేకం అన్నారు. కేవలం తమ పార్టీని బద్నాం చేయాలన్న దురుద్దేశపూర్వక ఆలోచనతోనే రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారని, రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు ఓట్లను ప్రభావితం చేసేలా ఉన్నాయని బీఆర్ఎస్ పార్టీ తెలిపింది.

ఈ వ్యాఖ్యలకు ఆధారాలు చూపించాలని కోరుతూ.. రాహుల్ గాంధీకి చేసిన వ్యాఖ్యలపైన వెంటనే విచారణ చేపట్టాలని ఈసికి విజ్ఞప్తి చేసింది. ఎన్నికల నియమావళిని కావాలని ఉల్లంఘించిన రాహుల్‌ని పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారం చేయకుండా చర్యలు తీసుకోవాలని కోరింది. తక్షణమే రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ పార్టీ పైన కూడా తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు రాష్ట్ర పార్టీ నాయకులు కర్నె ప్రభాకర్, దాసోజు శ్రవణ్‌లు పార్టీ తరఫున కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.

ఇదే ఫోన్ ట్యాపింగ్ అంశంలో అడ్డగోలుగా మాట్లాడిన మంత్రి కొండ సురేఖపైన కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి మరొక ఫిర్యాదును బీఆర్ఎస్ పార్టీ పంపింది. ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించినందుకు మంత్రి పైన చర్యలు తీసుకోవాలని కోరింది.