mt_logo

విద్యుత్ సౌధ వద్ద హరీశ్ అరెస్ట్. పరిస్థితి ఉద్రిక్తం

రెండు రోజుల క్రితం విద్యుత్ సౌధలో సీమాంధ్ర ఉద్యోగస్తుల చేతిలో దాడికి గురైన సంతోశ్ కుమార్ అనే తెలంగాణ ఉద్యోగిని పరామర్శించడానికి పోయిన తెరాస నేత హరీశ్ రావును పోలీసులు అడ్డుకుని, అరెస్ట్ చేశారు.

ఈ చర్యను తీవ్రంగా ఖండించిన హరీశ్ రావు తెలంగాణలో ఒక చట్టం, సీమాంధ్రలో ఒక చట్టం నడుస్తున్నదా అని ఆగ్రహంగా ప్రశించారు.

ముఖ్యమంత్రి కిరణ్, డీజీపీ దినేశ్ లు ఇద్దరి నేతృత్వంలోనే సీమాంధ్రలో ఉద్యమం జరుగుతున్నదని హరీశ్ అన్నారు. సీమాంధ్రలో వరుసబెట్టి తెలంగాణ ప్రాంతవాసులపై దాడులు చేస్తున్నారని, చివరికి మా హైదరాబాద్ గడ్డ మీద కూడా దాడులకు తెగబడుతున్న సీమాంధ్రులు ఉల్టా వారికే రక్షణ లేదని అనడం దారుణమని అన్నారు.

సంతోశ్ కుమార్ మీద దాడి చేసిన దృశ్యాలు సి.సి టీవీ లో రికార్డు అయి ఉన్నా కూడా పోలీసులు నిందితులను పట్టుకోకుండా వారి కొమ్ముకాస్తున్నారని హరీశ్ నిప్పులు చెరిగారు.

సీమాంధ్రలో అన్నిరకాల ఆందోళనకు స్వేచ్చ ఇచ్చిన సీమాంధ్ర ప్రభుత్వం, దాడికి గురైన ఉద్యోగిని పరామర్శించడానికి వచ్చిన తనను, కొప్పుల ఈశ్వర్ ను అరెస్టు చేయడం ఏమిటని ఆయన ప్రశించాదు.

ఈ సందర్భంగా సీమాంధ్ర, తెలంగాణ ఉద్యోగులు పోటాపోటీ నినాదాలు చేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *