తెలంగాణలో ఇతర రాష్ట్రాల వారికి ఎలాంటి భంగం వాటిల్లలేదని, సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రజలు సుఖసంతోషాలతో జీవిస్తున్నారని గ్రేటర్ రాయలసీమ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ(గ్రాట్) వ్యవస్థాపక అధ్యక్షుడు, రిటైర్డ్ హైకోర్టు జస్టిస్ పీ లక్ష్మణ్ రెడ్డి స్పష్టం చేశారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా బుక్కైన ఏపీ సీఎం చంద్రబాబు సెక్షన్-8 పేరుతో తెలుగు ప్రజల మధ్య కిరికిరి పెట్టేందుకు చేస్తున్న ప్రయత్నాన్ని విరమించుకోవాలని సూచించారు. ఆదివారం గ్రాట్ ఆధ్వర్యంలో ‘మేము సురక్షితం’ అంటూ రూపొందించిన బ్రోచర్ ను గ్రాట్ అధ్యక్షుడు, విశ్రాంత ఐజీ హనుమంత రెడ్డి, ఉపాధ్యక్షులు కే జగన్మోహన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణ, కార్యనిర్వాహక అధ్యక్షుడు ఓబుల్ రెడ్డిలతో కలిసి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలో ఓటుకు నోటు సంస్కృతిని ఏపీ నేతలే పరిచయం చేశారని, అడ్డంగా దొరికిన ఏపీ సీఎం ఆ మరకలు చెరిపేసుకునేందుకు అమాయక ప్రజల మధ్య సెక్షన్-8 పేరుతో విద్వేషాలను రెచ్చగొట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.