ప్రొఫెసర్ జయశంకర్ సార్ 4వ వర్ధంతి సందర్భంగా తెలంగాణ భవన్ లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ ఉద్యమ భావజాల వ్యాప్తికి కృషిచేసిన ప్రొ. జయశంకర్ ను యావత్ తెలంగాణ జాతి కలకాలం గుర్తుంచుకుంటుందని సీఎం అన్నారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే కలిగే లాభాలను కూడా ప్రొఫెసర్ జయశంకర్ విడమరిచి చెప్పారన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక జరుగుతున్న అభివృద్ధి ఆయన ఆత్మకు శాంతి చేకూరుస్తుందని, జయశంకర్ స్ఫూర్తితో పనిచేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని సీఎం పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ తో పాటు టీఆర్ఎస్ సెక్రెటరీ జనరల్, ఎంపీ కేకే, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, కేటీఆర్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, మహేందర్ రెడ్డి, జోగురామన్న, లక్ష్మారెడ్డి, ఎంపీ వినోద్, ఎమ్మెల్యేలు రసమయి, గొంగిడి సునీత, ఎమ్మెల్సీలు కర్నెప్రభాకర్, ప్రొ. శ్రీనివాస్ రెడ్డి, వీ ప్రకాష్ తదితరులు హాజరై నివాళులర్పించారు.
ఐటీ, పంచాయితీ రాజ్ శాఖామంత్రి కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసే జిల్లాల్లో వరంగల్ పరిధిలోని కొత్త జిల్లాకు ప్రొఫెసర్ జయశంకర్ సార్ పేరు పెడతామని సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారని అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలనే ఆశయం కోసం జీవితాంతం పరితపించిన వ్యక్తి జయశంకర్ అని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన సంవత్సర కాలంలో ఎప్పుడు, ఏ శుభ సందర్భం వచ్చినా ఖచ్చితంగా ఆయనను స్మరించుకుంటున్నామన్నారు. వ్యవసాయ విశ్వవిద్యాలయానికి సార్ పేరు కూడా పెట్టామని, ఆయన బతికున్నంత కాలం ఎప్పుడూ ఏదైనా శాసించి సాధించాలే కానీ యాచించి కాదనేవారని కేటీఆర్ గుర్తుచేశారు.
హోం మంత్రి నాయిని మాట్లాడుతూ తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొ. జయశంకర్ ఆశయాలకు అనుగుణంగానే టీఆర్ఎస్ మానిఫెస్టోను రూపొందించామని, ఆయన ఆలోచనలు, ఆశయాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్నారని అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ అంటే సీఎం కేసీఆర్ కు ఎంతో గౌరవమని, ఆయనను గురువుగా భావించి కేసీఆర్ ఆయనకు పాదాభివందనం చేసేవారని నాయిని చెప్పారు. సంవత్సర కాలంగా రాష్ట్రంలో పాలన చూస్తుంటే కేసీఆర్ ఉద్యమాన్ని నడపడంలోనే కాకుండా ప్రభుత్వాన్ని నడపడంలోనూ రాటుదేలినట్లు స్పష్టమవుతోందని, జయశంకర్ ఆలోచనలు టీఆర్ఎస్, తెలంగాణ ప్రభుత్వానికి దిక్సూచి లాంటివని హోం మంత్రి నాయిని పేర్కొన్నారు.