స్వతంత్య్ర భారత వజ్రోత్సవాల వేడుకలలో భాగంగా విద్యార్థులకు రాష్ట్రంలోని 563 స్క్రీన్స్ లో నేడు గాంధీ చిత్రాన్ని ఉచితంగా ప్రదర్శిస్తున్నారు. దేశ స్వాతంత్రం కోసం పోరాడిన మహనీయుల గురించి విద్యార్థులకు తెలియ జేయాల్సిన బాధ్యతలో భాగంగా గాంధీ చిత్రాన్ని విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉచితంగా ప్రదర్శించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ మూడు భాషల్లో ప్రదర్శింప చేస్తున్న ఈ చిత్రాన్ని వీక్షించేందుకు విద్యార్థుల రవాణా ఏర్పాట్లను కూడా ప్రభుత్వమే చేస్తోంది. కాగా మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ హైదరాబాద్ లోని ప్రసాద్ ఐ మ్యాక్స్ లో విద్యార్థులతో కలిసి వీక్షించారు. అలాగే మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జనగామ జిల్లా కేంద్రం దేవి టాకీస్‌లో పిల్లలతో కలిసి కొద్దిసేపు గాంధీ సినిమాను చూశారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ..స్వాతంత్య్రం కోసం పోరాడిన గొప్ప నేత గాంధీజీ అన్నారు. ఆయన అత్యంత నిరాడంబరంగా జీవిస్తూనే, అహింస మార్గంలో మన దేశానికి స్వాతంత్ర్యం తెచ్చారన్నారు.గాంధీజీ మార్గం మనందరికి అనుసరణీయమన్నారు. ఆయన చూపిన దారిలోనే సీఎం కేసీఆర్ గ్రామ స్వరాజ్యాన్ని సాధిస్తున్నారు. మన గ్రామాలను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దారని ఆయన పేర్కొన్నారు. అందరూ ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తూ సీఎం కేసీఆర్ నిర్వహిస్తున్న స్వాతంత్ర వజ్రోత్సవాలలో పాల్గొనాలని ఎర్రబెల్లి పిలుపునిచ్చారు.

