స్విట్జర్లాండ్‌కు చెందిన ఫెర్రింగ్ ఫార్మాస్యూటికల్స్ తెలంగాణలో మరోసారి పెట్టుబడులు పెట్టనుంది. దావోస్ పర్యటనలో ఉన్న రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖమంత్రి కేటీఆర్ తో ఫెర్రింగ్ ఫార్మా కంపెనీ ప్రతినిధులు సమావేశమయ్యి రూ.500 కోట్లతో మరో యూనిట్‌ను నెలకొల్పబోతున్నట్లు ప్రకటించారు. భారీ పెట్టుబడులతో మరోసారి ముందుకు వచ్చిన ఫెర్రింగ్ ఫార్మస్యూటికల్స్ సంస్థను మంత్రి కేటీఆర్ అభినందిస్తూ… కొత్తగా ఏర్పాటు చేయనున్న రెండో యూనిట్‌తో వేలాది మందికి పైగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయని పేర్కొన్నారు. స్విట్జర్లాండ్‌కు చెందిన ఈ బయోఫార్మాస్యూటికల్స్ కంపెనీ ప్రస్తుతం మెటర్నల్, గ్యాస్ట్రో, యూరోలాజీ విభాగానికి చెందిన పలు ఔషధాలను విక్రయిస్తున్నది. ఫెర్రింగ్ ఫార్మా సంస్థకు యూరప్‌తోపాటు దక్షిణ అమెరికా, చైనా, భారత్, అమెరికాల్లో ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేసింది. 1950లో ప్రారంభమైన ఈ సంస్థ అనతికాలంలో అంతర్జాతీయంగా తన వ్యాపారాన్ని విస్తరించింది. ప్రస్తుతం 110 దేశాల్లో తన ఉత్పత్తులను విక్రయిస్తున్నది.

