వ్యవసాయ రంగంలో యాంత్రీకరణ ప్రోత్సహించే క్రమంలో గుజరాత్ రాజ్ కోట్ లోని శక్తిమాన్ వ్యవసాయ పరికరాల పరిశ్రమను తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి బృందం సందర్శించింది. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ… తెలంగాణలో కొత్తగా కట్టిన ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాల వల్ల సాగునీటి పారుదల పెరిగిందని, దీనివల్ల తెలంగాణలోని వ్యవసాయ కూలీలు రైతులుగా మారారని అన్నారు. వ్యవసాయ క్షేత్రాల్లో, అనుబంధ రంగాల్లో కూలీల కొరత తీవ్రంగా ఉందని, దేశంలోని 11 రాష్ట్రాల నుండి తెలంగాణకు వ్యవసాయ కూలీలు వచ్చి పనులు చేస్తున్నప్పటికీ… వీలైనంత త్వరగా తెలంగాణలో వ్యవసాయాన్ని యాంత్రీకరణ దిశగా ప్రోత్సహించాలన్నారు. అభివృద్ధి చెందిన దేశాలలో పెద్ద కమతాలకు అనుగుణంగా తయారు చేసుకున్న యంత్రాలు మన రైతాంగానికి ఉపయోగపడే పరిస్థితి లేదని, మన దేశంలోని చిన్న కమతాలకు అనుగుణంగా యాంత్రీకరణను ప్రోత్సహించాలని అభిప్రాయ పడ్డారు. గత ఎనిమిదేళ్లలో తెలంగాణలో దాదాపు 80 లక్షల ఎకరాలు అదనంగా సాగులోకి వచ్చిందని తెలిపిన మంత్రి నిరంజన్ రెడ్డి, ఈ అనూహ్య పరిణామాల నేపథ్యంలో రైతాంగాన్ని వేగంగా పంటల వైవిద్యీకరణతో పాటు యాంత్రీకరణ వైపు మళ్లించేందుకు ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని అన్నారు. అనంతరం మంత్రి బృందం గోండల్ ఆదర్శ వ్యవసాయ మార్కెట్ కమిటీ నిర్వహిస్తున్న వేరుశెనగ ప్రాసెసింగ్ యూనిట్ ను సందర్శించింది. తెలంగాణలో వేరుశెనగ విస్తృతంగా సాగు చేస్తున్న నేపథ్యంలో తెలంగాణలోనూ వేరుశెనగ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటును స్వాగతిస్తున్నామని అన్నారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో, రోబోటిక్ టెక్నాలజీతో వ్యవసాయ పరికరాలు తయారు చేస్తున్న శక్తిమాన్ కంపెనీ తెలంగాణలో యూనిట్ నెలకొల్పాలని, అందుకు అవసరమైన అన్ని రకాల అనుమతులు, భూమి కేటాయింపు, ఇతర సహాయ, సహకారాలు అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ రెండు రోజుల పర్యటనలో మంత్రి నిరంజన్ రెడ్డి బృందంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, అగ్రోస్ ఎండీ రాములు, అగ్రోస్ జీఎం రాజమౌళి తదితరులు ఉన్నారు.