కాళేశ్వరం ప్రాజెక్టు – కళ్ళు తిరిగే వాస్తవాలు పేరుతో కొన్ని వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొడుతున్నది. అందులో వారు (రచయిత ఎవరో తెలియదు) పేర్కొన్న అంశాలకు తెలంగాణ సాగునీటి శాఖ తరపున వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని తలచి ఈ చిన్న వివరణ. (ఎరుపు రంగులో ఉన్నవి జె.ఏ.సి వాక్యలు. వాటికి వివరణలు మావి).
కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు సమగ్ర ప్రాజెక్టు నివేదిక – (డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ – డీ.పీ.ఆర్) ప్రజల ముందుంచాలని మొదటినుండీ డిమాండ్ చేస్తున్నది. మొత్తానికి సమాచార హక్కు క్రింద ఈ రిపోర్ట్ కాపీ బయటకు వచ్చింది. అక్షరాలా నిజమని ఈ రిపోర్టును విశ్లేషిస్తే అర్ధమవుతుంది. ఈ ప్రాజెక్టు క్రింద సాగు ఖర్చు ఎంతో తెలుస్తే కళ్ళు బైర్లు కమ్ముతాయి.
ఇన్ని రోజులూ ప్రాజెక్టుకు డీపీఆర్ లేకుండానే పనులు మొదలుపెట్టినారని లోకమంతా ప్రచారం చేసిన మీరు ఇప్పటికైనా ప్రాజెక్టుకు డీపీఆర్ ఉందని ఒప్పుకున్నందుకు సంతోషం. డీపీఆర్ ఉందని చెప్పినా వారు నమ్మడానికి అప్పుడు సిద్ధంగా లేరు. డీపీఆర్ అందుబాటులో లేదు కనుకనే తమకు లభ్యమైన సమాచారాన్ని ఆధారం చేసుకొని తమ నివేదికను రూపొందించామని చెప్పుకున్నారు. తమ తప్పుడు నిర్ధారణలకు ప్రభుత్వాన్నే బాద్యురాలిని చేసి తప్పించుకుందామన్న ఎత్తుగడ. ఇక డీపీఆర్ ఉంటే ఎందుకు బయటపెట్టరు? అన్నది వారి ప్రశ్న. ఒక వైపు పక్కలో బల్లెం లాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణ ప్రాజెక్టులని అడ్డుకోవడానికి అన్ని ప్రయత్నాలను చేస్తున్నది. చీటికి మాటికి కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తున్నది. కోర్టుల్లో కేసులు వేస్తున్నది. ఈ ప్రాజెక్టుని GRMB / Apex కౌన్సిల్ పరిధిలోకి నెట్టివేసి ప్రాజెక్టును అడ్డుకుందామని ఆంధ్ర ప్రభుత్వం కుట్రలు చేస్తున్నది. మరో వైపు కృష్ణా, గోదావరి నదుల్లో తెలంగాణకు దక్కవలసిన న్యాయమైన వాటా కోసం తెలంగాణ ప్రభుత్వం పోరాడుతున్నది. సుప్రీం కోర్టులో, కృష్ణా అంతర్రాష్ట్ర ట్రిబ్యునల్ లో వాదనలు జరుగుతున్న ఈ సమయంలో ప్రభుత్వం కొన్ని విషయాలను బహిరంగంగా వెల్లడి చేయలేకపోవచ్చు. వెల్లడి చేస్తే శత్రువు వాటిని తెలంగాణకు వ్యతిరేకంగా వాడుకొనే అవకాశం ఉన్నది. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలని దృష్టిలో ఉంచుకొని చేసిన వ్యూహాత్మక నిర్ణయమే తప్ప ప్రభుత్వం ప్రజల నుండి ఏదో దాచాలన్న ఉద్దేశ్యంతో చేసింది కాదు. డీపీఆర్ ని చూడాలని అనుకునేవాళ్ళకు ఏ అడ్డంకి లేదు. తెలంగాణ ప్రభుత్వం డీపీఆర్ ని ఏ సమయంలో ఎవరికి పంపాలో వారికి పంపుతుంది. యుద్ధ రంగాన్ని తలపిస్తున్న ఈ సందర్భంలో (War Like Situation) ప్రభుత్వం డీపీఆర్ ని పబ్లిక్ డొమైన్ లో పెట్టె సాహాసం చెయ్యజాలదు. ప్రాజెక్టులని త్వరితగతిన పూర్తి చేసి రైతాంగానికి నీరందించాలని ప్రభుత్వం తపన పడుతున్నది. 2016-17 వార్షిక బడ్జెట్ లో సాగునీటి రంగానికి 25 వేల కోట్లు, 2017-18 వార్షిక బడ్జెట్లో 25 వేల కోట్లు కెటాయించడమే అందుకు నిదర్శనం. ఈ కీలకమైన అంశాన్ని ప్రజలు, మేధావులు గమనించవలసిన అవసరం ఉన్నది. ఇప్పుడు సంపాదించినట్లే రచయితలు తలుచుకుంటే ఆనాడు కూడా డీపీఆర్ ని సంప్రదించగలిగేవారే. అప్పుడు వారు చేసిన విమర్షల నుంచి సేఫ్ గా తప్పించుకునే అవకాశం దక్కేది కాదు. ప్రాజెక్టు పట్ల అకారణమైన వ్యతిరేకత ఉన్నది. కాబట్టి వారి మనోభావాలకు /భావోద్వేగాలకు అనుగుణంగానే హడావుడిగా, డీపీఆర్ ని సంప్రదించకుండానే ఈ తప్పుడు నిర్ధారణల నివేదికను వండి వార్చినారు. ఇప్పుడు డీపీఆర్ ని సంపాదించిన తర్వాత కూడా అదే తప్పుడు విశ్లేషణ.
- ఈ ప్రాజెక్టుపై అప్పు, వడ్డీ, తరుగుదల, మెయింటెనెన్స్ ఖర్చులు రూ. 4,081 కోట్లు
- ఏటా విద్యుత్ వినియోగం 1,355.8 కోట్ల యూనిట్లు. ఎత్తిపోతలకు ప్రస్తుత విద్యుత్ ఛార్జీ యూనిట్ కు రూ. 6.40 చొప్పున, ఏటా విద్యుత్ ఖర్చు రూ. 8,677 కోట్లు
- కాళేశ్వరంతో ఏటా ఖర్చు: రూ. 12,758 కోట్లు
నివేదిక రచయితలు ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని అప్పుడు 90,000 – 180,000 కోట్ల మధ్యలోఎంతైనా ఉండవచ్చునని అంచనా వేసినారు. ఈ అంచనాకు రావడానికి వారికి ప్రాజెక్టులో అన్నిప్యాకేజీల విలువలు, ఇతర ప్రాజెక్టు కాంపోనెంట్స్ ని కలిపితే వచ్చిన అంచనా వ్యయమట. ఏటా పంపింగ్ కి అయ్యే వ్యయం 7,903 – 13,172 కోట్ల మధ్య ఉంటుందట. ప్రాజెక్టు ద్వారా సాగునీరు ఇవ్వడానికి అయ్యే పెట్టుబడి వ్యయం ఎకరానికి 5 నుంచి 10 లక్షలు ఉంటుందట. ఇది దేశంలో అత్యధికమట. ఇక నిర్వహణా వ్యయం, వడ్డీలు ఇతర వ్యయాలు కలుపుకుంటే ఏటా ఎకరానికి ఒక పంటకు ఒక లక్ష నుంచి ఒక లక్షా ఎనభై వేలు ఉంటుందట. కాళేశ్వరం ప్రాజెక్టులో సగటు విద్యుత్ వ్యయం రూ. 43,449 నుంచి రూ. 72,416 ఉంటుందట. కాళేశ్వరం పూర్తి అయితే దేశంలోనే అత్యంత ఖరీదైనా నీటిని సరఫరా చేసే ప్రాజెక్టుగా మిగులుతుందట. ఇప్పుడేమో రైతుపై పడే భారం ఏకరాకు రూ. 1,28,600 అంటున్నారు. ఈ ప్రాజెక్టుపై అప్పు, వడ్డీ, తరుగుదల, నిర్వహణ ఖర్చులు రూ. 4,081 కోట్లట. ఏటా విద్యుత్ వినియోగం 1355.8 కోట్ల యూనిట్లు. రూ. 6.40 చొప్పున లెక్కిస్తే విద్యుత్ ఖర్చు రూ. 8,677 కోట్లట. కాళేశ్వరంతో ఏటా ఖర్చు రూ. 12,758 కోట్లట. ఈ కాకుల లెక్కల సంగతి వారికే వదిలేస్తూ అసలు ప్రాజెక్టు అంచనా వ్యయాలు, ఏటా ఎకరానికి అయ్యే వ్యయం, నిర్వహణా వ్యయం ఎంతో వివరించే ప్రయత్నం చేస్తాము. వాప్కోస్ వారు తయారు చేసిన డీపీఆర్ ప్రకారం రీ ఇంజనీరింగ్ అనంతరం మొత్తం ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 80,499.71 కోట్లు (సవరిస్తే 80,500 కోట్లు). రచయితలు చెబుతున్నట్లు 90,000 కోట్లు కాదు. ప్రాజెక్టు అంచనా వ్యయం పెరగడానికి సహేతుకమైన కారణాలే ఉన్నాయి.ఇప్పుడు 80,500 కోట్ల అంచనా వ్యయంతో ఎకరానికి అయ్యే వ్యయం: 80,500 / (18.25+4.70) = 3,50,762 రూపాయలు మాత్రమే. స్థిరీకరణ ఆయకట్టును 100% పరిగణిస్తే ఎకరానికి అయ్యే వ్యయం 2,17,000 లు. ఇక విద్యుత్ వ్యయం సంగతి చూస్తే మొత్తం ప్రాజెక్టుకు అవరమయ్యే విద్యుత్తు 13558 మిలియన్ యూనిట్లు. అయితే ఇందులో 75% విద్యుత్తు మాత్రమే వాస్తవంగా వినియోగమవుతుంది. అంటే వాస్తవ వినియోగం 10168.5 మిలియన్ యూనిట్లు. ఒక యూనిట్ కు రూ. 5.65 తో లెక్కిస్తే మొత్తం విద్యుత్ వ్యయం 5,745 కోట్లు. 25% స్థిరీకరణ ఆయకట్టును కలుపుకొని లెక్కిస్తే ఎకరానికి అయ్యే విద్యుత్ వ్యయం రూ. 25,018 మాత్రమే. ఒక యూనిట్ కి రూ. 6.40 తో లెక్కిస్తే మొత్తం విద్యుత్ వ్యయం రూ. 6,508 కోట్లు. ఎకరానికి అయ్యే విద్యుత్ వ్యయం రూ. 28,339 మాత్రమే.ఉత్తర భారతదేశంతో దక్షిణాది రాష్ట్రాలతో విద్యుత్ గ్రిడ్ అనుసందానం చేసే ప్రక్రియ వేగవంతంగా అమలవుతున్నది. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి అయ్యే నాటికి విద్యుత్ గ్రిడ్ అనుసందానం కూడా పూర్తి అయి ఉత్తర భారత దేశంలో ఉత్పత్తి అయ్యే జలవిద్యుత్ (కాళేశ్వరం పంపులు వానా కాలంలోనే తిరుగుతాయి) రూ. 1.25 నుంచి రూ. 3.00 లకే అందుబాటులోకి వస్తుంది. అప్పుడు విద్యుత్ వినియోగ వ్యయం ఇంకా తగ్గుతుంది. యూనిట్ కి రూ. 3.00 చొప్పున లెక్కిస్తే మొత్తం విద్యుత్ వ్యయం రూ. 3,051 కోట్లు. ఎకరానికి అయ్యే విద్యుత్ వ్యయం రూ. 13,051 మాత్రమే. యూనిట్ కి రూ. 1.25 చొప్పున లెక్కిస్తే మొత్తం విద్యుత్ వ్యయం రూ. 1,271 కోట్లు. ఎకరానికి అయ్యే విద్యుత్ వ్యయం రూ. 5,400 మాత్రమే.పైగా ఇప్పుడు ప్రపంచంలో తయారవుతున్న పంపులు 88 -89 % ఎఫిషియన్సీ కలిగినవి. వాటి పవర్ ఫ్యాక్టర్ 0.95 గా ఉంటుంది. కనుక 10% వరకు ప్రత్యక్షంగా విద్యుత్ వినియోగంలో సేవింగ్స్ ఉంటాయని విద్యుత్ రంగ నిపుణులు చెపుతున్నారు. మరి రచయితలు దాన్ని తమ ఊహాగానాల లెక్కలతో మొత్తం విద్యుత్ వ్యయం రూ. 7,903 నుంచి 13,172 కోట్లు (ఇప్పుడు 8,677 కోట్లకు ) ఎకరానికి అయ్యే విద్యుత్ వ్యయం రూ. ఒక 1 లక్ష నుంచి 1,80,000 (ఇప్పుడు రూ. 1,28,600) అని కాకి లెక్కలు చెబుతున్నారు. ప్రాజెక్టు దేశంలోనే అత్యంత ఖరీదైనా నీటి సరఫరా చేస్తుందని అన్యాయపు నిర్ధారణకు వచ్చినారు. ఇది అవాస్తవం సత్యదూరం.ఇక ప్రభుత్వమే నీటిని గ్రావిటీ ద్వారా సరఫరా చేస్తుంది కనుక రైతుల మీద ప్రత్యక్ష భారం పడదు. పన్ను రూపేణా భారం పడదా? అని అడిగితే తెలంగాణ రైతుకు నీరందించే ఏ ప్రాజెక్టుకైనా ప్రజలు కట్టిన పన్నుల నుంచే నిధులు సమకూరుతాయి. తెలంగాణకు ఎత్తిపోతలు అనివార్యమయినప్పుడు ఈ భారాన్ని ప్రభుత్వం భరించక తప్పదు. ప్రభుత్వం అందుకు వెనుకాడితే ఇక తెలంగాణ రైతుకు ఎన్నటికీ గోదావరి, కృష్ణా నదుల నీటిని అందించలేము. తెలంగాణ ప్రభుత్వం రైతులకు నీరివ్వాలనుకుంటున్నది. అందుకు ఎన్ని నిధులైనా సమకూరుస్తుంది.
మొత్తం ఎత్తి పోసే నీరు మేడిగడ్డ నుండి 180 టీ.ఏం.సీ.లు, యెల్లంపల్లి నుండి 20 టీ.ఏం.సీ. కలిపి 200 టీ.ఏం.సీ.లు. అదనంగా వచ్చే రీజనరేటెడ్ నీరు 25 టీంసీలు. మొత్తం 225 టీ.ఏం.సీ.లు. ఆవిరి, సీపేజ్ నష్టాలు 20% తీసివేస్తే మిగిలేవీ 180 టీ.ఏం.సీ.లు.త్రాగు, పారిశ్రామిక అవసరాలకు 56 టీ.ఏం.సీ.లను తీసివేస్తే మిగిలేవి 124 టీ.ఏం.సీ.లు. 1 టీ.ఏం.సీ నీటితో ప్రభుత్వ లెక్కల ప్రకారం 10,000 ఎకరాలు ఆరుతడి, 6,000 ఎకరాలు తరి సాగుచేయవచ్చు. సగటున 1 టీ.ఏం.సీ.తో 8,000 ఎకరాలు సాగుచేయవచ్చు. ఈ లెక్క ప్రకారం 124 టీఎంసీలతో మొత్తం సాగయ్యే భూమి 9.92 లక్షల ఎకరాలు. ఏటా ఎకరా భూమి సాగుకు ఒక పంటకు అయ్యే ఖర్చు (12,75,800/9.92) రూ. 1,28,608. ఒక రైతుకు సగటున 5 ఎకరాలు ఉందనుకుంటే, ప్రతీ రైతుకు యేటా ఒక పంటకు అయ్యే ఖర్చు అక్షరాలా రూ. 6,13,365. ఈ మొత్తాన్ని రైతులు ఎలానూ భరించలేరు. ప్రభుత్వం ఇంత భారాన్ని మోయగలదా? సాధ్యమేనా?
మేడిగడ్డ బ్యారేజీ నుంచి రోజుకు 2 టీఎంసీల చొప్పున 120 రోజులు నీటిని ఎత్తిపోసి మల్లన్నసాగర్ వరకు తరలించినా హైదరాబాద్ తాగునీటి అవసరాలకు 30, పారిశ్రామిక అవసరాలకు 16, దారి పొడుగునా గ్రామాల తాగునీటి అవసరాలకు 10 టీఎంసీలు, 40% ఆవిరి నష్టాలు, ప్రవాహ నష్టాలు పోనూ మిగిలే నీటితో 18 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడం అసాధ్యం అని రచయితలు గతంలో నిర్ధారించినారు. ఇప్పుడేమో పై విధంగా విశ్లేషించినారు. ఆవిరి నష్టాలను, ప్రవాహ నష్టాలను 40% నుంచి 20% ఇప్పుడు అనడం ఒక మార్పు. వీరి నిర్ధారణని విష్లేశించే ముందు అసలు కాళేశ్వరం ప్రాజెక్టులో నీటి లభ్యత, వినియోగం ఎట్లా ఉండబోతున్నదో చూద్దాం.
నీటి లభ్యత:
గోదావరి నుంచి మళ్ళించే నీటి పరిమాణం: 180 టీఎంసీ
ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి వినియోగించే నీరు: 20 టీఎంసీ
ఎల్లంపల్లి వద్ద లభ్యమయ్యే నీరు: 200 టీఎంసీ
జలాశయాల స్వంత పరివాహక ప్రాంతం నుంచి లభించే నీరు: 10 టీఎంసీ
ప్రాజెక్టు రీ చార్జింగ్ ద్వారా లభించే భూగర్భ జలాలు: 25 టీఎంసీ
ఆవిరి మరియు ప్రవాహ నష్టాలు: (-)10 టీఎంసీ
మొత్తం నీటి లభ్యత: 225 టీఎంసీ
నీటి వినియోగం:
18.25 లక్షల ఎకరాలకు సాగునీరు: 134.50 టీఎంసీ
శ్రీరాంసాగర్, నిజాంసాగర్, సింగూర్ ఆయకట్టు (25%)
4,70,742 ఎకరాల స్థిరీకరణ: 34.50 టీఎంసీ
హైదరాబాద్ తాగునీటి కోసం: 30.00 టీఎంసీ
దారిపొడుగున గ్రామాలకు తాగునీరు: 10.00 టీఎంసీ
పారిశ్రామిక అవసరాలకు: 16.00 టీఎంసీ
మొత్తం నీటి వినియోగం: 225.00 టీఎంసీ
పైన ఇచ్చిన నీటి లభ్యత, వినియోగం చూసినప్పుడు సాగునీటి కోసం ప్రాజెక్టులో 169 టీఎంసీ లు (స్థిరీకరణ కలుపుకొని) కెటాయించడం జరిగింది. ఒక టీఎంసీ కి 13,500 ఎకరాలు సాగు అవుతాయన్న అంచనాతో చూసినప్పుడు 169 టిఎంసిలు 18.25+4.70=22.95 (ఆయకట్టు + స్థిరీకరణ) లక్షల ఎకరాలకు సరిపోవనేందుకు ఎటువంటి ఆధారాలు లేవు. శ్రీరాంసాగర్, నిజాంసాగర్, సింగూర్ జలాశయాలకు తగినన్ని నీళ్ళు వస్తే గనుక కాళేశ్వరం నుంచి స్థిరీకరణకు నీరిచ్చె అవసరమే ఉండదు.ఒక టీఎంసీకి 13500 ఎకరాలు సాధ్యమా అన్న ప్రశ్న వస్తుంది. ఆవిరి ప్రవాహ నష్టాలు రచయితలు ఊహించినట్లు 40% ఉండే అవకాశమే లేదు. ఎందుకంటే నీటి తరలింపు అత్యధిక భాగం టన్నెళ్ళ ద్వారా జరుగుతుంది. నీటి సరఫరా భవిశ్యత్తులో పైప్డ్ ఇర్రిగేషన్ పద్దతిలో జరుగబోతున్నది. ఈ పద్దతిలో జరుగుతున్న నీటి సరఫరా వలన మధ్యప్రదేశ్, మహారాష్ట్రా రాష్ట్రాల్లో మంచి ఫలితాలు వస్తున్నాయి. ఈ పద్దతిని మిగతా రాష్ట్రాలు కూడా అమలు చెయ్యాలని కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖ సూచనలు చేసింది. సాగునీటి మంత్రి శ్రీ హరీశ్ రావు సీనియర్ ఇంజనీర్లను వెంటబెట్టుకొని మధ్యప్రదేశ్ వెళ్ళి పైప్డ్ ఇర్రిగేషన్ పద్దతిని ఓంకారేశ్వర్ ప్రాజెక్టులో స్వయంగా అధ్యయనం చేసి వచ్చినారు. అక్కడ అమలవుతున్న తీరుతెన్నులను ఇంజనీర్లతో చర్చించినారు. ఆ తర్వాతనే ఆదిలాబాద్ జిల్లాలో మత్తడివాగు ప్రాజెక్టులో పైప్డ్ ఇర్రిగేషన్ పద్దతిని పైలట్ ప్రాజెక్టుగా అమలు చెయ్యాలని నిర్ణయించడం జరిగింది. వాటి ఫలితాలను మిగతా డిస్ట్రిబ్యూటరీల్లో అమలు చెయ్యాలని నిర్ణయించినారు. ఆవిరి, ప్రవాహ నష్టాలను గణనీయంగా తగ్గించుకోవడానికి సాగునీటి శాఖ తీవ్రంగా కృషి చేస్తున్నది. గత అనుభవాలను ఆధారం చేసుకొని ఆవిరి, ప్రవాహ నష్టాలు 40% ఉంటాయని రచయితలు నిర్ధారించడం వారి ఊహాగానమే తప్ప వాస్తవం కాదు. (ఇప్పుడు వారు నష్టాలు 20% ఉంటాయని అనడం సంతోషం) సాగునీటి రంగంలో అనుభవం ఉన్నవారెవరూ ఈ రకమైన నిర్ధారణకు వచ్చేఅవకాశం లేదు. కాబట్టి 169 టీఎంసీ లతో 22.95 లక్షల ఎకరాలకు (అవసరమైతే స్థిరీకరణ సహా) సాగునీరు అందించడం రచయితలు అంటున్నట్లు అసాధ్యం కాదు. సాధ్యమే.
టీఎంసీ
పైన ఇచ్చిన నీటి లభ్యత , వినియోగం చూసినప్పుడు సాగునీటి కోసం ప్రాజెక్టులో 169 టిఎంసి లు(స్థిరీకరణ కలుపుకొని) కెటాయించడం జరిగింది. ఒక టీఎంసీ కి 13,500 ఎకరాలు సాగు అవుతాయన్న అంచనాతో చూసినప్పుడు 169 టిఎంసిలు 18.25+4.70=22.95 (ఆయకట్టు + స్థిరీకరణ) లక్షల ఎకరాలకు సరిపోవనేందుకు ఎటువంటి ఆధారాలు లేవు. శ్రీరాంసాగర్, నిజాంసాగర్, సింగూర్ జలాశయాలకు తగినన్ని నీళ్ళు వస్తే గనుక కాళేశ్వరం నుంచి స్థిరీకరణకు నీరిచ్చె అవసరమే ఉండదు.ఒక టిఎంసికి 13500 ఎకరాలు సాధ్యమా అన్న ప్రశ్న వస్తుంది. ఆవిరి ప్రవాహ నష్టాలు రచయితలు ఊహించినట్లు 40% ఉండే అవకాశమే లేదు. ఎందుకంటే నీటి తరలింపు అత్యధిక భాగం టన్నెళ్ళ ద్వారా జరుగుతుంది. నీటి సరఫరా భవిశ్యత్తులో పైప్డ్ ఇర్రిగేషన్ పద్దతిలో జరుగబోతున్నది. ఈ పద్దతిలో జరుగుతున్న నీటి సరఫరా వలన మధ్యప్రదేశ్, మహారాష్ట్రా రాష్ట్రాల్లో మంచి ఫలితాలు వస్తున్నాయి. ఈ పద్దతిని మిగతా రాష్ట్రాలు కూడా అమలు చెయ్యాలని కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖ సూచనలు చేసింది. సాగునీటి మంత్రి శ్రీ హరీశ్ రావు సీనియర్ ఇంజనీర్లను వెంటబెట్టుకొని మధ్యప్రదేశ్ వెళ్ళి పైప్డ్ ఇర్రిగేషన్ పద్దతిని ఓంకారేశ్వర్ ప్రాజెక్టులో స్వయంగా అధ్యయనం చేసి వచ్చినారు. అక్కడ అమలవుతున్న తీరుతెన్నులను ఇంజనీర్లతో చర్చించినారు. ఆ తర్వాతనే ఆదిలాబాద్ జిల్లాలో మత్తడివాగు ప్రాజెక్టులో పైప్డ్ ఇర్రిగేషన్ పద్దతిని పైలట్ ప్రాజెక్టుగా అమలు చెయ్యాలని నిర్ణయించడం జరిగింది. వాటి ఫలితాలను మిగతా డిస్ట్రిబ్యూటరీల్లో అమలు చెయ్యాలని నిర్ణయించినారు. ఆవిరి, ప్రవాహ నష్టాలను గణనీయంగా తగ్గించుకోవడానికి సాగునీటి శాఖ తీవ్రంగా కృషి చేస్తున్నది. గత అనుభవాలను ఆధారం చేసుకొని ఆవిరి, ప్రవాహ నష్టాలు 40% ఉంటాయని రచయితలు నిర్ధారించడం వారి ఊహాగానమే తప్ప వాస్తవం కాదు. (ఇప్పుడు వారు నష్టాలు 20% ఉంటాయని అనడం సంతోషం) సాగునీటి రంగంలో అనుభవం ఉన్నవారెవరూ ఈ రకమైన నిర్ధారణకు వచ్చేఅవకాశం లేదు. కాబట్టి 169 టీఎంసీలతో 22.95 లక్షల ఎకరాలకు (అవసరమైతే స్థిరీకరణ సహా) సాగునీరు అందించడం రచయితలు అంటున్నట్లు అసాధ్యం కాదు. సాధ్యమే.
రైతు రుణమాఫీనే తీసుకుందాం. మాఫీ చేయవలసిన మొత్తం రైతుకు లక్ష రూపాయలు. యేటా రూ. 25,000/- భరించడమే ప్రభుత్వానికి ఎంత కష్టంగా ఉందో చూస్తున్నాం. మరి ఒక్కో రైతుకు యేటా పంటకు ఆరులక్షల రూపాయలకు పైగా ప్రభుత్వం భరించడం సాధ్యమయ్యే పనేనా?
ఇంతకుముందు ప్రస్తావించుకున్నట్లు తెలంగాణ రైతుకు నీరివ్వడానికి ప్రభుత్వం ఎంత ఖర్చుకైనా వెనుకాడదు.
నిజానికి ఈ అంచనాలన్నీ ప్రాజెక్టు ఖర్చులో ఏ మాత్రం పెరుగుదల (ఎస్కలేషన్) ఉండదనే అంచనాతో వేసినవే. కానీ వాస్తవంలో ఏంజరగబోతుంది. 2008లో రూ. 17,000 కోట్ల అంచనాలతో మొదలు పెట్టిన ప్రాణహిత-చేవెళ్ళ ప్రాజెక్టు అంచనా వ్యయం ఎనిమిదేళ్లలో రూ. 80,500 కోట్లకు చేరింది. అంటే 8 ఏళ్లలో 5 రెట్లు పెరిగింది. ఎలాంటి అనుమతులు, ప్రణాళిక లేకుండా చేపట్టిన ప్రస్తుత ప్రాజెక్టు ఖర్చు ఎంత పెరుగుతుందో చెప్పక్కరలేదు. మరి ఏం జరగబోతుంది? కనీసం లక్షకోట్ల రూపాయలు కాంట్రాక్టర్ల జేబుల్లోకి పోవడం ఖాయం. లక్షలాది ప్రజలు నిర్వాసితులు కావడం కూడా ఖాయం. తిరిగి యేటా ఖర్చులు చెల్లించే భారం అటు రైతుల మీద, ప్రజలమీద, ప్రభుత్వం మీద పడబోతుంది. ఇదేవిధంగా ప్రాజెక్టు ముందుకెళితే రాష్ట్రం అప్పుల వూబిలోకి పోవడం కూడా ఖాయంగా కనబడుతుంది.
ప్రాణహిత చేవేళ్ళ ప్రాజెక్టు అంచనా విలువ 3,8500 కోట్లు. అది రీ ఇంజనీరింగ్ తర్వాత 80,500 కోట్లకు పెరిగింది. 38,500 కోట్ల అంచనా విలువ ఎప్పటిది? 2008 నాటిది. భూసేకరణ చెయ్యక, అటవీ అనుమతులు తేలేక, తుమ్మిడిహట్టి బ్యారేజీ సాంకేతిక అంశాలని పరిష్కరించక, మహారాష్ట్రాతో అంతర్రాష్ట్ర వివాదాలను పరిష్కరించక ప్రాజెక్టుని 8 ఏండ్లు దేకించిన తర్వాత కూడా ప్రాజెక్టు అంచనా వ్యయం 38,500 కోట్లే ఉంటుందా? ఇవ్వాళ్ళ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టును యధాథతంగా అమలు చేసినా కూడా ప్రాజెక్టు వ్యయం 50 నుంచి 60 వేల కోట్లకు ఎగబాకుతుంది. రీ ఇంజనీరింగ్ తర్వాత ప్రాజెక్టు అంచనా విలువ ఎందుకు పెరుగుతున్నది? ఇవీ కారణాలు.
- సీడబ్ల్యూసీ సూచనల మేరకు జలాశయాల సామర్థ్యాన్ని16 టీఎంసీల నుంచి 147 టీఎంసీ పెంచడమైనది. మరికొన్ని కొత్త జలాశయాలను ప్రతిపాదించడం జరిగింది. జలాశయాల ఎత్తు పెంచడం కోసం, కొత్త జలాశయాల నిర్మాణం కోసం అదనపు ఖర్చు తప్పదు
- మేడిగడ్డ బ్యారేజీకి ఎగువన అన్నారం , సుందిళ్ళ బ్యారేజీలను ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ మూడు బ్యారేజీల ద్వారా నదీ మార్గంలో గోదావరి నీటిని రోజుకు 2టీఎంసీలు ఎత్తిపోయడానికి ప్రతిపాదనలు సిద్దం అయినాయి. సివిల్ పనులు మాత్రం రోజుకు 3టీఎంసీలు ఎత్తిపోసుకోవడానికి వీలుగా నిర్మించడం జరుగుతుంది. ప్రస్తుతానికి పంపులు, మోటార్లు మాత్రం రోజుకు 2 టీఎంసీలు ఎత్తిపోయడానికి అమర్చడం జరుగుతుంది
- ఆన్ లైన్ జలాశయాల సామర్థ్యాన్ని పెంచినందున భూసేకరణ, పునరావాసం కోసం అదనంగా ఖర్చు పెరుగుతుంది
- 2007 నుంచి 2016 దాకా ధరల పెరుగుదలను అనుమతించవలసిన నిబందనలు గత ప్రభుత్వం కుదుర్చుకున్న టెండరు ఒప్పందాల్లోనే ఉన్నాయి
- మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలు సుమారు 450 బ్యారేజీలు నిర్మించి ఎగువ గోదావరిని చెరబట్టినందున శ్రీరామసాగర్, నిజాంసాగర్, సింగూరు జలాశయాల్లోకి నీరు రాక వాటి కింద ప్రతిపాదిత ఆయకట్టుకు నీరందించలేకపోతున్నాయి. రీ ఇంజనీరింగ్ ద్వారా కేవలం ప్రాణహిత ప్రతిపాదిత ఆయకట్టుకే కాదు ఈ మూడు జలాశయాల కింద ఆయకట్టుని స్థిరీకరించడం రీ ఇంజనీరింగ్ లో ఒక అంశం. అంటే 18.25 లక్షల ఎకరాలకే కాక 25% ఆయకట్టును (18.83 లక్షల ఎకరాల్లో 25%) స్థిరీకరించడం రీ ఇంజనీరింగ్ లక్ష్యం.
కాబట్టి రీ ఇంజనీరింగ్ వలన ప్రాజెక్టు అంచనా వ్యయం అనివార్యంగా పెరుగుతుంది. ప్రాజెక్టుల అంచనా వ్యయాలు పెరగడం సహజమైన అంశమే. తొలి అంచనా విలువతో పూర్తి అయిన ప్రాజెక్టు రాష్ట్రంలో గాని, దేశంలోగానీ, ప్రపంచంలో గాని ఎక్కడైనా ఉంటే చూపించమని ప్రార్థన. మన ఉమ్మడి రాష్ట్రంలో కట్టిన ప్రాజెక్టుల అంచనా విలులు ఎట్లా పెరిగినయో ఈ కింది పట్టికలో చూడండి.
కాబట్టి ప్రాజెక్టు అవసరాల దృష్ట్యా అంచనా విలువలను ప్రభుత్వాలు సవరిస్తాయి. అట్లా సవరించుయిన నిధులన్నీ కాంట్రాక్టర్ల జేబుల్లోకి పోతాయని వాదించడం వితండవాదం. మరి గతంలో నిర్మాణం అయిన ప్రాజెక్టుల నిధులన్నీ కాంట్రాక్టర్ల జేబుల్లోకి పోయినాయని వాదించగలమా?
మరేం చేయాలి… ప్రాజెక్టుపై వేలకోట్ల అనవసరపు ఖర్చు తగ్గించాలి. విద్యుత్ విధానాన్ని కూడా సమీక్షించాలి. జెయెసీ ఇప్పటికే ఈ ప్రాజెక్టులో ఎక్కడెక్కడ ఎంత అనవసర ఖర్చు జరుగబోతుందో సమగ్ర విశ్లేషణతో రిపోర్టును సమర్పించింది. అందరితో చర్చించి ప్రజలకు ఉపయోగపడేలా ప్రాజెక్టులో మార్పులు చేయాలి.
జె ఏ సి తయారు చేసిన నివేదికలో ఏవి అనవసరమైన పనులో ఎక్కడా చెప్పలేదు. మొత్తంగా ప్రాజెక్టునే ఒక చెడ్డ ప్రాజెక్టుగా ముద్ర వేసి తిరస్కరించింది. సాగునీటి ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం నిర్ధారించిన మార్గనిర్దేశనాల ప్రకారం లాభాలు – ఖర్చుల నిష్పత్తి 1.5 : 1 ఉంటే చాలు. అంటే ఒక రూపాయి ఖర్చు పెడితే ఒకటిన్నర రూపాయలు నికర ఆదాయం రావాలి. ఇక్కడ ఒక రూపాయి ఖర్చుకు ఒక రూపాయి యాభై అయిదు పైసలు వస్తున్నాయని ప్రాజెక్టు డీపీఆర్ లో విశ్లేషించినాము. మరో విషయం ఏమిటంటే 1.5 :1 (లాభాలు : ఖర్చు) నిష్పత్తి ఎత్తిపోతల పథకాలకు వర్తించదు అని ప్రణాళికా సంఘం పెద్దలే ఒప్పుకున్నారు. దీన్ని 1:1 గా పరిగణించే ప్రయత్నాలను కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తున్నది. కాళేశ్వరం ప్రాజెక్టుకు బిసి నిష్పత్తి లేదని, ఇది ఒక చెడ్డ ప్రాజెక్టు అని రచయితలు నిర్ధారించడం పూర్తిగా అవాస్తవం, అసంబద్దం.
ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలు గుర్తుంచుకోవలసిన ముఖ్య విషయం ఏమిటంటె… గ్రావిటీ మార్గాన తెలంగాణ భూములకు నీటిని సరఫరా చేసే అవకాశం లేదు. మేడిగడ్డ వద్ద గోదావరి మట్టం + 100 మీ. మన సాగు భూములు + 150 నుంచి + 625 మీ ఎత్తులో ఉన్నాయి. ఈ సంగతిని రచయితలే ఒప్పుకున్నారు. ఎత్తిపోతల పథకాలు ఖర్చుతో కూడుకున్నవే. ఖర్చుతో కూడుకున్నవన్న కారణంగా ప్రాజెక్టులని నిరాకరిస్తే తెలంగాణ భూములకు నీరు అందేది ఎట్లా? గత 60 ఎండ్లుగా సాగునీటి రంగంలో తెలంగాణకు జరిగిన అన్యాయం, వివక్ష ఫలితంగా తెలంగాణలో ఎంతటి వ్యవసాయిక సంక్షోభం తద్వారా ఎంతటి మానవ సంక్షోభం తలఎత్తిందో రచయితలకు తెలియదనుకోవాలా? తెలంగాణ సాధించుకున్నది ఈ మానవ సంక్షోభాన్ని అంతం చెయ్యడానికే కదా! ఎంతటి ఖర్చులకైనా వెనుకాడకుండా తెలంగాణ సాగునీటి రంగంలో అభివృద్దిని సాధించితీరాలి. అందుకు సాధ్యమయినంత తక్కువ వ్యయంతో ప్రాజెక్టులను రూపకల్పన చేసుకోవడం అవసరమే. ఆరు నెలల పాటు తీవ్ర మేధోమధనం చేసి వివిధ ప్రత్యామ్నాయాలని పరిశీలించిన అనంతరమే ప్రస్తుత ఈ ప్రతిపాదనలతో ప్రాజెక్టుని నిర్మించాలని ప్రభుత్వం భావించింది. అందుకే ప్రాజెక్టు లాభాలు ఖర్చుల నిష్పత్తి కూడా కేంద్ర మార్గనిర్దేశనాలకులోబడే ఉన్నదని విజ్ఞులు గమనించాలి.
సరే ! ప్రభుత్వం తమకున్న ఇంజనీరింగ్ పరిజ్ఞానంతో రీ ఇంజనీరింగ్ ని చేపట్టింది. ప్రతిపాదనలని సిద్ధం చేసుకున్నది. వాటిని అమలు చెయ్యడానికి చర్యలు తీసుకుంటున్నది. వీటి పట్ల రచయితలకు అభ్యంతరాలు ఉన్నవి. ఇది ఒక చెత్త ప్రాజెక్టు అని వారి అభిప్రాయం. ఈ నివేదికను చదివిన వారికి వెంటనే వచ్చే ప్రశ్న మరి దీనికి ప్రత్యామ్నాయం ఏమిటీ? ఇటువంటి ప్రశ్న వస్తుందని రచయితలకు ముందే తెలుసు. రచయితల్లో ఒకరు అంతర్జాతీయ స్థాయి మేధావి కదా. అటువంటి ప్రశ్న సమంజసమైనదేనని ఒప్పుకున్నారు కూడా. అందుకే ఆ ప్రశ్నకు ముందే సమాదానం రాసిపెట్టుకున్నారు. నివేదికలోని పేజీ 64 లో ఈ విధంగా రాసుకున్నారు.
“Suggesting alternatives is not the work of those who are critical of the Govt. irrigation projects. Sadly, some critics also seem to be having alternatives in their back pockets. In order to do critical analysis of a project, one need not provide alternatives.
… So providing some alternatives is not pre – requisite for civil society or any individual to be critical of the Govt. irrigation Project.
ప్రత్యామ్నాయాలను సూచించే భాధ్యతను తెలివిగా వదిలెయ్యడమే కాదు భాధ్యతని నెరవేర్చాలని అనుకుంటున్న ప్రాజెక్టు విమర్శకులని ఎద్దేవా చేయడం వారి అహంభావానికి నిదర్శనం. ప్రత్యామ్నాయాల్ని సూచించలేనివారికి, సూచించాలని అనుకోని వారికి తప్పులు ఎన్నే నైతిక హక్కు ఎక్కడిది ? ప్రత్యామ్నాయాలని సూచిస్తూ ప్రాజెక్టుని విమర్శిస్తున్న వారికంటె ఈ రకమైన విమర్శకుల వలన సమాజానికి జరిగే నష్టం ఎక్కువ.
ఒక ఆర్టిస్టు తన మొదటి పెయింటింగ్ పై విమర్శకుల అభిప్రాయాన్ని తెలుసుకుందామన్న ఆసక్తితో దాన్నిఉదయం ఒక బహిరంగ ప్రదేశంలో వేలాడదీసి దాని కింద ఇది నా మొదటి పెయింటింగ్. ఈ బొమ్మలో మీకు ఎక్కడ తప్పులు కనిపిస్తే అక్కడ X మార్క్ పెట్టమని ఒక నోట్ ని రాసినాడు. ఎర్ర రంగు, ఒక బ్రషుని కూడ పెట్టినాడు. సాయంత్రం వెళ్ళి చూసే సరికి అతనికి కండ్లు బైర్లు కమ్మినాయి. మొత్తం పెయింటింగ్ నిండా X మార్కులే! అతను నిరాశతో తన గురువు గారి దగ్గరికి వెళ్ళి చూపించినాడు. గురువుగారు నిరాశ చెందవద్దని, అదే బొమ్మని మరొకసారి వేసి అదే ప్రదేశంలో వేలాడదియ్యమని సూచించినాడు. అయితే ఈసారి నోట్ లో రాయవలసిన అభ్యర్థనని మార్చమన్నాడు. గురువుగారి సూచన మేరకు అతను తన పెయింటింగ్ ని అదే ప్రదేశంలో వేలాడదీసి క్రింద ఈ రకంగా అభ్యర్థించినాడు. ఇది నా మొదటి పెయింటింగ్. ఈ బొమ్మలో మీకు ఎక్కడ తప్పులు కనిపిస్తే అక్కడ సరి చేయగలరు. సాయంత్రం వెళ్ళి చూసే సరికి తన పెయింటింగ్ గీసింది గీసినట్లు అట్లనే ఉన్నది. సారాంశం ఏమిటంటే తప్పులు ఎన్నడం తేలికే. తప్పులు సరిదిద్దడం కష్టం. నివేదిక రచయితలు తేలికైన తప్పులు ఎన్నే పనిని ఎంచుకున్నారు. కష్టమైన తప్పులు సరిదిద్దే పనిని వదిలేశారు. పైగా అది మా పని కాదు అని దబాయింపు.
నివేదిక రచయితల లక్ష్యo ఏమిటి? ప్రభుత్వం తెలంగాణ రైతులకు సాగునీళ్లివ్వాలా? వద్దా? తెలంగాణ రాష్ట్ర సాధన ఎజెండాలో కీలకమైన నీళ్ల సంగతిని ఉద్యమంలో పాల్గొన్నామని చెప్పుకుంటున్న రచయితలు మరచిపోయినారా? నల్లగొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఫ్లోరోసిస్ పీడ విరగడ కావద్దా? తెలంగాణలో వ్యవసాయ సంక్షోభం కొనసాగవలసిందేనా? తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు కొనసాగవలసిందేనా? తెలంగాణ ఇంకా కరువు ప్రాంతంగా మిగిలిపోవలసిందేనా? తెలంగాణ ప్రజలకు తాగునీళ్ళు కావాలి. సాగు నీళ్ళు కావాలి. దీనికోసం తెలంగాణ ప్రభుత్వం రాజీలేకుండా పనిచేస్తుంది. తెలంగాణ ప్రజలకు దక్కకుండానే గోదావరిలో 3 వేల నుంచి 3500 టీఎంసీల నీరు వృధాగా సముద్రంలోకి వెళ్ళాల్సిందేనా! రచయితలు అదే కోరుకుంటున్నరా? గ్రావిటీ మార్గాన నీరు ఇవ్వలేమని తెలిసినప్పుడు ఆర్థికంగా భారమైనా ఎత్తిపోతల పథకాలని చేపట్టక తప్పదు.
తెలంగాణకు సాగునీరు ఎత్తిపోతల పధకాలు తప్ప ప్రత్యామ్నాయం లేదని ఈ సోకాల్డ్ అంతర్జాతీయ మేధావులకు తెలియదని కాదు. క్షుణ్ణంగా తెలుసు. కనుకనే వారి నివేదికలో చాప్టర్ 5 పేజీ 51 లో స్పష్టంగా ఈ మాటలు చెప్పారు.
“…… Godavari water can only be used through lift irrigation, combination of flood flow and filling of tanks etc. There is complete agreement about it, no one is disputing or questioning about pumping of water from Godavari River. That is fact and the geography dictates it. Even after formation of Telangana Godavari continues to flow as it was and that will not change.”
“So in order to use Godavari water electricity has to be used. No one is disputing that aspect. The entire debate is about how to lift, from where, how effective etc……”
గోదావరి నీటిని ఎత్తిపోయడం తప్ప అన్యధా మార్గం లేదని రచయితలే ఒప్పుకున్నారు. కాకపోతే తక్కువ ఖర్చుతో (Cost Effective) ఆ నీటిని చేరవేయటమెట్లా అన్నది చర్చ అని వారి అభిప్రాయం. ప్రభుత్వం రూపొందించిన ఎత్తిపోతల పథకాల్లో ఏవైనా పొరపాట్లు ఉంటే నిపుణులు సూచించవచ్చు కదా. ఇప్పుడు అమలు చేస్తున్న వరుస బ్యారేజీల పరంపర కన్నా ఉత్తమ మార్గమేదన్న ఉంటే చెప్పొచ్చు కదా!
దశాబ్ధాలుగా తాగునీటికి, సాగునీటికి అల్లాడుతున్న తెలంగాణ ప్రజలకు తమకిచ్చిన కాలపరిమితిలోనే సాగునీరు, తాగునీరు అందించడం ప్రభుత్వ లక్ష్యం. ఆర్థిక సానుకూలత లేదన్న కారణంతో ప్రాజెక్టులను కట్టొద్దా? ఈ డొంక తిరుగుడు కంటే అసలు ప్రాజెక్టులే వద్దని నేరుగా ప్రకటించవచ్చు కదా! ‘శాస్త్రీయంగా అధ్యయనం’ చేసి రూపొందించినదిగా చెబుతున్న ఈ నివేదిక లో శాస్త్రీయ అధ్యయనమే లేదు (నీటి లభ్యతపై చేసిన అధ్యయనం తప్ప). హేతుబద్ధత లేదు. ఏదో రకంగా కాళేశ్వరం ప్రాజెక్టును విమర్శించాలనో, కిరికిరి పెట్టాలనో, ప్రజలను, ముఖ్యంగా రైతాంగాన్ని గందరగోళంలో పడవేయాలనో రచయితలు కంకణం కట్టుకున్నట్టు కనిపిస్తున్నది. గతంలో ఆంధ్రా వలస పాలకులకు మీరు (తెలంగాణ) ఎత్తు గడ్డ మీద ఉన్నారు. నీరు పల్లమెరుగు. కాబట్టి మీకు నీళ్ళు రావు అనేవారు. “నీరు కోస్తానెరుగు, నిజం దేవుడెరుగు, ఓ నీటిపారుదలా! నీ రాస్తా కోస్తాకే “అని ఉద్యమ సమయంలో మన కవులు పాడినారు. ఎత్తిపోతల ద్వారా తప్ప గోదావరి నీరు ఎత్తుగడ్డ మీద ఉన్న తెలంగాణ భూములకు తరలించే మార్గం లేదని తెలిసి కూడా రచయితలు ఆర్థిక సానుకూలత లేదన్న సాకుతో కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇద్దరి లక్ష్యం తెలంగాణ సాగునీరు అందకుండా చెయ్యడమే.
కళ్లముందు ఎ.ఎం.ఆర్.పి (నల్లగొండ), దేవాదుల (వరంగల్), అలీసాగర్, గుత్పా, చౌటుపల్లి హనుమంత్ రెడ్డి (నిజామాబాద్), కల్వకుర్తి, నెట్టింపాడు, బీమా, కోయిల్ సాగర్ (మహబూబ్ నగర్), ఎల్లంపల్లి (కరీంనగర్), నాగార్జునసాగర్ లో లెవల్ కాలువ (నల్లగొండ), గూడెం (మంచిర్యాల్), మంథని మొదలైన భారీ ఎత్తిపోతల పథకాలు విజయవంతం అయిన విషయం ఈ అంతర్జాతీయ మేధావులకు కనిపించదా? తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రాజెక్టుల పనులు పరుగులు పెడుతున్నవి. కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ ఎత్తిపోతల పథకాల ద్వారా మొదటిసారి సాగునీరు రైతుల కందుతోంది. అటు ఎల్లంపల్లి ఎత్తిపోతలు, ఎ.ఎం.ఆర్.పి లోలెవల్ కెనాల్ పనులు పూర్తయి రైతాంగానికి ప్రయోజనం చేకూరుతున్నది. గత ప్రభుత్వాల కాలంలో ప్రారంభమైన అన్ని ఆన్ గోయింగ్ ప్రాజెక్టులని 2018 ఖరీఫ్ కల్లా పూర్తి చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. కొత్తగా ప్రారంభించిన కాళేశ్వరం బ్యారేజీలను, పాలమూరు రంగారెడ్డి, డిండీ, సీతారామ ఎత్తిపోతల పథకాలని, చనాక కొరాట పెన్ గంగా బ్యారేజిని, గ్రావిటీ కాలువని 2019 కల్లా పూర్తి చెయ్యాలన్న సంకల్పంతో ముందుకు సాగుతున్నది. ఇంతకు ముందు చెప్పినట్లు ఇది యుద్ద పరిస్థితి. యుద్ద ప్రాతిపదికన ప్రాజెక్టుల పనులని పూర్తి చెయ్యవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది. అది తెలంగాణ ప్రజలకు ఇచ్చిన వాగ్ధానం. అన్నిఅడ్డంకులను ఎదుర్కొని ముందుకు ప్రభుత్వం ముందుకు సాగుతది.
– జె హరిరామ్, చీఫ్ ఇంజనీర్, కాళేశ్వరం ప్రాజెక్టు
– శ్రీధర్ రావు దేశ్ పాండే, సాగునీటి శాఖ మంత్రి ఓ.ఎస్.డి