mt_logo

సీఎం కేసీఆర్ దేశవ్యాప్త పర్యటనపై సర్వత్రా ఆసక్తి

దేశవ్యాప్త పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు శుక్రవారం ఢిల్లీకి చేరుకొన్నారు. జాతీయ, రాజకీయ సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు తొలిసారి ఏకధాటిగా పదిరోజులు ఐదారు రాష్ట్రాల్లో పర్యటిస్తుండటంతోపాటు, జాతీయ రాజకీయాల్లో మార్పు తీసుకొచ్చే దిశగా చేస్తున్న ప్రయత్నాలపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. ఇప్పటికే బలమైన కేంద్రం-బలహీన రాష్ట్రాలు, బలవంతపు సంస్కరణల అమలు, నిధుల కేటాయింపులో వివక్ష వంటి అంశాలపై రాష్ట్రాల హక్కులను బలంగా ప్రశిస్తున్న కేసీఆర్‌.. ఈ పర్యటనలో తన వ్యూహాలకు మరింత పదునుపెట్టి భావసారూప్య రాష్ట్రాలను ఏకం చేస్తారని భావిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌ హైటెక్స్‌ వేదికగా జరిగిన టీఆర్‌ఎస్‌ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ ‘దేశంలో గుణాత్మక మార్పు జరగాలి. దేశానికి ప్రత్యామ్నాయ ఎజెండా కావాలి. అందుకోసం ఇక్కడి నుంచే తొలి అడుగుపడాలి. ఆ అదృష్టం తెలంగాణకే దక్కాలి’ అని గంభీరమైన ప్రకటన చేశారు. అప్పటి నుంచి కేసీఆర్‌ ఏం చేయబోతున్నారనే ఆసక్తికరమైన చర్చ సాగుతున్నది. అందులో భాగంగానే ఇటీవల కాలంలో జాతీయస్థాయిలో వివిధ హోదాల్లో పనిచేసి రిటైర్‌ అయిన ఉన్నతాధికారులతో విస్తృతంగా చర్చించారు. దేశ వ్యవసాయ రంగం, సాగునీరు, తాగునీరు, ఆర్థికపరిస్థితులు, రాజకీయ పరిస్థితులు వంటి అంశాలపై చర్చించారు. సుదీర్ఘ మేధోమథనం తరువాతే సీఎం కేసీఆర్‌ ఈ సారి ఢిల్లీ పర్యటన ఖరారు చేసుకొన్నారని రాజకీయవర్గాల్లో ఆసక్తికరమైన చర్చ సాగుతున్నది.

కేంద్ర ప్రభుత్వం అనాలోచితంగా తీసుకొచ్చిన మూడు సాగుచట్టాల రద్దు కోసం సాగిన పోరాటంలో అసువులు బాసిన రైతు కుటుంబాలను సీఎం కేసీఆర్‌ పరామర్శించి, ఆర్థిక సహాయం చేయనున్నారు. ఢిల్లీ, పంజాబ్‌ ముఖ్యమంత్రులతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. బెంగళూరులో మాజీ ప్రధాని దేవెగౌడ, మాజీ సీఎం కుమారస్వామితో భేటీ కానున్నారు. చండీగఢ్‌లో రైతు అమరవీరుల కుటుంబాలకు చెక్కులు అంద జేస్తారు. మహారాష్ట్రలోని రాలేగావ్‌సిద్దిలో అన్నాహజారేతో భేటీ కానున్నారు. పశ్చిమ బెంగాల్‌, బీహార్‌లోనూ పర్యటించనున్నారు. ఆయా రాష్ట్రాల్లో పర్యటిస్తున్నప్పుడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలను ఎండగడుతారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. జాతీయ స్థాయిలో రాజకీయ, సామాజిక, ఆర్థిక, మీడియా రంగాల ప్రముఖులతో ప్రత్యే సమావేశాలు నిర్వహించనున్నారు. రిటైర్డ్‌ ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఎఫ్‌ఎస్‌ అధికారులతో భేటీ కానున్నారు. ఢిల్లీకి చేరుకొన్న ముఖ్యమంత్రి వెంట రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌, ఎంపీలు సంతోష్‌కుమార్‌, రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌ ఉన్నారు. ఢిల్లీ విమానాశ్రయంలో సీఎం కేసీఆర్‌కు రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వర్‌రావు, ఎంపీ వెంకటేశ్‌ నేత, తెలంగాణభవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ గౌరవ్‌ ఉప్పల్‌ ఘనస్వాగతం పలికారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *