ఎన్నికైన ఇన్నాళ్లకు మేము గుర్తొచ్చామా అని ఆగ్రహించిన గ్రామస్థులు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పై తీవ్రస్థాయిలో నిరసనకు దిగారు. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండి గ్రామ సమీపంలో ప్రమాదకర స్థాయిలో గోదావరి ప్రవహిస్తుండటంతో ఆ ప్రాంతాన్ని పరిశీలించేందుకు వచ్చారు. పార్లమెంటుకు ఎన్నికైన మూడేళ్లకు తాము ఇప్పుడు గుర్తొచ్చామా..? గతంలో ఎన్నోసార్లు తమ గ్రామాన్ని వరదలు ముంచెత్తినా ఎందుకు రాలేదని గ్రామస్తులు ఎంపీ అరవింద్ ను నిలదీసారు. తీవ్ర ఆగ్రహంతో ఎంపీ వాహనంపైకి రాళ్లు విసరి అడ్డుకున్నారు. రాజకీయం కోసమే తమ గ్రామానికి వచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగిన స్థానికులు, అరవింద్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. దీంతో అక్కడ నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను నివారించేందుకు పోలీసులు రంగ ప్రవేశం చేశారు. గ్రామస్తులను పోలీసులు శాంతింపజేశారు.

