mt_logo

కేంద్రంపై పోరుకు ప్రతిపక్షాలను సిద్ధం చేస్తున్న సీఎం కేసీఆర్

జూలై 18 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కేంద్రం ప్రభుత్వంపై పోరాటానికి ముఖ్యమంత్రి కేసీఆర్​ పిలుపునిచ్చారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా క‌లిసి వ‌చ్చే అన్ని రాష్ట్రాల విప‌క్ష పార్టీల‌ను స‌మ‌న్వ‌యం చేసుకుంటూ.. పోరుకు స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నారు. ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌ను అవ‌లంభిస్తున్న బీజేపీ విధానాల‌ను ప్రశ్నిస్తూ… దేశంలో ప్రమాదంలో పడుతున్న ఫెడరల్, సెక్యులర్ ప్రజాస్వామిక విలువలను కాపాడాలనే తన ప్రయత్నాలకు కేసీఆర్ మ‌రింత ప‌దును పెట్టారు. ఆర్థిక సంక్షోభంలోకి దేశాన్ని నెట్టివేస్తున్న కేంద్ర వైఖరిని తేటతెల్లం చేసేందుకు పార్ల‌మెంట్ స‌మావేశాల‌ను వేదిక‌గా చేసుకుని బీజేపీ ప్ర‌భుత్వంపై సీఎం కేసీఆర్ పోరాటం చేయ‌నున్నారు. బీజేపీ ప్రభుత్వ అప్రజాస్వామిక దమన నీతిని తీవ్రంగా ఖండిస్తూ.. దేశవ్యాప్త నిరసనలతో కేంద్రం అసలు స్వరూపాన్ని నగ్నంగా నిలబెట్టేందుకు స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నారు. ఈ క్రమంలోనే వివిధ రాష్ట్రాల సీఎంలు, నేతలతో సీఎం కేసీఆర్ ఫోన్ లో చర్చలు జరిపారు. బెంగాల్ అధినేత్రి మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, తేజస్వీయాదవ్, అఖిలేశ్ యాదవ్, శరద్ పవార్ లతో ఫోన్ లో ప్రస్తుత రాజకీయ అంశాలు, కేంద్ర విధానాలపై చర్చించారు. కేంద్రంపై పోరాటానికి కలిసిరావాలని కోరారు. పార్లమెంట్ వేదికగా కేంద్ర ప్రభుత్వంపై పోరాడదామని పిలుపునిచ్చారు. కేంద్రంపై ప్రజాస్వామిక పోరాటంలో భాగంగా సీఎం కేసీఆర్ ప్రతిపాదనలకు ప‌లు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌లు సానుకూలంగా స్పందిస్తున్నారు. అటు వరదల నుంచి రాష్ట్రాన్ని కాపాడేందుకు మంత్రులు, అధికార యంత్రాంగానికి ఆదేశాలిస్తూనే.. ఇటు బీజేపీ అప్రజాస్వామిక విధానాల విపత్తు నుంచి దేశాన్ని కాపాడేందుకు పార్లమెంట్ వేదికగా పోరాటం చేసేందుకు కేసీఆర్ అంద‌ర్నీ స‌న్న‌ద్ధం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *