mt_logo

ఇకపై ఈ-బర్త్ సర్టిఫికెట్స్…!

తెలంగాణ సర్కార్ మరో ప్రతిష్టాత్మకమైన నిర్ణయం తీసుకుంది. జనన ధృవీకరణ పత్రాలు పొందడాన్ని మరింత సులభతరం చేసే దిశలో ముందుకు వెళ్తోంది. దేశంలో ఎక్కడా లేనివిధంగా జనన ధృవీకరణ పత్రాలను దరఖాస్తుదారులే నేరుగా ఆన్ లైన్ ద్వారా గాని, ప్రసవించిన దవాఖానల నుండి కానీ పొందవచ్చు. ఇన్నిరోజులూ జనన ధృవీకరణ పత్రాల కోసం సంబంధిత సర్కిల్ మున్సిపల్ కార్యాలయాల చుట్టూ గానీ, మీ సేవా కేంద్రాల చుట్టూ గానీ తిరగాల్సి వచ్చేది. పత్రాలు పొందే క్రమంలో బ్రోకర్లకు ఎంతో కొంత డబ్బు చెల్లించుకోవాల్సి రావడం ఉండేది. ఇకమీదట ప్రజలకు ఏవిధమైన కష్టాలు లేకుండా ఈ విధానం ఎంతో మేలు చేకూర్చనుంది.

పిల్లలను పాఠశాలల్లో చేర్పించడంతో పాటు మరికొన్ని ముఖ్యమైన సందర్భాలలో జనన ధృవీకరణ పత్రాలు తప్పనిసరి. అందుకే వీటిని సులువుగా పొందడానికి తెలంగాణ సర్కార్ ఈ-బర్త్ విధానం ప్రవేశపెట్టింది. గర్భిణీ స్త్రీలు దవాఖానలో ప్రసవించిన రోజునే వారి పూర్తి వివరాలు ఏరోజుకారోజు ఈ-బర్త్ పోర్టల్ లో నమోదు చేస్తారు. దీనివల్ల ఏ దవాఖానలో ఏరోజు ఎంతమంది జన్మించారు అనే విషయం కూడా సులభంగా తెలిసిపోతుంది. తల్లిదండ్రులు నేరుగా తమ పిల్లలు జన్మించిన దవాఖాన నుండి కానీ, లేదా ఆన్ లైన్ ద్వారా గానీ డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

అన్ని ప్రభుత్వ దవాఖానలతో పాటు ప్రైవేట్ దవాఖానాల్లో సైతం ఈ విధానం అమలు చేస్తున్నట్లు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు డా. వెంకటి, డా. రాజ్యలక్ష్మిలు తెలిపారు. ఈ-బర్త్ విధానానికి ప్రతి జిల్లాకు ఒక పాస్ వర్డ్ కేటాయించినట్లు, ఈ పాస్ వర్డ్ ల ద్వారా సంబంధిత దవాఖానా అధికారులు ఏరోజుకారోజు జన్మించిన శిశువుల వివరాలు ఈ-బర్త్ పోర్టల్ లో పొందు పరుస్తారని చెప్పారు. ఈ వివరాలను రాష్ట్రంలో ఎక్కడినుండైనా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు పరిశీలించే అవకాశం ఉంటుందని, అందుకోసం రాష్ట్రస్థాయి పాస్ వర్డ్ సంబంధిత అధికారుల వద్ద ఉంటుందని వారు తెలిపారు.

అయితే 2019, జనవరి 1 నుండి జన్మించిన శిశువుల సర్టిఫికెట్లను మాత్రమే ఈ విధానం ద్వారా పొందవచ్చు. ఎందుకంటే ఈ నూతన విధానం ఈనెల ఆరంభం నుండే అమల్లోకి వచ్చింది. (ebirth.telangana.gov.in) లోకి వెళ్లి అక్కడ అడిగిన వివరాలతో పాటు సంబంధిత దవాఖాన సిబ్బంది డెలివరీ సమ్మరీ షీట్ లో జారీచేసిన యూనిక్ ఐడీ కోడ్ ను ఎంటర్ చేయాలి. వెబ్ సైట్ లో ఎంటర్ చేసిన వివరాల ఆధారంగా సంబంధిత శిశువు జనన ధృవీకరణ పత్రం వస్తుంది. దానిని నేరుగా ఇంటిలోనుండే డౌన్ లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవచ్చు. మరో విశేషం ఏంటంటే పిల్లలకు పేరు పెట్టిన తర్వాత ఆ పేరును తల్లిదండ్రులే నేరుగా ఈ-బర్త్ పోర్టల్ లో ఎంటర్ చేసి బర్త్ సర్టిఫికేట్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఇప్పటివరకు గ్రేటర్ లో 6,500 ధృవీకరణ పత్రాలను ఈ-బర్త్ విధానం ద్వారా జారీ చేసినట్లు అధికారులు వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *