mt_logo

దుమ్ము కొట్టినవి తెలంగాణకు- అద్దాల మేడలు సీమాంధ్రకు!!

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ గా రాష్ట్రం విడిపోయాకకూడా అధికారుల బుద్ధి మాత్రం మారట్లేదు. తెలంగాణ రాష్ట్రప్రభుత్వానికి దుమ్ముకొట్టిన భవనాలు, సీమాంధ్ర ప్రభుత్వానికి ప్రస్తుతం ఉన్న భవనాలతోపాటు అన్ని హంగులతో కూడిన అద్దాల మేడలు ఇవ్వాలని చూస్తున్నారు. ఈ ఏర్పాట్లను చూస్తుంటే హైదరాబాద్ నే విభజిస్తున్నట్లు కనపడుతుందని తెలంగాణ ఉద్యోగసంఘాల నేతలు, తెలంగాణ వాదులు విమర్శిస్తున్నారు. సచివాలయంలో9 బ్లాకులు ఉండగా, డీ బ్లాక్, హెచ్ బ్లాక్ లు రెండు మాత్రమే తెలంగాణకు కేటాయిస్తూ సీమాంధ్రకు మాత్రం మిగతా బ్లాక్ లను కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర గవర్నర్ నరసింహన్ కూడా అధికారులు అందించిన ప్రతిపాదనలకు అనుకూలంగా స్పందించారని తెలుస్తుంది. రాష్ట్రంలో ఉన్న అధికారుల్లో అధికభాగం సీమాంధ్రులు ఉండడమే దీనికి కారణమని విమర్శలు వినిపిస్తున్నాయి.

పది అంతస్తులు ఉన్న గగన్ విహార్ లో సకల సదుపాయాలూ ఉన్న మొదటి 3అంతస్తులు సీమాంధ్ర కార్యాలయాలకు కేటాయిస్తుండగా 5వ అంతస్తు నుండి తెలంగాణ కార్యాలయాలకు కేటాయించనున్నారు. కరెంటు లేక లిప్టులు పనిచేయకపోతే ఉద్యోగులు అనేక బాధలు పడాల్సి వస్తుందని తెలంగాణ ఉద్యోగసంఘాలు మండిపడుతున్నాయి. ఇవేకాకుండా, దేవాదాయశాఖ, టూరిజం, రోడ్లు, భవనాలు, పే అండ్ అకౌంట్స్, బూర్గుల రామకృష్ణారావు భవన్, నీటిపారుదల శాఖ కార్యాలయాల్లో ఇదే విధానం అమలు చేస్తున్నారు. ఒకే భవనంలో రెండు రాష్ట్రాలకు చెందిన ఆఫీసులు ఉంటే ఉద్యోగుల మధ్య గొడవలు పెరుగుతాయని తెలంగాణ ఉద్యోగసంఘాల నాయకులు అంటున్నారు. ఏ సమస్యలు లేకుండా పరిపాలన సాగాలంటే సీమాంధ్ర ఉద్యోగులతో సంబంధం లేకుండా భవనాల విభజన జరగాలని, తాత్కాలిక రాజధానిగా అన్ని వసతులతో కూడిన జూబ్లీహిల్స్ లోని మర్రి చెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి సంస్థ కేటాయించాలని వారు అభిప్రాయపడ్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *