mt_logo

దొరలెవరు? దొంగలెవరు?

By: ఘంటా చక్రపాణి

పునర్నిర్మాణం అంటే ఉన్న నిర్మాణాలను కూల్చి వేస్తారా? అంటూ వెనుకటికి ఒక తలపండిన జర్నలిస్టు ఒక కొంటె వాదన లేవదీశారు. ఆయనకు పునర్నిర్మాణం అంటే అర్థం తెలియక కాదు. ఆ వాదన వెనుక ఆయనకు తన సొంత అభిప్రాయాలు ఉన్నాయి. అందులో ఒకటి అసలు తెలంగాణ ధ్వంసమే కాలేదు అన్నది, రెండోది పునర్నిర్మాణం అవసరమే లేదన్నది. మామూలుగా అయితే ఆయన అలాంటి వాదన చేయరు. కానీ కేసీఆర్ తెలంగాణ పునర్నిర్మాణం అని అన్నాడు కాబట్టి, తాను కేసీఆర్ వాదాన్ని వ్యతిరేకించాలి కాబట్టి ఆయన ఒక సుదీర్ఘ విశ్లేషణ చేశారు. కేసీఆర్ తెలంగాణ పునర్నిర్మాణం పేరుతో రాజకీయాలు చేస్తున్నారని, తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయకుండా ఉండేందుకే కేసీఆర్ ఈ ఎత్తుగడ వేశారన్నది ఆయన వాదన సారాంశం.

ఒక్క ఆయన మాత్రమే కాదు ఇప్పుడు చాలామంది పునర్నిర్మాణం అనే పదానికి కొత్త కొత్త అర్థాలు వెతుకుతున్నారు. కొందరు గడీల పునర్నిర్మాణం అంటే, మరికొందరు భూస్వామ్య పునర్నిర్మాణం అని, ఇంకొంత మంది దొరతనం పునర్నిర్మాణమని ఎవరి భాష్యాలు వాళ్ళు చెబుతున్నారు. పాపం కేసీఆర్ రెండుసార్లు అదేపనిగా మీట్ ది ప్రెస్ కార్యక్రమాల్లో వివరించినా, తన చానల్‌లో నాలుగు గంటలపాటు విజేత విజన్ పేరుతో ప్రత్యక్ష ప్రసారంలో విడమరచి చెప్పినా ఆయన రాజకీయ ప్రత్యర్థులు ఆయనంటే పొసగని వాళ్ళు పదేపదే ఇదంతా ‘దొరతనం’ అని దబాయిస్తూనే ఉన్నారు. నిజానికి దొర అనేది ఒక కులం కాదు. అది ఫ్యూడల్ వ్యవస్థకు ప్రతీక, భూమి మీద,ఉత్పత్తి మీద, మనుషుల మీద, మొత్తంగా సమాజంలోని అన్నిరకాల మానవ సంబంధాలమీద ఆధిపత్యం చెలాయించిన ఒకానొక దశ.

దొరలు ఒక్క వెలమ కులంలోనే లేరు. గడీలు కేవలం వాళ్ళవే కాదు. నల్లగొండలో ప్రారంభమైన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం రెడ్ల దొరతనం మీద తిరుగుబాటుగా వచ్చింది. భూస్వామ్య వ్యవస్థలో జాగీర్దార్లుగా ఉన్న అన్ని అగ్రకులాలు ఉన్నాయి. కొన్నిచోట్ల వెలమ దొరలుంటే, చాలా చోట్ల రెడ్లు, మరికొన్ని చోట్ల కాపులు, కరణాలు అలాగే ఆదిలాబాద్ లాంటి ప్రాంతాల్లో ముస్లిం జాగీర్దార్లు కూడా దొరతనం చెలాయించారు. ఇటువంటి అగ్రవర్ణ, కొన్నిచోట్ల ముస్లిం భూస్వాములంతా తమ ఆధిపత్యానికి ప్రతీకలుగా కోటలు, గడీలు నిర్మించుకున్నవాళ్ళే. ఇదంతా చరిత్రలో నమోదైన వాస్తవం. అయినా తెలంగాణ సమాజం దొరతనానికి ఎన్నడూ భయపడలేదు, ఐలమ్మ, బందగీ లాంటి వాళ్ళ తరం నుంచి అయిలయ్య, రాజమల్లు తరం దాకా తెలంగాణ ప్రజలు పోరాటాల, ప్రజా ఉద్యమాల ద్వారా ఈ దొరల మెడలు వంచిన వాళ్ళే.

తన చెప్పుచేతల్లో బానిసల్లా పడిఉన్న సామాన్యులు తిరగబడి దొరలను పల్లెలు, పంట పొలాల నుంచి పరుగెత్తించిన సందర్భాలు ఇటీవలి తెలంగాణ చరిత్రలో అనేకం. నిజానికి నడ్డి విరిగిపోయిన దొరతనాన్ని మళ్ళీ లేపి నిలబెట్టడం, శిథిలమై గబ్బిలాల గూళ్ళుగా మారిపోయిన గడీలను మళ్ళీ నిర్మించడం కేసీఆర్ వల్ల కాదు గదా ఆయన తాతల తరం వల్ల కూడా సాధ్యమయ్యే పనికాదు. అయినా సరే కొందరు అదేపనిగా దొరతనాన్ని ఇంకా తెలంగాణలో ఒక ఆధిపత్యశక్తిగా చూపడం తెలంగాణ ప్రజల పోరాట పటిమను, విజయాల చరిత్రను తక్కువ చేయడమే అవుతుంది.

ఈ మధ్య చాలామంది కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింది అంటున్నారు. ఇది ప్రజా ఉద్యమాలను తక్కువ చేసి చూపేమాట. ఎవరో ఇస్తే కాదు తెలంగాణ ప్రజలు నిలబడి పోరాడి సాధించుకున్నది. అది ఉద్యమ ఫలితం. కాంగ్రెస్ మాత్రమే కాదు, అక్కడ ప్రభుత్వంలో ఎవరున్నా ప్రజాస్వామ్యంలో ప్రజాఉద్యమాలను గౌరవించి తలవంచాల్సిందే. ఇప్పుడు ఎన్నికల సమయంలో కొందరు ఈ దొరల వాదనను బలంగా ముందుకు తెస్తున్నారు. కాంగ్రెస్, టీడీపీ నాయకులు టీఆర్‌ఎస్‌ను దొరల చిరునామాగా చూపి కేసీఆర్‌ను దొరతనానికి నిలువెత్తు నిదర్శనమని అభివర్ణిస్తున్నారు. అదే సమయంలో ఆ పక్కనే ఉన్న ఎర్రబెల్లి దయాకర్‌రావును, రాష్ట్రం విడిపోయినా తెలంగాణలో కూడా చక్రం తిప్పుతున్న కేవీపీ రామచంద్రరావు కూడా వెలమ దొరలే అన్న సంగతి మరిచిపోతున్నారు. గడీల అధికారాన్ని ఎప్పుడో గల్లంతు చేశామని చెప్పే కొందరు ఉద్యమ కారులు కూడా ఈమధ్య దొరలవాదానికి వంతపాడుతున్నారు. ఇప్పుడు రాజకీయ చర్చల వాదోపవాదాల్లో వినబడుతున్న దొరతనానికి నిర్వచనం ఏమిటో మాత్రం ఎవ్వరూ చెప్పడం లేదు.

వెలమ కులమే దొరల కులం అని కొందరు దళిత బహుజన మేధావులు భాష్యం చెప్పవచ్చు. దానిని వర్గ పోరాటాల్లో ఉన్నామని చెప్పేవాళ్ళు ఎలా సమర్థిస్తారు? దొరతనం కులంతో మాత్రమే రాలేదు, ఆధిపత్యం, అహంకారం కలిస్తేనే దొరతనం. అది కేసీఆర్‌లో ఉన్నట్టే దామోదర రాజనర్సింహలో, దానం నాగేందర్‌లో కూడా ఉండవచ్చు. కులంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పుట్టినట్టే మావోయిస్టు పార్టీ అగ్రనాయకుడు ముప్పాళ్ళ లక్ష్మణరావు కూడా పుట్టారు. అంతేకాదు కులంతో సంబంధం లేని సర్ ఆర్థర్ కాటన్‌ను కూడా ఆంధ్రాలో కాటన్ దొర అనే అంటారు, తెలుగు ప్రజలంతా బ్రిటిష్ పాలకులను తెల్లదొరలనే పిలిచారు. అలాగే ఆదివాసీ తెగల నాయకుల్లో కూడా దొరలున్నారు. అయినా పార్లమెంటరీ రాజకీయాల్లో దొరెవరో, దొంగెవరో తేలడం కష్టం. ఒక్కసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్న వాళ్ళ ఆస్తులు, భూముల వివరాలు, అధికారంలో ఉన్నప్పుడు నాయకుల్లో ఉండే అహంకారం చూసిన వాళ్లకు దొరతనానికి కులంతో పనిలేదని అర్థమౌతుంది. అదొక ఆధిపత్య వర్గం. ఉద్యమకాలంలో ఇటువంటి కుల వాదనే కొందరు ‘మేధావులు’ ప్రొఫెసర్. కోదండరాం విషయంలోనూ తెచ్చారు. ఆయన కోదండరామ్‌రెడ్డి అని, అగ్రవర్ణ, ఫ్యూడల్ భావజాలానికి ఆయన ప్రతీక అని ప్రచారం చేశారు.

పోటీగా కుల సంఘాలు, జేఏసీలు కూడా పెట్టి తెలంగాణవాదానికి తూట్లు పొడిచే ప్రయత్నం చేశారు. ఇప్పుడూ అదే జరుగుతుంది. అయినా ఎన్నికలతో దొరతనం, కులతత్వం పోతుందని ఎవరైనా నమ్మితే అది భ్రమే. ఈ ఎన్నికల్లో అగ్రకులాలు మరింత బలంతో ముందుకు వస్తున్నాయి. కులపరంగా రెడ్డి సామాజిక వర్గం ఆధిక్యతలో ఉన్న కాంగ్రెస్ తెలంగాణలో 42 ఓపెన్ స్థానాల్లో 35 ఒక్క రెడ్డి సామాజిక వర్గానికే కేటాయించింది. టీఆర్‌ఎస్ 12 చోట్ల వెలమలను 39చోట్ల రెడ్లను రంగంలోకి దింపింది. అలాగే తెలంగాణను బీసీలకు ఇనాంగా ఇచ్చిన చంద్రబాబు సగం సీట్లను బీజేపీకి ఇచ్చేశారు. మిగిలిన వాటిలో రెడ్డి సామాజిక వర్గానికి 16 సీట్లు, వెలమలకు మూడు ఇచ్చి ఇక్కడ పెద్దగా జనాభా లేకపోయినా తన సొంత సామాజిక వర్గానికి ఆరు సీట్లు కేటాయించారు. 18 స్థానాలు మాత్రమే బీసీలకు కేటాయించిన ఆయన బీసీని ముఖ్యమంత్రిని చేస్తానని బుకాయిస్తున్నారు. ఇదే టీఆర్‌ఎస్‌కు కూడా వర్తిస్తుంది.

ఈసారి కూడా కేసీఆర్ తన సహజ రీతిలో తప్పులు చేసుకుంటూ పోతున్నారు. అనేకచోట్ల ఉద్యమకారులను, టీఆర్‌ఎస్ కోసం అహరహం పనిచేసిన వాళ్ళను ఆపార్టీ పక్కనపెట్టింది. చెరుకు సుధాకర్, దాసోజు శ్రవణ్, కర్నె ప్రభాకర్, ఎర్రోళ్ల శ్రీనివాస్, మందుల సామేలు ఇట్లా పార్టీని కంటికి రెప్పగా కాపాడిన వాళ్లకు అనేక మందికి బలమైన కులం కాదనే కారణంతో టీఆర్‌ఎస్ మొండిచేయి చూపింది. అలాగే కుటుంబ ఆధిపత్యాన్ని మరింత విస్తరించే రీతిలో టికెట్లను కేటాయించుకుంది. అన్ని పార్టీల లాగే టీఆర్‌ఎస్ కూడా అగ్రకులాలకే పెద్దపీట వేసింది. రెడ్లకు 39, వెలమలకు 12 స్థానాలు ఆ పార్టీ కేటాయించింది. ఇట్లా శాసనసభలో కుర్చీలన్నీ అగ్రకులాలకే రిజర్వు చేసి సామాజిక తెలంగాణ నిర్మిస్తామని ప్రజలను పరిపాలనలో భాగస్వాములను చేస్తామని, సాధికారత సాధిస్తామని చెపితే అమాయకులు తప్ప ఎవరు మాత్రం నమ్ముతారు.

అలాంటి అమాయకుల కోసమే కొందరు పదేపదే దొరతనం మీదికి దృష్టి మళ్లిస్తున్నారు. ఎన్నికల సందర్భంగా తెలంగాణ అభివృద్ధి, పునర్నిర్మాణం అందులో భాగంగా సామాజిక సాధికారత సాధించాల్సిన ప్రణాళిక మీద చర్చ జరగాల్సి ఉంది. తెలంగాణ జేఏసీ కూడా అటువంటి ప్రజా మేనిఫెస్టో ఒకటి ప్రకటించింది. అనేక కుల, వృత్తి సంఘాలు తమ తమ ఆకాంక్షలకు అనుగుణంగా మేనిఫెస్టో ఉండాలని భవిష్యత్ తెలంగాణలో తమకు న్యాయం జరగాలని కోరుతున్నారు. ఇటువంటి మౌలిక విషయాల వైపు చర్చ వెళ్ళకుండా ఉండేందుకే కొన్నిశక్తులు ఇప్పుడు దొరతనం, ఉద్యమ ద్రోహం వంటి వాటిని ప్రస్తావిస్తున్నాయి. ఈ ఊకదంపుడు వాదనలో ఎవరు ఉద్యమకారులో,ఎవరు ద్రోహులో తేలడం కూడా కష్టంగానే ఉంది. పన్నెండేళ్ళ టీఆర్‌ఎస్ పోరాట చరిత్ర ఒక్క కొండా సురేఖ చేరికతో పాప పంకిలం అయిపోయిందని కొందరు తీర్పులు చెపుతున్నారు.

అదే సమయంలో అరవైఏళ్లుగా తెలంగాణ ఆకాంక్షను అణచివేసి, వందలమంది ఉద్యమకారుల చావులకు, వేలాదిగా కేసులకు వేధింపులకు కారణమైన కాంగ్రెస్‌ను తెలంగాణ ఇవ్వడం ద్వారా పునీతమైందని కూడా ప్రచారం చేస్తున్నారు. వీపుల మీది గాయాలు మానిపోకముందే, తలల మీద కేసులు తొలగిపోకముందే కొందరు ఉద్యమకారులు కాంగ్రెస్ జెండాలు మోస్తున్నారు. అంతేకాదు ఒకప్పుడు కాంగ్రెస్ శవయాత్రలు, పిండ ప్రధానాలు చేసిన వీళ్ళే ఇప్పుడు తెలంగాణ ఇచ్చిన పార్టీగా అది పవిత్రం అయిపోయినట్టు చెపుతున్నారు. ఇదంతా ఒక రాజకీయ వ్యూహం. ఉద్యమకాలంలో టీఆర్‌ఎస్ అండతో కాంగ్రెస్, టీడీపీ నాయకులను అలాగే జగన్ ను తెలంగాణలో అడుగు పెట్టనివ్వద్దని ప్రకటించిన జేఏసీ ఇప్పుడు కొన్ని పార్టీలకు మినహాయింపు ఇస్తోంది. జగన్‌ను తెలంగాణకు రప్పించిన సురేఖను ద్రోహిగా ప్రకటిస్తున్నారు. మంచిదే కానీ అంతకంటే డాబుగా చంద్రబాబును తెలంగాణలో తిప్పిన ఎర్రబెల్లి మీద ఎందుకని నోరుమెదపడం లేదు. అలాగే కొత్త పెళ్లికొడుకును పల్లకీలో ఊరేగించినట్టు కిరణ్ కుమార్‌రెడ్డిని తెలంగాణ జిల్లాల్లో రచ్చబండలకు మోసుకు తిరిగిన మంత్రులకు ఎలా మద్దతు ఇస్తున్నారు. ఈ మధ్య చాలామంది కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింది అంటున్నారు.

ఇది ప్రజా ఉద్యమాలను తక్కువ చేసి చూపేమాట. ఎవరో ఇస్తే కాదు తెలంగాణ ప్రజలు నిలబడి పోరాడి సాధించుకున్నది. అది ఉద్యమ ఫలితం. కాంగ్రెస్ మాత్రమే కాదు, అక్కడ ప్రభుత్వంలో ఎవరున్నా ప్రజాస్వామ్యంలో ప్రజా ఉద్యమాలను గౌరవించి తలవంచాల్సిందే. కొందరు కాంగ్రెస్ ఇవ్వకపోతే తెలంగాణ వచ్చేదే కాదు అంటున్నారు. నిజమే కావొచ్చు, కానీ తెలంగాణ ఇవ్వకుండా ఏ ఒక్కరైనా ఓట్లకోసం గ్రామాల్లోకి వచ్చేవారా అన్నది ఆలోచించాలి. ఇవన్నీ ప్రజల ఆత్మగౌరవాన్ని పోరాట స్ఫూర్తిని కించపరిచే మాటలు. ఈ సంగతి కాంగ్రెస్ నేతలు, వారిని అభిమానిస్తోన్న తెలంగాణవాదులు కూడా గుర్తిస్తే మంచిది. ఓటు వేసే ముందు తెలంగాణ ఉద్యమంలో దొరెవరో, దొంగెవరో ప్రజలు గమనించాలి.

నమస్తే తెలంగాణ సౌజన్యంతో..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *