Mission Telangana

మరో రెండు రోజుల్లో డిస్సీ, గ్రూప్-4 ఉద్యోగాల నోటిఫికేషన్లు : మంత్రి హరీష్ రావు

మరో 2-3 రోజుల్లో 9 వేల గ్రూప్ -4 ఉద్యోగాల భర్తీకి అనుమతి రానున్నదని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన 91 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వేగంగా జరుగుతోందని, ఇప్పటికే 52 వేల ఉద్యోగాల భర్తీకి అనుమతులిచ్చామని, రాబోయే కొద్ది రోజుల్లోనే మిగతా 28 వేల ఉద్యోగాల భర్తీకి అనుమతులు ఇవ్వనున్నట్లు మంత్రి హరీష్ రావు వివరించారు. గడిచిన ఎనిమిదేళ్ల కాలంలో లక్షా 30 వేల ఉద్యోగాలు ఇచ్చామని, 11 వేల కాంట్రాక్ట్ పోస్టులు భర్తీ చేస్తామని, మరో 80 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతోందని వివరించారు. బిజెపి అధికారంలోకి వచ్చాక ఏం చేసిందని ప్రశ్నించారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారని, దాని ప్రకారం ఇప్పటి వరకు 8 ఏళ్లలో 16 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉద్యోగాలు ఇవ్వలేదు కానీ ఉన్న ఉద్యోగాలు ఊడగొడుతున్న బిజెపికి సరైన గుణపాఠం చెప్పాలని హరీష్ రావు పిలుపునిచ్చారు.

గురువారం సంగారెడ్డి పట్టణంలో కొత్త పింఛనుదారులకు మంత్రి హరీశ్‌ రావు స్మార్టు కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భారత దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం 2016 రూపాయల పెన్షన్ ఇవ్వడం లేదని, తెలంగాణలో సిఎం కెసిఆర్ మాత్రమే 2016 పెన్షన్ ఇస్తున్నారని తెలియ జేశారు. ఉమ్మడి రాష్ట్రంలో టిడిపి హయాంలో 75 రూపాయలు ఇచ్చేవారని, కొత్త పెన్షన్ అడిగితే ఊళ్లో ఎవరన్నా చనిపోతే ఆ పెన్షన్ మీకు ఇస్తామని చెప్పేవారన్నారు. కాంగ్రెస్ హయంలో 200 రూపాయల పెన్షన్ మాత్రమే ఇచ్చేవారని, కాని తెలంగాణ వచ్చాక, సిఎం కెసిఆర్ మాకు అధికారం ఇస్తే 200 పెన్షన్ ను 1000 వేల రూపాయలు చేస్తామన్నారని, టిఆర్ఎస్ అధికారంలోకి రాగానే 1000 రూపాయలు చేశామని, మళ్లీ అధికారం వస్తే 2016 రూపాయలు చేస్తమని కెసిఆర్ చెప్పిన మాట తప్పకుండా 1000 రూపాయల పెన్షన్ ను రూ. 2016 పెంచారని మెచ్చుకున్నారు. సంగారెడ్డికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న బీదర్, కర్ణాటకలో ఉన్న బిజెపి ప్రభుత్వ రాష్ట్రంలో కేవలం 600 రూపాయల పెన్షన్ మాత్రమే ఇస్తున్నారని విమర్శించారు. 57 ఏళ్లకే పెన్షన్ ఇస్తామని కెసిఆర్ చెప్పారని, కాని కరోనా వల్ల కొంత జాప్యం జరిగిందన్నారు. ఇప్పుడు 57 ఏళ్ల వారికి పెన్షన్లు ఇస్తున్నామని స్పష్టం చేశారు. తెలంగాణ రాకముందు ఒంటరి మహిళలకు, గీత కార్మికులకు, ఎయిడ్స్ రోగులకు, బిడి కార్మికులు పెన్షన్ ఇచ్చిన ప్రభుత్వం ఏదీ లేదని, అందరికీ పెన్షన్లు ఇచ్చిన ఘనత కేసీఆర్ కె దక్కుతుందని హరీష్ రావు ప్రశంసించారు. కాంగ్రెస్ హయాంలో 25 లక్షల మందికి మాత్రమే పెన్షన్లు ఇస్తే, తెలంగాణ వచ్చాక కెసిఆర్ 45 లక్షల మందికి ఆసరా పెన్షన్లు ఇస్తున్నారని, ఏడాదికి రూ. 12 వేల కోట్లు, నెలకు రూ.1000 కోట్లు ఆసరా పెన్షన్ల కోసం ప్రభుత్వ ఖర్చు చేస్తోందన్నారు.

పేదవాడికి పది కేజీల బియ్యం, 2016 పెన్షన్ ఇస్తుందని, వారు ఆత్మగౌరవంగా బతకడానకేనని, కానీ బిజెపి ఉచితాలు అనుచితమని అంటోందన్నారు. బడా కంపెనీలకు బిజెపి 12 లక్షల కోట్లు ఖర్చు చేసిందని, రెక్కాడితే డొక్కాడని పేదలకు పెన్షన్లు ఇస్తే ఉచితాలు, అనుచితమని అంటోందని మండిపడ్డారు. నాలుగొందలున్న గ్యాస్ సిలిండర్ ధరను కేంద్ర బీజేపీ ప్రభుత్వం 1200 కు పెంచిందని, పెట్రోల్, డిజీల్ ధరలు పెంచిందని ధ్వజమెత్తారు. టిఆర్ఎస్ పేద ప్రజలకు పంచే కార్యక్రమం పెడితే, బిజెపి ప్రభుత్వం కార్పోరేట్లకు లక్షల కోట్లు పంచి పెడుతుందన్నారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కింద పేదింటి ఆడపిల్ల పెళ్లికి లక్ష రూపాయల సాయం ప్రభుత్వం అందిస్తోందని, ప్రభుత్వ ఆసుపత్రులకు కాన్పుకెళ్తే 12 వేల రూపాయల సాయం, కెసిఆర్ కిట్, మంచి బోజనం పెట్టి, ఆటో కిరాయి ఇచ్చి ఇంటి దగ్గర దింపుతున్నామన్నారు. రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని, రైతు బీమాతో పాటు రెండు పంటలకు పది వేల రైతుబంధు కింద సాయం చేస్తున్నామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *