mt_logo

బిహార్‌తో తెలంగాణకు అవినాభావ సంబంధం : సీఎం కేసీఆర్

దక్షిణ గంగగా పిలిచే గోదావరి ప్రవాహ సదృశ్యంగా బిహార్‌తో తెలంగాణకు అవినాభావ సంబంధం ఉన్నదని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. బీహార్ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ గల్వాన్‌ అమరవీరుల కుటుంబాలతోపాటు హైదరాబాద్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలకు ఆర్థిక సాయంగా సీఎం నితీష్‌తో కలిసి చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ దేశ రక్షణ కోసం పోరాడుతూ గల్వాన్ లోయలో అమరులైన వీర సైనికుల త్యాగం ఎంతో గొప్పదని కొనియాడారు. వీర సైనిక కుటుంబాలకు తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని చెప్పేందుకే ఇక్కడి వచ్చామని కేసీఆర్ వెల్లడించారు. అమరవీరుల కుటుంబాలకు ఆర్థిక సాయం చేయడం మన బాధ్యత అని అన్నారు. కోల్పోయిన ప్రాణాలను తిరిగి తీసుకురాలేం, కానీ అమరులైన సైనికుల కుటుంబాలకు యావత్ దేశం అండగా ఉండాలనే సందేశం అందరికీ చేరాలని పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమాలతో సైనికులకు, దేశ రక్షణ దళాలకు ఆత్మస్థైర్యం పెరుగుతుందన్నారు. ఇదే సమయంలో తెలంగాణ వికాసంలో భాగస్వామ్యం అవుతున్న బీహార్ బంధువులు ఎంతో మంది ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఘటనలో దురదృష్టవశాత్తు మరణించారని విచారం వ్యక్తం చేశారు. వీరి కుటుంబాలకు కూడా తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం కేసీఆర్‌ చెప్పారు. తెలంగాణకు వస్తున్న వలస కూలీలను తెలంగాణ ప్రగతి ప్రతినిధులుగా పేర్కొన్న సీఎం కేసీఆర్‌.. కరోనా సమయంలో వారు ఇబ్బంది పడకుండా దగ్గరుండి మరీ ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో అభివృద్ధి బాటలో సాగుతున్న యువ రాష్ట్రమని, తమ రాష్ట్రాభివృద్ధిలో బిహార్‌కు చెందిన వేల మంది శ్రామికులు భాగస్వామ్యాన్ని అందించారని చెప్పారు. గొప్ప ప్రభుత్వంగా చెప్పుకునే కేంద్ర ప్రభుత్వం.. కరోనా సమయంలో ప్రత్యేక రైళ్ళను నడపాలని కోరినా పట్టించుకోలేదని విచారం వ్యక్తం చేశారు. బిహార్‌ కార్మికుల కోసం ప్రత్యేక రైళ్ళను ఏర్పాటు చేసి ఎంతో మందిని వారి స్వస్థలాలకు తరలించామని వెల్లడించారు. తెలంగాణకు వలస వచ్చిన వారందరికి మా రాష్ట్రాభివృద్ధిలో భాగస్వామ్యం ఉన్నదని భావిస్తున్నట్లు చెప్పారు. జయ ప్రకాశ్ నారాయణ్ జన్మించిన ఈ పవిత్ర భూమి నుంచి ప్రజల చైతన్యంతో ప్రారంభమయ్యే ప్రతీ మార్పు శాంతికి దారి తీసిందని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *