mt_logo

ఒమిక్రాన్ పై వదంతులు నమ్మవద్దు : మంత్రి కేటీఆర్

సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నెలాఖరులోగా రాష్ట్రంలో 100% వ్యాక్సినేషన్‌ పూర్తి చేయాలని క్యాబినెట్‌ సబ్‌కమిటీ అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. దీనికోసం పంచాయతీ, మున్సిపల్‌, విద్య, ఆరోగ్యం సహా అన్ని శాఖల సమన్వయంతో ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అమలు చేయాలని తెలిపింది. కరోనా కట్టడి, వ్యాక్సినేషన్‌పై ప్రభుత్వం నియమించిన క్యాబినెట్‌ సబ్‌ కమిటీ బుధవారం హైదరాబాద్‌లోని బీఆర్కేభవన్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించింది. దీనికి వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అధ్యక్షత వహించగా, సబ్‌కమిటీలోని ఐటీమంత్రి కేటీఆర్‌, విద్యాశాఖమంత్రి సబితాఇంద్రారెడ్డి పాల్గొన్నారు. కొవిడ్‌ వ్యాక్సినేషన్‌, ఒమిక్రాన్‌ వేరియంట్‌ నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా కలెక్టర్లు, అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ నెలాఖరుకు వ్యాక్సినేషన్‌ పూర్తి చేసేందుకు ఆవాసాలు, వార్డులు, సబ్‌సెంటర్లు, మున్సిపాలిటీలు, మండలాల వారీగా ప్రణాళిక రూపొందించాలని జిల్లా కలెక్టర్లకు సూచించారు. వ్యాక్సినేషన్‌లో దేశంలోని అనేక రాష్ట్రాల కంటే తెలంగాణ ముందువరుసలో ఉన్నదని, పంచాయతీరాజ్‌, పురపాలకశాఖల సహకారంతో వేగం గా జరుగుతున్నదని వెల్లడించారు.

ఒమిక్రాన్‌ పై ప్రజలను చైతన్య పరచాలి : కేటీఆర్‌

ఒమిక్రాన్‌ గురించి ప్రజలు ఆందోళన చెందవద్దని మంత్రి కేటీఆర్‌ తెలియజేసారు. కరోనా నియంత్రణ చర్యలను పాటిస్తూ, అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కరోనాపై సోషల్‌ మీడియాలో జరిగే తప్పుడు ప్రచారాల పట్ల అప్రమత్తంగా వ్యహరించాలని కలెక్టర్లకు సూచించారు. సీఎస్‌ నుండి, వైద్యారోగ్యశాఖ నుంచి వచ్చే సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రసార మాధ్యమాల ద్వారా ప్రజలకు చేరవేస్తూ.. వారిని చైతన్యవంతం చేయాలని చెప్పారు. రాష్ట్రస్థాయిలో, జిల్లాల్లో అందుబాటులో ఉన్న బెడ్స్‌ సమాచారం అందించాలని, కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను తిరిగి ప్రారంభించాలని, క్షేత్రస్థాయిలో అన్నిరకాల వసతులను యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేయాలని మంత్రి హరీష్ రావు ఆదేశించారు. పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్లలో వ్యాక్సినేషన్‌ శిబిరాలు ఏర్పాటుచేసి 100 శాతం లక్ష్యాన్ని సాధించాలని మంత్రి సబిత అధికారులకు సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ఎక్సైజ్‌ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్‌ కుమార్‌ తోపాటు పలు శాఖల కార్యదర్శులు, ఉన్నతాధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *