హాంగ్ కాంగ్, తైవాన్ పర్యటనలో ఉన్న ఐటీ మంత్రి కేటీఆర్ రాష్ట్రానికి భారీ ఎత్తున పెట్టుబడులు వచ్చేందుకు కృషి చేస్తున్నారు. తైవాన్ లో జరిగిన ఇండియా తైవాన్ కో ఆపరేషన్ ఫోరంలో డీలింక్ కంపెనీ ప్రతినిధితో రాష్ట్ర ప్రభుత్వం తరపున ఐటీ శాఖ కార్యదర్శి జయేష్ రంజన్ రూ. 350 కోట్ల పెట్టుబడులకు ఎంవోయూపై సంతకం చేశారు. ఇంటర్నెట్ వినియోగంలో ఉపయోగించే వైర్ లెస్ పరికరాల తయారీలో ప్రపంచ మార్కెట్ లీడర్ గా ఉన్న డీలింక్ కంపెనీ రాష్ట్రానికి రావడం వల్ల సుమారు 1000 మందికి ప్రత్యక్ష ఉపాధి, ఇంకా ఎన్నోరెట్లు పరోక్ష ఉద్యోగాల కల్పన జరగనుంది.
డీలింక్ కంపెనీ సీఈవో డగ్లస్ ఓసియోతో సమావేశమైన మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ కంపెనీ ఏర్పాటుకు అన్ని విధాలా సహకరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, డీలింక్ కంపెనీతో కుదుర్చుకున్న ఎంవోయూ ద్వారా డీలింక్ ఇండియా-హైదరాబాద్ లో తన కార్యాలయాలను విస్తృతపర్చడంతో పాటు ప్రపంచ స్థాయి పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుందని, వీటితో పాటు నెట్ వర్కింగ్ ట్రైనింగ్ సెంటర్ పేరుతో ఒక అకాడమీని ఏర్పాటు చేసి స్థానిక యువతకు శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పిస్తుందని చెప్పారు.